బైజ్యూస్ దివాలా సమస్య పరిష్కారం కాగానే మళ్లీ ప్రారంభిస్తా
‘‘నేను దుబాయ్‌కి పారిపోయానని ప్రజలు అనుకోవడం దురదృష్టకరం. మా నాన్నగారి ట్రీట్‌మెంట్ కోసం వచ్చాను.’’ - బైజ్యూస్ రవీంద్రన్
ఎడ్టెక్ సంస్థ, బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ రుణదాతలకు హామీ ఇచ్చారు. డబ్బు తిరిగి చెల్లిస్తానన్నారు. అయితే ఓ కండీషన్ పెట్టారు. రుణదాతలు తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటేనే అని మెలికపెట్టారు. నాలుగేళ్లలో తొలిసారిగా విదేశాల నుంచి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఉపాధ్యాయుడి నుంచి వ్యాపారవేత్తగా మారిన రవీంద్రన్ భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థాపకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
స్పాన్సర్‌షిప్ బకాయిల వ్యవహారంలో బీసీసీఐ (BCCI) దాఖలు చేసిన దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) బెంగళూరు బెంచ్ అనుమతించింది. భారత క్రికెట్ టీమ్‌కు స్పాన్సర్‌షిప్‌నకు సంబంధించి రూ.160 కోట్లు చెల్లించలేదన్నది బీసీసీఐ ఆరోపణ. బైజూస్ ఓ దశలో వెలుగు వెలిగినప్పుడు బీసీసీఐ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2023 నవంబర్ వరకు జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ వ్యవహరించాల్సిఉండగా.. అర్ధంతరంగా అది వైదొలిగింది. ఈనేపథ్యంలో కాంట్రాక్ట్ ముగిసినా రూ.160 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంపై గతేడాది నవంబర్‌లో బైజూస్‌పై ఎన్‌సీఎల్‌టీ కేసు నమోదైంది.
మళ్లీ పుంజుకుంటా..
వర్చువల్‌గా మీడియాతో రవీంద్రన్ మాట్లాడుతూ..‘‘ దివాలా సమస్య పరిష్కారం అయ్యాక తిరిగి పుంజుకుంటా. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా బోధించడం మాత్రం ఆపను. విద్యార్థులకు బోధించకుండా నన్ను ఎవరూ ఆపలేరు. నేను విదేశాలకు పారిపోయానని కొందరు పుకార్లు పుట్టించారు. నేను దుబాయ్‌కి పారిపోయానని ప్రజలు అనుకోవడం దురదృష్టకరం. మా నాన్నగారి ట్రీట్‌మెంట్ కోసం ఏడాది పాటు దుబాయ్‌కి వచ్చాను. పరిస్థితులు ఇక్కడే ఉండేలా చేశాయి.’’ అని వివరణ ఇచ్చుకున్నారు.