"బుల్‌డోజర్‌ న్యాయం" ఆమోదయోగ్యం కాదు: ఖర్గే

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Update: 2024-08-24 13:05 GMT

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. "బుల్‌డోజర్‌ న్యాయం" ఆమోదయోగ్యం కాదని, వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో హింసాత్మక నిరసనకు నాయకత్వం వహించిన వ్యక్తి ఇంటిని కూల్చివేసిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని షాజాద్ అలీ ఇల్లు కూల్చివేయబడింది. హింసకు పాల్పడిన 150 మందిపై బుధవారం కేసు నమోదు చేశాం.”అని ఒక అధికారి తెలిపారు.

‘అమానవీయం, అన్యాయం’

ఒకరి ఇంటిని కూల్చి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేయడం అమానుషం, అన్యాయమని ఖర్గే అన్నారు. “బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే దాడులు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పౌరులలో భయాన్ని కలిగించడానికి బుల్‌డోజింగ్‌ను ఉపయోగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. నేరాలు కోర్టులో నిరూపితం కావాలి. అరాచకాల ద్వారా కాదు." అని ఘాటుగా విమర్శించారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఘటనపై ఎక్స్‌లో స్పందించారు. ‘‘ఎవరైనా నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తే.. దానికి కోర్టులో శిక్ష పడుతుంది. ఆరోపణ వచ్చిన వెంటనే నిందితుడి ఇంటిని కూల్చడం న్యాయం కాదు. చట్టసభల్లో సభ్యులు, చట్టాన్ని కాపాడే వారు, చట్టాన్ని ఉల్లంఘించే వారి మధ్య వ్యత్యాసం ఉండాలి. ' రాజధర్మాన్ని ' నెరవేర్చలేనివాడు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయలేడు. బుల్డోజర్ న్యాయం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.” ఆమె ట్వీట్ చేశారు.

అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకాలోని షా పంచలే గ్రామంలో కొన్ని రోజుల క్రితం జరిగిన మతపరమైన కార్యక్రమంలో రామగిరి మహరాజ్ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది సభ్యులు బుధవారం నిరసనకు దిగడంతో అది హింసకు దారితీసింది. ఇద్దరు పోలీసులకు గాయాలు కాగా చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. హింసాత్మక నిరసనకు నాయకత్వం వహించిన వ్యక్తి ఇంటిని గురువారం కూల్చివేశారు.

Tags:    

Similar News