ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రక్షాళన!

ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రక్షాళన మొదలైంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరంల అధ్యక్షుల కొనసాగింపు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు మార్పు.

By :  Admin
Update: 2024-09-27 13:38 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైసీపీ ఇప్పుడు ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఉత్తరాంధ్రలోనూ మార్పులు, చేర్పులను చేపట్టింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీపై అంతగా శ్రద్ధ చూపని ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు జిల్లాల్లో సరైన నాయకత్వంపై దృష్టి సారిస్తోంది. వచ్చే ఐదేళ్లూ పార్టీని నడిపించగల సత్తా, ఆర్థిక స్తోమత, క్యాడరుపై పట్టు, సామాజికవర్గం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాత వారినే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాత్రం కొత్త వారిని జిల్లా అధ్యక్షులుగా నియమించింది.




 


శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్ల నుంచి వెలమ సామాజికవర్గానికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు అధ్యక్షునిగా ఉన్నారు. తాజా మార్పుల్లో కృష్ణదాసు స్థానంలో ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ప్రసాదరావు ఆసక్తి కనబరచకపోవడంతో మళ్లీ కృష్ణదాసునే కొనసాగిస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను - కాపు) చాన్నాళ్లుగా అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆయన్ను మారిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయి ఉన్న మరో నాయకుడు లేకపోవడం, మరొకరు ముందుకు రాకపోవడం వెరసి చిన్న శ్రీనును మార్చలేదు. దీంతో ఈ దఫా కూడా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాకు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు (ఎస్టీ) కొన్నాళ్లుగా అధ్యక్షునిగా ఉన్నారు. తాజా మార్పుల్లోనూ ఆయననే కొనసాగిస్తున్నారు.




 


ఉమ్మడి విశాఖ జిల్లాలో మార్పులు..

ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పడిన మూడు జిల్లాల అధ్యక్షులను మార్చేశారు. విశాఖ జిల్లాకు ఏడాది క్రితం నుంచి కోలా గురువులు అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (కాపు)ను నియమించారు. అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బొడ్డేడ ప్రసాదు మార్చి మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు (వెలమ)కు అవకాశం కల్పించారు. ఈ జిల్లాలో కాపు, వెలమ సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. విశాఖ అధ్యక్షునిగా కాపులకు కేటాయించడంతో అనకాపల్లికి వెలమ సామాజికవర్గానికి ఖరారు చేశారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఉన్నారు. తాజాగా జరిగిన మార్పుల్లో ఆమె స్థానంలో పాడేరు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు (ఎస్టీ) కు అవకాశం కల్పించారు.




 


భాగ్యలక్ష్మి మనస్థాపం?

పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మికి ఇటీవల ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు ఇవ్వలేదు. అరకు ఎంపీ సీటైనా ఇస్తారని ఆశించినా అదీ జరగలేదు. దీంతో ఆమె పార్టీ జిల్లా అధ్యక్షురాలిగానే కొనసాగుతూ వచ్చారు. తాజా నియామకాల్లో ఆమెనే కొనసాగిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆమెను వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షురాలి పదవితో పాటు పీఏసీ మెంబరుగాను నియమించారు. అయినప్పటికీ ఈ పదవుల పట్ల సంతృప్తి చెందని ఆమె తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న మనస్థాపంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


 



ఉప ముఖ్యమంత్రులకు ప్రాధాన్యత..

ఉత్తరాంధ్ర వైసీపీలో మాజీ ఉప ముఖ్యమంత్రులకు ఈసారి పార్టీ నియామకాల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడులు ఇద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రులే. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న పరీక్షిత్ రాజు కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి భర్తే,


 



విశ్వేశ్వరునికి 'విశ్వాస'ం ఉందా ?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తమ్మీద వైసీపీ రెండంటే రెండు సీట్లకే పరిమితమైంది. ఆ రెండూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాలు. ఆ పార్టీ పరువు నిలిపిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కూటమి వైపు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఇప్పటికే ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కొందరు టీడీపీలోను, మరికొందరు జనసేన పార్టీలోనూ చేరుతున్నారు. ఆ జాబితాలో విశ్వేశ్వరరాజు కూడా ఉన్నారన్న ప్రచారం వైసీపీలో పెను దుమారాన్నే రేపుతోంది. అయితే ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు. గతంలో (2014-19) అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా జగన్కు సన్నిహితుడిగా పేరు పడ్డారు. తన ఆఖరి శ్వాస వరకు వైసీపీలోనే కొనసాగుతానని చెప్పే వారు. కానీ కొన్నాళ్లకు టీడీపీలోకి చేరిపోయారు.


 



అలాగే వైసీపీ నుంచి పాడేరు ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికైన గిడ్డి ఈశ్వరి కూడా ఆ పదవిలో ఉండగానే టీడీపీలోకి జంప్ చేసిన సంగతిని కొందరు గుర్తు చేస్తున్నారు. వైసీపీ పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు సరిగా లేవని, వాటి ఆధారంగా ఆయన్ను అనర్హుడిగా చేసే దారులను టీడీపీ నేతలు వెతుకుతున్నారని, కూటమిలో చేరితే ఆ బెడద లేకుండా చేస్తామన్న ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది. పార్టీ మారే ఆలోచన మానుకుంటే మరింత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా తాజాగా ఆయనకు అల్లూరి జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఒకపక్క ఎమ్మెల్యే పదవి, మరోపక్క జిల్లా అధ్యక్ష పదవి ఆయనకేనా? అంటూ ఆ జిల్లాలోని వైసీపీ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ అసలే సంఖ్యా బలం స్వల్పంగా ఉన్న పార్టీలో ఒక ఎమ్మెల్యే జారిపోయినా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో తాను వైసీపీని వీడనని, ఆ పార్టీలోనే కొనసాగుతూ అధినేత వైఎస్ జగన్పై విశ్వాసాన్ని చూపుతానని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు స్పష్టం చేసినట్టు తెలిసింది. 

Tags:    

Similar News