చంద్రబాబు కేసులకు భయపడేది లేదు
తమై ఆరోపణలు రువు చేయలేక పోతే చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.;
రాజకీయ కక్షలతోనే కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతున్నారని, సీఎం చంద్రబాబు నాయుడు పెట్టే కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. కేసులు పెట్టే కొద్ది తాము అంత బలంగా పోరాటం చేస్తామని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్, మార్గదర్శి కుంభకోణం వంటి అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు అవకాశం ఇవ్వాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును చంద్రబాబు రోజు తలుచుకుంటున్నారని, అందుకే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. తాము పుంగనూరులో కొనుగోలు చేసిన భూములను అటవీ భూములంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమపై ఏదో రకంగా కక్ష సాధించాలనే విధంగానే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము కొనుగోలు చేసింది అటవీ భూమి కాదని, ప్రైవేటు భములని రికార్డులు చెబుతున్నాయని, 1968లోనే గెజిట్ విడుదల చేసిందన్నారు. ఈ భూములకు సంబంధించి ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మదనపల్లిలో ఫైల్స్ తగులబెట్టారని తమపై ఆరోపణలు చేశారని, రకరకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తనకు డిస్టలరీలో వాటా ఉందని ఆరోపణలు చేస్తున్నారి, వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. తమపై చేసిన ఆరోపణలను ఇంత వరకు రుజువు చేయలేక పోయారని, ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు కూడా రుజువు చేయలేక పోతే చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలను ఉల్లంఘించిందనే విషయాన్ని ఆర్బీఐ సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిందని, వేలాది మంది డిపాజిటర్లు మార్గదర్శిని నమ్ముకొని నష్ట పోయారని, పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడుగా ఉన్న తాను.. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కోరుతూ లేఖలు రాస్తానని మిథున్ రెడ్డి వెల్లడించారు.