‘కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం’.. ప్రజలకు చంద్రబాబు హామీ

వైసీపీ హయాంలో కబ్జాలకు, అక్రమాలకు రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. అతి త్వరలోనే ఎవరైనా కబ్జా చేయాలంటే భయపడేలా కొత్త చట్టాన్ని తెస్తామని హామీ ఇచ్చారు.

Update: 2024-07-15 12:08 GMT

రాష్ట్రంలో గత ఐదేళ్లలో జరిగిన సహజ వనరుల దోపిడీకి సంబంధించి సీఎం చంద్రబాబు ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ పాలనలో భారీగా భూదందా జరిగిందని, పేదలను నిలువునా ముంచిన ప్రభుత్వం వైసీపీదేనంటూ మండిపడ్డారు చంద్రబాబు. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా కబ్జా చేసేశారని, అడవులను కూడా అన్యాక్రాంతం చేశారని ధ్వజమెత్తారు. వేల ఎకరాలను వైసీపీ నేతలు తమ సొంతం చేసుకున్నారని, అధికారులను బెదిరించి మరీ పత్రాలు సిద్ధం చేయించుకున్నారని కూడా ఆరోపించారు సీఎం. వీటన్నింటికి తమ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెడుతుందని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా కబ్జా చేయాలంటే ఎవరైనా భయపడేలా చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ పాలనలో భూములను కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గత ఐదేళ్లలో జరిగిన అన్ని అక్రమాలను సరిదిద్దుతామని చెప్పారాయన.

ఆ చట్టాన్ని తెస్తాం..

‘‘భూహక్కు పత్రం పేరుతో చేసిన ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేసింది వైసీపీ సర్కార్. దాంతో పాటుగా భూముల రీసర్వే పేరుతో ఇచ్చిన పట్టాలపై తన బొమ్ము ముద్రించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. ల్యాండ్ టైట్లింగ్ చట్టం మేరకు ప్రైవేటు వ్యక్తులను నియమించవచ్చు. ఈ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించాలి. ఈ క్రమంలో ప్రజలంతా కూడా తమ భూములను ఒకసారి సరిచూసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రంలో భూ కబ్జాలను అరికట్టేలా సరికొత్త చట్టాన్ని తీసుకొస్తాం. గుజరాత్ అమలు చేస్తున్న ల్యాండ్ గ్రాబించి చట్టం తరహాలోనే ఇది కూడా పని చేస్తుంది. ఒక్కసారి ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో ఎవరైనా భూమిని కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం. ఎవరివైనా భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. వారి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ఈ చట్టం ద్వారా కబ్జా చేసిన వ్యక్తులే తమ యాజమాన్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది’’ అని వివరించారు బాబు.

అది వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యం

ఏ ప్రభుత్వం కూడా అటవీశాఖ, గనుల శాఖను ఒకే వ్యక్తికి కేటాయించవు. ఇలా ఎన్నడూ జరగలేదు. కానీ వైసీపీ పాలనలో మాత్రం ఒకే వ్యక్తికి ఈ రెండు శాఖలను కేటాయించిందని గుర్తుచేశారు. ‘‘అలా రెండు శాఖలను నిర్వర్తిస్తున్న వ్యక్తి.. తూర్పుగోదావరి జిల్లాలో లేటైట్ గనులను బలవంతంగా లాక్కున్నారు. ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు. కుప్పం నియోజకవర్గంలోనే అక్రమంగా గనులు తవ్వారు. దౌర్జన్యంగా గనులను దోపిడీ చేశారు. ప్రశ్నించిన వారిని బెదిరించారు. ఆఖరికి ద్రవిడ యూనివర్సిటీలో అక్రమంగా మైనింగ్ చేశారు. ఇకపై ఇలా జరగదు. గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకువస్తాం’’ అని వివరించారు చంద్రబాబు.

వైసీపీ కప్పానికి ఎందరో బలి

‘‘మైనింగ్, క్వారీ లీజుల్లో వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడింది. బెదిరిపులు, జరిమానాలతో గనులను కొల్లగొట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్న నిబంధలను గాలికొదిలేశారు. నిబంధనలతో సంబంధం లేకుండా తవ్విపోశారు. అధికారులను డిప్యుటేషన్‌పై తెచ్చుకుని మరీ అక్రమాలను కొనసాగించారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను కూడా తీసుకొచ్చారు. అక్రమంగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపారు. తమ తవ్వకాలకు ఇబ్బంది ఉండకూడదని నదులు, కాలువలపై రోడ్లు వేశారు. తమ ఇసుక దందాను ఎవరైనా ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెట్టారు. గుంటూరు, కృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల్లో ఇసుక మాఫియానే నడిచింది. ఆఖరికి కప్పం మోతలు కూడా మోగించారు. వైసీపీ నేతలకు కప్పం కట్టలేక చాలా మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇసుక దందాతో ఐదేళ్లలో రూ.9,750 కోట్లు కొల్లగొట్టారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 30 రోజుల్లోనే ఉచిత ఇసుకను అందించాం. కేవలం రవాణా, తవ్వకాల చార్జీలను మాత్రమే ప్రజల నుంచి సేకరించాం’’ అని చెప్పారు.

Tags:    

Similar News