ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్‌ఆర్‌సీపీ దూరం

వైఎస్‌ఆర్‌సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-07 10:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి ప్రధాన రాజకీయ పార్టీ తప్పుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ దూరంగా ఉంటుందని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఆ పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు. అనంతరం వారు గురువారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ కృష్ణా–గుంటూరు, తూర్పుగోదావరి–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. ఓటర్లు ప్రశాంతంగా బయటికి వచ్చి ఓటేసే పరిస్థితి లేదని పేర్ని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైన, దాని పాలన తీరుపైన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పాలన నెలకొందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయించుకున్నట్లు పేర్ని నాని స్పష్టం చేశారు.

Tags:    

Similar News