ఏచూరి వారసుడు బీవీ రాఘవులు? తాత్కాలికంగా కారత్ దంపతుల్లో ఒకరికి ఛాన్స్
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరో తెలుగు వ్యక్తి ఎంపికయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేరళ, బెంగాల్ యూనిట్లు ఓకే అంటే బీవీ రాఘవులు ఏచూరి వారసుడైనట్టే.;
సీతారామ్ ఏచూరి ఆకస్మిక మరణంతో సీపీఎం తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది. ప్రస్తుత పాలిట్ బ్యూరో నుంచే ఎవరో ఒకర్ని తాత్కాలికంగా నియమించుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడు మధురైలో పార్టీ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ఆ సభలో కొత్త నాయకుణ్ణి ఎన్నుకునేంత వరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరో ఒకర్ని నియమించుకోవాలి. పార్టీ నిబంధనావళి ప్రకారం ఏ వ్యక్తి అయినా మూడు సార్లకు మించి ప్రధానకార్యదర్శిగా ఉండడానికి వీలు లేదు. 75 ఏళ్ల వయసు మించకూడదు. మూడు సార్లుగా ఆ పోస్టులో ఉన్న సీతారాం ఏచూరి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. దానికి ముందే ఆయన మరణించడంతో ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఏచూరి వారసుడిగా రాఘవులు, ఎంఏ బేబీ, బృందా కారత్ లలో ఎవరో ఒకర్ని నియమిస్తారని భావిస్తున్నారు.