‘ఈవీఎంల గురించి కాంగ్రెస్ ప్రశ్నలకు జవాబివ్వండి’

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా EVMల్లో తేడాలున్నాయని కాంగ్రెస్ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Update: 2024-10-13 15:06 GMT

ఇటీవల ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్‌ లేవనెత్తిన ప్రశ్నలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ ఆదివారం డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగం జరిగి ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో తేడాలున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హర్యానాలో 10 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కూడా కాంగ్రెస్ సాధారణ మెజారిటీ సాధించలేకపోవడంపై అనుమానాలున్నాయంటూ ఫిర్యాదు చేశారు.

అక్టోబర్ 8న కౌంటింగ్ సమయంలో కొన్ని ఈవీఎంలలో బ్యాటరీలు 99 శాతం చార్జింగ్ అయ్యాయని 20 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ అయిన ఈవీఎంలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని కాంగ్రెస్ వాదిస్తోంది.

‘‘నేను ఈవీఎంల దుర్వినియోగం జరిగి ఉంటుదని భావిస్తున్నాను. అది ఏ మేరకు జరిగిందో చెప్పలేను. ఈవీఎంలను నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. గతంలో కూడా చాలా ప్రకటనలు ఇచ్చాను. ఇప్పుడు కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు EC సమాధానమివ్వాలి" అని సిబల్ విలేఖరులతో అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించనివని, కొన్ని స్థానాల్లో ఈవీఎంలలో తేడాలున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంల చార్జింగ్‌పై ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బ్యాటరీ శాతం 80 శాతం కంటే తక్కువగా ఉన్న చాలా EVM మెషీన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారు" అని కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు గత బుధవారం ఈసీ అధికారులను కలిసి ఏడు ఫిర్యాదులను లిఖితపూర్వకంగా అందజేశారు. ఇలాంటి మరిన్ని ఫిర్యాదులను వివరంగా సమర్పిస్తామని వారు చెప్పారు.

Tags:    

Similar News