చంద్రబాబు పేదల వ్యతిరేకని మరోసారి నిర్ధారితమైంది.. సర్కార్ ప్రశ్నించిన జగన్

కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-16 14:17 GMT

కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. తాను పేదల వ్యతిరేకని మరోసారి నిరూపించుకున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పేదల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని, అందుకు సీబీఎస్ఈని రద్దు చేస్తూ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని జగన్ మండిపడ్డారు. సీబీఎస్ఈ రద్దుతో నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారని, పేదల నుంచి చదువును లాగేసుకుంటున్నారని ఘటుగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యారంగం తిరోగమనం చెందుతోందని విమర్శించారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే విద్యారంగం తిరోగమనం చెందడం మొదలైందని, స్కూళ్లను మళ్ళీ మొదటికి తీసుకెళ్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా పోస్ట్ పెట్టారు.

ప్రభుత్వ విద్యార్థలంటే వివక్ష ఎందుకు?

‘‘గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో చంద్రబాబు.. తాను పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి?’’ అని ప్రశ్నించారు జగన్.

కూటమి ప్రభుత్వం ఉద్దేశం అదేగా..!

‘‘దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్‌, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్స్‌, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంతజేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, ఈ “ఈనాడు’’ కోర్టులకువెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు’’ అని హెచ్చరించారు.

ప్రభుత్వ విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు..

‘‘మన గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువకాదు చంద్రబాబు? వీళ్లంతా తెలివైన వారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షలమంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణకూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారికంటే గొప్పచదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు. అలాంటివారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్‌. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణంచేశారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబు?’’ అని ప్రశ్నించారు.

చదువకు మాత్రమే ఆ శక్తి

‘‘పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి. మేం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు’’ అని హితవు పలికారు జగన్.

Tags:    

Similar News