బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ వర్సెస్ అమిత్ షా
నితీష్ పాలనను రిమోట్ కంట్రోల్‌తో పోల్చిన లోక్‌సభా ప్రతిపక్ష నేత.. మహాఘటబంధన్ కూటమిని వంచనదారుల కూటమిగా అభివర్ణించిన కేంద్ర హోం మంత్రి..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల(Assembly Polls)కు కేవలం కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో ఎన్డీఏ, మహాఘట్ బంధన్ (Mahagathbandhan) కూటమి నేతలు ప్రచార జోరు పెంచారు. ఒకే రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) బుధవారం (అక్టోబర్ 29) ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
'సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం'
బీహార్‌లో ప్రభుత్వాన్ని బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తోందని రాహుల్ ఆరోపించారు. నితీష్ కుమార్ కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారని ముజఫర్‌పూర్‌లో ధ్వజమెత్తారు.
‘‘సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం. సామాన్య పౌరులకు విలువ ఇవ్వకుండా, కొంతమంది బిలియనీర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. బీహార్ లాంటి ప్రాంతాలు వెనకబడి పోవడానికి అదే కారణం’’ అని విమర్శించారు.
కాంగ్రెస్ కుల గణన కోసం చేస్తున్న ప్రయత్నాలను రాహుల్ పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర, హర్యానాలో జరిగినట్లుగానే బీహార్‌లో ఎన్నికలను తారుమారు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
‘ఆ రెండు ఖాళీగా లేవు’
ఇటు దర్భంగాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కూడిన మహాఘటబంధన్‌ను వంచనదారుల కూటమిగా అభివర్ణించారు. "లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజశ్విని బీహార్ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారు, కానీ రెండు పదవులు ఖాళీగా లేవు" అని షా పేర్కొన్నారు.
జాతీయ భద్రతపై ప్రతిపక్షాల వైఖరిని లక్ష్యంగా చేసుకుని హోంమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సభ్యులను జైలులో ఉంచుతుందా? అని ప్రశ్నించారు. “ఈ సంస్థను నిషేధించింది ఎన్డీఏ ప్రభుత్వమే. బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే పిఎఫ్‌ఐ సభ్యులు జైలులోనే ఉంటారని మీరు అనుకుంటున్నారా?” అని అడిగారు.
దర్భాంగాలో తర్వలో చేపట్టే మెట్రో, ఎయిమ్స్, విమానాశ్రయం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ..మేము మైథిలికి అధికార హోదా ఇచ్చాం. మాన్యుస్క్రిప్ట్ సంరక్షణ కోసం రూ.500 కోట్లతో కేంద్రాన్ని నిర్మిస్తున్నాం" అని చెప్పారు.