సెజ్ బాధితులకు వైసీపీ సాయం.. ప్రకటించిన బొత్స

అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని, ఆర్థిక సహాయం అందిస్తుందని మాజీ మంత్రి, విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Update: 2024-08-24 12:59 GMT

అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని, ఆర్థిక సహాయం అందిస్తుందని మాజీ మంత్రి, విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున వైసీపీ అందిస్తుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన బాధితులను కలిసిన సందర్భంగా తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏ మూల ప్రమాదం జరిగిన సహాయక చర్యలు క్షణాలపైన అందేవని, పరిహారం సైతం గంటల వ్యవధిలో అందించామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని, ప్రమాదం జరిగిన గంటల తర్వాత కూడా సదరు మంత్రి సైతం వివరాలు లేవని చెప్పే స్థితి ఏర్పడిందంటూ విచారం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పట్టించుకోలేదు..

‘‘అచ్యుతాపుంర సెజ్‌ ప్రాంతంలోని ఎసెన్షియా సంస్థలో భారీ పేలుడు సంభవిస్తే గంటల తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రభుత్వం ఈ ప్రమాదం గురించే పట్టించుకోలేదు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదు. ఏది ఏమైనా.. విషాదం వేళ రాజకీయాలు ఎందుకు? వెంటనే పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.

చంద్రబాబు ఏం చేశారు..

‘‘ఎల్‌జీ పాలిమర్స్ జరిగిన వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాం. కలెక్టర్, ఎమ్మెల్యే సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తెల్లవారుజామున జరిగినా యంత్రాంగం స్పందించడంలో ఆలస్యం జరగలేదు. మరోవైపు కరోనా ఉన్నా సహాయక చర్యల్లో లోపం జరగలేదు. అచ్యుతాపురం ఘటన బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము ప్రశ్నించిన తర్వాత ఆయన కదిలి వచ్చారు. వచ్చిన వారు బాధితులకు కనీసం ఒక మంచినీళ్ల బాటిల్ కూడా అందివ్వలేదు’’ అని విమర్శించారు.

అసలు ఘటన ఏంటంటే..

అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఏడుగురు మృతి చెందగా, మొదటి అంతస్తు శ్లాబు కింద పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Tags:    

Similar News