ఒడిశాలో S.I.Rపై పార్టీలకు సమాచారం ఇచ్చిన EC
20 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీజేడీ, కాంగ్రెస్ ఏం కోరుకుంటున్నాయి?;
బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R) ఇటీవల ముగిసింది. ఒడిశా(Odisha) లో వచ్చే నెల ప్రారంభంకానున్న ఈ ప్రక్రియపై బిజు జనతాదళ్(BJD), కాంగ్రెస్(Congress) పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సవరణ ప్రక్రియ పారదర్శకంగా చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదంటూనే.. బీహార్‌లోగా చేస్తే మాత్రం నిరసనలు తప్పవని రెండు పార్టీలు హెచ్చరిస్తున్నాయి.
బీహార్(Bihar)లో S.I.R అనంతరం సుమారు 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు. వీరిలో చనిపోయిన వారు, పూర్తిగా వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓటరు కార్డు కలిగి ఉన్న వారు ఉన్నారని ఎలక్షన్ కమిషన్ (Election Commission) పేర్కొంది. అయితే ప్రతిపక్ష ఓటర్లను జాబితా నుంచి కావాలని తొలగించారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
‘పార్టీలకు సమాచారం ఇచ్చాం..’
‘‘ఒడిశాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ 2002లో జరిగింది. 20 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ సెప్టెంబర్‌లో మొదలవుతుంది. S.I.R గురించి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చాం. సవరణ ప్రక్రియ కారణంగా ఈ సారి పోలింగ్ కేంద్రాల సంఖ్య 38 వేల నుంచి 45వేలకు పెరుగుతుంది’’ అని ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (CEO) RS గోపాలన్ వివరించారు.
‘పారదర్శకత కోరుకుంటున్నాం..’
"S.I.Rనిష్పాక్షికంగా జరిగితే మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ బీహార్‌లో లాగా చేస్తే భిన్నంగా ఆలోచించాల్సి వస్తుంది. S.I.R పట్ల ఓ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది,’’ అని BJD ప్రతినిధి లెనిన్ మొహంతి పేర్కొన్నారు.
‘ఎందుకు ఆలస్యం చేశారు?’
"బీహార్‌లో చేసినట్లుగా S.I.R ముసుగులో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తే పార్టీ మౌనంగా ఉండదు. ప్రతి పదేళ్లకోసారి ఈ ప్రక్రియ చేపట్టాలన్న నిబంధన ఉన్నా.. ఎందుకు ఆలస్యం అయ్యింది?’’ అని BJD ఎమ్మెల్యే, మాజీ మంత్రి PK దేబ్ ప్రశ్నించారు.
‘తారుమారు చేస్తే ఉద్యమమే..’
S.I.R చేపట్టి ఒడిశాలో అధికార పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడాలని చూస్తోందని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (OPCC) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆరోపించారు.
ఓటరు జాబితాను తారుమారు చేయాలని చూస్తే మాత్రం రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.