బీహార్ ఎన్నికలు: భారత కూటమి మేనిఫెస్టో విడుదల
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న RJD నాయకుడు తేజస్వి యాదవ్..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు(RJD), ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) బుధవారం (అక్టోబర్29) ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తే ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఇంటికో ఉద్యోగం..
"ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ పథకం (OPS) అమలు, ప్రభుత్వ విభాగాలలో కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్‌ల నిర్మాణం, జర్నలిస్టుల కోసం హాస్టళ్లు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. స్వయంసహాయ మహిళా సంఘాల (“జీవికా దిదీలు”) సభ్యులకు నెలకు రూ. 30వేల వేతనం, ఐటీ పార్కులు, SEZలు, పాల, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపన, ఐదు కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణం, ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేసి ఉన్నత విద్యా, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, EBCలపై దాడుల నిరోధానికి ప్రత్యేక చట్టం, స్థానిక సంస్థల్లో (పంచాయతీలు, మునిసిపాలిటీలు) EBCలకు 30% రిజర్వేషన్, భూమిలేని కుటుంబాలకు భూ కేటాయింపు చేస్తామని తేజస్వి హామీ ఇచ్చారు.
ఎన్డీఏ(NDA)పై తేజస్వి విమర్శలు
ఎన్డీఏ తన మ్యానిఫెస్టోను విడుదల చేయకపోవడంపై తేజస్వి తీవ్ర విమర్శలు గుప్పించారు. తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హామీలను నెరవేర్చాల్సిందన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యపై స్పందిస్తూ.."మహాఘట్బంధన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 నెలల్లో చేసినవి.. గిరిరాజ్ సింగ్ తన మొత్తం జీవితంలో చేయలేదు" అని తేజస్వి పేర్కొన్నారు.