బార్ కౌన్సిల్ నుంచి గ్యాంగ్ రేప్ నిందితుడి బహిష్కరణ ..
నిందితులను కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు;
కోల్‌కతా(Kolkata) లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం (Gang Rape) ఘటనను తొమ్మిది సభ్యుల సిట్ (S.I.T) బృదం దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. నిందితులు అత్యాచారానికి ముందు, ఆ తర్వాత ఫోన్‌లో ఎవరెవరిని సంప్రదించారు? ఏం మాట్లాడారు? అనే విషయాలు తెలుసుకునేందుకు వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
సౌత్ కలకత్తా లా కాలేజీలోని సెక్యూరిటీ గార్డు రూంలో జూన్ 25 వ తేదీన గ్యాంగ్ రేప్ జరిగింది. కాలేజీ పూర్వ విద్యార్థి మోనోజిత్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రోజు (26వ తేదీ) సాయంత్రం నిందితులు బల్లిగంజ్ స్టేషన్ రోడ్, ఫెర్న్ ప్లేస్ పరిసరాల్లో తిరిగినట్టు మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా తెలుస్తోంది.
ముగ్గురూ లా విద్యార్థుల కావడంతో కస్టడీలో పోలీసులను పక్కదారి పట్టించేందుకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వడంలేదు. జూన్ 26 ఉదయం మిశ్రాతో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయన ఛటర్జీ రెండుసార్లు మాట్లాడారు. అయితే ఆ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందని తెలియాల్సి ఉంది. సెక్యూరిటీ రూంలో స్వాధీనం చేసుకున్న బెడ్ షీట్‌పై ఒక మరక కనిపించింది. దానికి అత్యాచారంతో ఏదైనా సంబంధం ఉందా? అని పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాలేజీ బహిష్కరణ
పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ బుధవారం మిశ్రాను సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు అతని పేరును దాని జాబితా నుండి తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేస్తామని కౌన్సిల్ చైర్మన్ అశోక్ దేబ్ చెప్పారు. సామూహిక అత్యాచారం కేసులో అరెస్టయిన మరో ఇద్దరు విద్యార్థులను కూడా కాలేజీ బహిష్కరించింది. ప్రధాన నిందితుడు మిశ్రా 2024 నుంచి తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్నాడు.