కేజ్రీవాల్‌ 'షీష్ మహల్'పై బీజేపీ పాట, పోస్టర్..

ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న కసితో ఉన్న కమలం పార్టీ.. కేజ్రీవాల్ "షీష్ మహల్‌"పై కొత్తగా ఓ పాటను, పోస్టర్‌ను రిలీజ్ చేసింది.;

Update: 2025-01-11 13:28 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్సయ్యింది. ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ప్రచారాలూ ఊపందుకున్నాయి.. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న కసితో ఉన్న కమలం పార్టీ.. కేజ్రీవాల్ షీష్ మహల్‌పై కొత్తగా ఓ పాటను రిలీజ్ చేసింది. ఓ పోస్టర్‌ను కూడా బయటకు వదిలింది.

'షీష్ మహల్ ఆపద ఫైలానే వాలోన్ కా అడ్డా' అనే పాట, 'ఆపద-ఎ-ఆజం' పేరుతో పోస్టర్‌ను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. ఈ రెండు కేజ్రీవాల్ అవినీతిని గుర్తు చేస్తాయని చెప్పారు.

లక్ష్యం మార్చుకున్నారు..

"ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానన్న వ్యక్తి తన లక్ష్యాన్ని మార్చుకున్నారు. కాని ప్రజలు మాత్రం అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు," అని సచ్దేవా పేర్కొన్నారు. "మొఘల్ పాలనలో ప్రజలు వారి కోటలను చూడడానికి వెళ్తుండేవారు. కానీ ఢిల్లీ ఆపద-ఎ-ఆజం (కేజ్రీవాల్) నిర్మించిన 'షీష్ మహల్' నగరానికి మచ్చగా నిలిచింది," అని సచ్దేవా ఎద్దేవ చేశారు.

ఆప్‌ను ‘ఆపద’గా అభివర్ణించిన మోదీ

ఎన్నికలకు ముందు రోహిణిలో జరిగిన 'పరివర్తన్ ర్యాలీ'లో మోదీ 'షీష్ మహల్' గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఢిల్లీలో ఆప్‌ను 'ఆపద' ప్రభుత్వంగా అభివర్ణించారు. బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

'షీష్ మహల్' అనేది ఢిల్లీ ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో ఉన్న బంగళాకు బీజేపీ నాయకులు పెట్టిన పేరు. ఇక ఆప్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం, విమానంపై చేసిన ఖర్చును ప్రస్తావిస్తూ ప్రత్యారోపణలను దిగింది.

70 శాసనసభ స్థానాలన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. 

Tags:    

Similar News