సీఎం ఇంటి ముందు ‘యోగా’ ధర్నా

యోగా టీచర్లు తమకు జీతాలు ఇవ్వాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేశారు. పోలీసులు వీరిని బలవంతంగా బయటకు పంపించారు.;

Update: 2025-07-03 04:53 GMT
సీఎం చంద్రబాబు ఇంటిముందు యోగాసనంతో ధర్నా చేస్తున్న టీచర్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు యోగా టీచర్లు యోగా చేస్తూ గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల మంది యోగా టీచర్లు ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచి పది గంటల వరకు యోగాసనం వేసి మౌనంగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విద్యాశాఖ, ఆయుష్ శాఖ ఇచ్చిన జీవో ప్రకారం స్కూళ్లలో టీచర్లుగా పనిచేస్తున్నాం. మాకు మూడు సంవత్సరాలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకే సీఎం ఇంటి వద్దకు వచ్చామని వారు తెలిపారు.


యోగా టీచర్లు కావడం వల్ల అందరూ పద్దతి ప్రకారం సీఎం ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని యోగాసనం వేసి మౌనంగా ధర్నా ప్రారంభించారు. వీరు కార్యక్రమాన్ని ప్రారంభించగానే స్థానిక డిఎస్పీ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ధర్నా చేసేందుకు వీలు లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. టీచర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపించారు.


ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో ఉన్నారు. ఇంటి వద్ద ఉన్న మంత్రి లోకేష్ తమతో మాట్లాడతారనుకొన్నాం. కానీ ఆయన కూడా అవకాశం ఇవ్వలేదని టీచర్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 907 స్కూళ్లలో 1056 మంది యోగా టీచర్లను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల క్రితం నియమితులైన వీరికి ఇప్పటి వరకు జీతం ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరారు. ఆ ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున జీతాలు వస్తాయనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వటం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News