ఓవైపు తిడుతూనే అన్నయ్య దగ్గర అప్పు తీసుకున్న షర్మిల.. ఇదిగో సాక్ష్యం

సీఎం జగన్, షర్మిల మధ్య ఉన్నవి ఆస్తి తగాదాలేనా? ఒకవైపు జగన్‌ను తిట్టిపోస్తూనే మరోవైపు చేయిచాయి అప్పులు తీసుకున్నారా? ఇదిగో సాక్ష్యం..

Update: 2024-04-21 06:55 GMT

ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నాచెల్లెలు. అన్న కోసం చెల్లి దాదాపు 3వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది. అంత అన్యోన్యంగా ఉన్న వారి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వీరి మధ్య ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారిగా వీరి మధ్య దూరం పెరిగిపోయింది. తాజాగా ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల.. తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య చేసులో అన్న సీఎం జగన్‌ను ప్రతి రోజూ టార్గెట్ చేస్తున్నారు. వివేకాందరెడ్డిని హత్య చేయించిన అవినాష్‌ను అన్నయ్య జగన్ కాపాడుతున్నారని బహిరంగంగా చెప్తూనే ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇంత వ్యతిరేకత రావడానికి కారణం మాత్రం ఇప్పటికీ తెలియదు. అయితే తాజాగా వీరి మధ్య డబ్బులకు సంబంధించే గొడవలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు షర్మిల నామినేషన్ అఫిడవిట్ బలం చేకూరుస్తుంది. దాంతో పాటుగా ఒకవైపు అన్నపై విమర్శలు, నిందలు మోపుతూనే మరోవైపు అప్పులు తీసుకున్నారని, అందుకు ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ సాక్ష్యమని అంతా అంటున్నారు.

అసలు అఫిడవిట్‌లో ఏముంది!

వైఎస్ షర్మిల.. కడప ఎంపీ అభ్యర్థిత్వానికి తన నామినేషన్‌ను శనివారం దాఖలు చేశారు. అందులో తన ఆస్తులు, అప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో ఆమె అప్పుల వివరాలు ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారాయి. ఆమె అప్పుల వివరాలు చూసిన ప్రతి ఒక్కరూ ఇదెక్కడి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. షర్మిలకు మొత్తం రూ.82 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. వాటిలో అత్యధిక శాతం తన అన్న సీఎం జగన్‌కు అప్పు ఉన్నట్లు ఆమె తన అఫిడవిట్‌లో వెల్లడించారు. తన వదిన వైఎస్ భారతికి కూడా అప్పు ఉన్నట్లు ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు రూ.82 కోట్ల 15 వేల అప్పులు ఉన్నానని, వదిన భారతికి రూ.19 లక్షల 56 వేల 682 రూపాయలు అప్పు ఉన్నట్లు ఆమె అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ నగదును తాను వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నట్లు షర్మిల వివరించారు. దీంతో అన్నను తిడుతూనే ఆయన దగ్గర అప్పులు ఎలా తీసుకున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

జగన్, షర్మిల వివాదానికి ఆస్తులే కారణమా!

ఇప్పటికే ఆస్తుల పంపకాల విషయంలో సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య తగాదాలు జరిగాయని, అందుకే వారి మధ్య విభేదాలు పెరిగి వేరయ్యారని టాక్ నడుస్తోంది. ఆ కారణంగానే షర్మిల.. తెలంగాణకు షిఫ్ట్ అయ్యారని, అధికార బలం చూసుకునే తనకు ఆస్తిలో వాటా ఇవ్వని అన్నకు బుద్ధి చెప్పాలని ఆమె కూడా వేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారని వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అప్పుల వల్లే జగన్, షర్మిల మధ్య దూరం పెరిగిందని, విభేదాలు చెలరేగాయని వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత తన అవసరాల కోసం అప్పుగా జగన్ కాస్త సొమ్మును షర్మిలకు ఇచ్చారని, ఆ తర్వాత ఆస్తుల పంపకాల విషయంలో అప్పుగా ఇచ్చిన నగదును కూడా వాటాలో లెక్కించడంతోనే వీరిద్దరికి గొడవలు మొదలయ్యాయా? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి. అసలు ఇంత మొత్తం.. షర్మిలకు జగన్ అప్పుగా ఎందుకు ఇచ్చారు అన్న విషయంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

షర్మిల ఆస్తుల వివరాలిలా!

వైఎస్ షర్మిల దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే.. ఆమె పేరిట రూ.123 కోట్ల 26 లక్షల 65 వేల 163 ఆస్తులు ఉన్నాయి. ఆమె భర్త అనిల్ పేరిట 45 కోట్ల 19 లక్షల 72 వేల 529 రూపాయల ఆస్తి ఉంది. ఇందులో షర్మిలకు 9 కోట్ల 29 లక్షల 58 వేల 180 రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె భర్త అనిల్ పేరిట 4కోట్ల 5 లక్షల 92 వేల 365 రూపాయాల స్థిరాస్తులు ఉన్నాయి. అంతేకాకుండా షర్మిల ఆదాయం 97 లక్షల 14 వేల 213 రూపాయలు, అనిల్ ఆదాయం 3 లక్షల 261 రూపాయలుగా ఉంది. వాటితో పాటుగా షర్మిల దగ్గర 3 కోట్ల 69 లక్షల 36 వేల విలువైన బంగారు ఆభరణాలు, 4 కోట్ల 61 లక్షల 90 వేల 688 రూపాయల విలువైన రత్నాల ఆభరణాలు ఉన్నాయని, తన భర్త అనిల్ దగ్గర 81 లక్షల 60 వేల విలువైన బంగారు ఆభరణాలు, 42 లక్షల 60 వేల 461 రూపాయల రత్నాల ఆభరణాలు ఉన్నట్లు ఆమె తన అఫిడవిట్‌లో వివరించారు.

షర్మిలపై ఉన్న కేసులు

ఇప్పటి వరకు తనపై 8 కేసులు ఉన్నాయని వైఎస్ షర్మిలన తన అఫిడవిట్‌లో వెల్లడించారు. వాటిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

Tags:    

Similar News