చంద్రబాబు ఢిల్లీ చక్కర్ల మీద షర్మిల సెటైర్

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. చంద్రబాబు వ్యవహారం ‘అయిననూ పోయి రావలెను హస్తినకు’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

Update: 2024-07-17 13:22 GMT

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. చంద్రబాబు వ్యవహారం ‘అయిననూ పోయి రావలెను హస్తినకు’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన చంద్రబాబు.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదంటూ చురకలంటించారు. సీఎం హాదాలో ఆయన ఇప్పటికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారని, కేంద్రమంత్రులతో వరుస భేటీలు అయ్యారని, కానీ తీపి కబురు ఏమీ లేదంటూ విసుర్లు విసిరారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. జూలై 16న ఢిల్లీలో పర్యటించడంపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన పర్యటనల వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారామె.

ఎందుకీ సలాంలు?

కేంద్రం ముక్కుపిండి విభజన సమస్యల పరిష్కారానికి పట్టు పట్టాల్సింది పోయి.. ఢిల్లీ చుట్టూ తిరుగుతూ బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అని ఎందుకు సలాంలు కొడుతున్నారని నిలదీశారు షర్మిల. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయినా ఇప్పటి వరకు కేంద్ర మంత్రులతో కానీ, ప్రధాని మోదీతో కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ మీద కూడా ఎందుకు ప్రకటన చేయించలేక పోయారని, చేతకాలేదా.. లేదా వాళ్లు అంగీకరించలేదా? అని ప్రశ్నించారు.

‘‘ఇప్పటి వరకు నాలుగుసార్లు హస్తినలో పర్యటించిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా చేశారా? విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఉండదని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులపై క్లారిటీ ఇప్పించ గలిగారా? రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎటువంటి సహాయం అందిస్తుందో చెప్పగలిగారా?’’ అని ప్రశ్నించారు. ‘ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్నట్లే బీజేపీ సిద్దాంతం కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే రాష్ట్రానికి మేలు చేయగలుగుతారని హితవు పలికారు.

టీడీపీ కౌంటర్..

అయితే షర్మిల చేసిన ట్వీట్‌కు టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ జరగదని? కేంద్ర పెద్దల చేత చెప్పించ గలిగారా అని ప్రశ్నిస్తున్న షర్మిలమ్మ.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెడ్‌డీ కుమార స్వామి మాటలు వినలేదా అని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్ర మంత్రే స్వయంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని చెప్పారని, విమర్శించేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు అంశాలపై పూర్తి అవగాహన తెచ్చుకుంటే మంచిదంటూ టీడీపీ శ్రేణులు బదులిస్తున్నాయి. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి అందించే సహాయంపై కేంద్రంతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, పోలవరం ప్రాజెక్ట్‌కు కావాల్సిన అదనపు నిధులకు సంబంధించి బడ్జెట్‌లో ప్రకటన ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారు బదులిస్తున్నారు.

Tags:    

Similar News