అధికారులపై చిన్న ఈగ వాలినా ఆ బాధ్యత వైఎస్‌ఆర్‌సీపీదే: పవన్ కళ్యాణ్
ఏదో ఒక అంశాన్ని సాకుగా చూపుతూ గత ప్రభుత్వంపైన, ఆ పార్టీ నేతలపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే పవన్ కళ్యాణ్, మరో సారి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో ఉంటూనే.. స్వపక్షంపైన సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులపై చిన్న ఈగ వాలినా వైఎస్‌ఆర్‌సీపీనే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఉన్నతాధికారులను హెచ్చరిస్తూ బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఆ బెదిరింపులను సుమోటోగా తీసుకొని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన కేసులు నమోదు చేస్తామని వార్నింగ్‌లు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీపై బెదిరింపులకు పాల్పడ్డారని, తాము అధికారంలోకి వస్తే ఆయన చర్యలు తీసుకుంటామని, పదవీ విరమణ పొందినా తర్వాత ఆయన తెలంగాణలో ఉన్నా..అక్కడ నుంచి తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.
గుంటూరులో ఆదివారం జరిగిన అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ అధికారులపైన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ తీరును తప్పుబట్టారు. అధికారులపై వాళ్ల వ్యవహార శైలి బాగలేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులపట్ల బాధ్యతగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుని సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొస్తామని జగన్ మాట్లాడటం, డీజీపీపైన బెదిరింపులకు పాల్పడటం ఏంటని జగన్‌ను ప్రశ్నించారు. బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరని తీవ్ర స్థాయిలో పవన్ మండిపడ్డారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులపై చిన్న ఈగ వాలినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అటవీ శాఖ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. రూ. 5 కోట్లు విరాళాలు సేకరించి అటవీ శాఖకు ఇస్తానని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అమర వీరులకు స్తూపాలు నిర్మించి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు.