ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి దీక్ష విరమణ..

హర్యానా రాష్ట్రం నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన మంత్రి అతిషి దీక్షను విరమించారు.

Update: 2024-06-25 08:54 GMT

దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరతపై ఆమ్ ఆద్మీ పార్టీ జల మంత్రిత్వ శాఖ మంత్రి అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ముగించినట్లు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.

‘‘దాదాపు ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన అతిషి ఆరోగ్యం క్షీణించింది. ఆమె రక్తంలో చక్కెర స్థాయి 36 mg/dLకి పడిపోయింది. పరీక్షించిన వైద్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని చెప్పారు. లేదంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దాంతో ఆమెను తెల్లవారుజామున 3.45 గంటలకు ఆసుపత్రిలో చేర్చాం.ప్రస్తుతం ఐసీయూలో ఆమెకు చికిత్స జరుగుతోంది.’’ అని సంజయ్ సింగ్ తెలిపారు.

ప్రధానికి లేఖ రాస్తా..

హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా కోసం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని ఆప్ ఎంపీ తెలిపారు. ఈ అంశాన్నితమతో పాటు మిత్రపక్షాలు కూడా పార్లమెంటులో లేవనెత్తుతాయని చెప్పారు.

గత మూడు వారాల్లో యమునా నదిలో ఢిల్లీ వాటాను హర్యానా 100 ఎంజిడి తగ్గించింది. అయితే గత రెండు రోజులుగా ఇది పెరగడం ప్రారంభించిందని, ప్రస్తుతం 90 ఎంజీడీల కొరత మాత్రమే ఉందన్నారు.

వాటా తగ్గించిన హర్యానా..

తాగునీటి అవసరాలకు ఢిల్లీ పక్క రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, హర్యానాలపై ఆధారపడుతుంది. హర్యానా నుంచి 613 లక్షల గ్యాలెన్లు రావాలి. కొన్ని వారాలుగా అక్కడి నుంచి 513 లక్షల గ్యాలెన్లు మాత్రమే వస్తున్నాయి. 100 లక్షల గ్యాలెన్లు తక్కువ కావడం వల్ల ఢిల్లీలోని 28 లక్షల మంది మంచినీటి కొరత ఏర్పడింది. హర్యానా రాష్ట్రంలోని హత్నికుండ్ బ్యారేజీ అన్ని గేట్లను మూసివేశారని అతిషి గతంలో ఆరోపించారు.

Tags:    

Similar News