వివాదాస్పద మాజీ IAS అధికారి పూజ ఖేద్కర్ తండ్రిపై మరో కేసు
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని బెదిరించి, విధులకు ఆటంకం కలిగించాడన్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై కేసు నమోదయ్యింది.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూణే జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న తహసీల్దార్ స్థాయి అధికారి దీపక్ అకాడే ఫిర్యాదు మేరకు బండ్‌గార్డెన్ స్టేషన్ పోలీసులు దిలీప్ ఖేద్కర్‌పై కేసు నమోదు చేశారు.
పూణే జిల్లాలో పూజా ఖేద్కర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినా..తన కూతురికి క్యాబిన్ ఏర్పాటు చేయాలని దిలీప్ ఖేద్కర్ ఆదేశించారని దీపక్ అకాడే తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కమిషన్‌కు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారని పూజ ఖేద్కర్ ఎంపికను ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రద్దు చేసింది. భవిష్యత్తులో పరీక్షలకు హాజరుకాకుండా డీబార్ చేసింది. ఢిల్లీలో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత కనిపించకుండా పోయారు.
పూజా తల్లి మనోరమ ఒక భూ వివాదంలో ముల్షి ప్రాంతంలో ఒక వ్యక్తిపై తుపాకీతో బెదిరించారు. ఈ కేసులో దిలీప్ ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు కాగా.. పూణె రూరల్ ఆయన భార్య మనోరమను అరెస్టు చేశారు. ఇటీవలే ఆమె బెయిల్‌పై విడుదలైంది.