వరద బాధితులకు వైసీపీ సాయం.. అంతా కంటితుడుపు చర్యేనా..!

వరద బాధితులకు సహాయం చేయడానికి వైఎస్ఆర్‌సీపీ ముందుకొచ్చింది. దాదాపు 50 వేల నిత్యావసర సరుకుల ప్యాకెట్లను అందించనుంది.

Update: 2024-09-17 07:41 GMT

వరద బాధితులకు సహాయం చేయడానికి వైఎస్ఆర్‌సీపీ ముందుకొచ్చింది. దాదాపు 50 వేల నిత్యావసర సరుకుల ప్యాకెట్లను అందించనుంది. ఇప్పటికే వీటిని సిద్ధం చేసిందని, వరద ప్రభావిత ప్రాంతాల్లో వీటిని పంచడానికి అంతా సిద్దమైందని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ వివరించారు. వరదల కారణంగా 33 కార్పొరేషన్లు ముంపుకు గురయ్యాయని, బుడమేరు వరద విషయంలో ప్రభుత్వ అలసత్వం కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. మూడు రోజుల పాటు వరదనీటిలో ఉన్న ప్రజల కష్టాలు వర్ణనాతీతమని, వరదలకు వారు అన్నీ కోల్పోయారని వ్యాఖ్యానించారాయన. కానీ తమ పార్టీ కార్యకర్తలు అనేక సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు చేయూతనందించారని, వరదల కష్టాల నంుచి బయటపడటానికి వైసీపీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని చెప్పుకొచ్చారు. వరద బాధితులకు అండగా ఉండాలని వైసీపీ నిశ్చయించుకుందని, ఆ దిశగా వరదలొచ్చిన తొలి రోజు నుంచే రంగంలోకి దిగిందని, ప్రజలకు అన్ని వేళలో చేయూతగా నిలిచిందని ఆయన అన్నారు.

చంద్రబాబు బుద్దే అబద్దం

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ.. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బుద్దే అబద్దమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. కోటి రూపాయల విరాళం ప్రకటించడంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగు నీరు, పాలు పంపిణీ చేశామని, దాంతో పాటుగా బాధితులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని కూడా నిర్ణయించామని ఆయన చెప్పారు. పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో 50వేల మందికి 7రకాల సరుకులతో కూడిన నిత్యావసరాల కిట్‌ అందించనున్నామని చెప్పారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనని, చెప్పిన అబద్ధాన్నే పదేపదే చెప్పి నిజయం చేయాలని చూస్తారంటూ మండిపడ్డారు. వరద వస్తుందని ముందే తెలిసినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. వరదలనేవి అర్థరాత్రో, అప్పటికప్పుడులో రావని, వరదలపై ఎటువంటి మానిటరింగ్ లేదని, ఇంకేమైనా అంటే అంతా గత ప్రభుత్వమేనంటూ వైసీపీపై బురదజల్లుతున్నారని బొత్స ఎద్దేవా చేశారు.

 

ప్రభుత్వ సాయమేది: బొత్స

ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడంపై కాకుండా వరద బాధితులకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ‘‘విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపినీ ప్రారంభించాం. వీటిని ప్రతి ఇంటికీ అందించాలని పార్టీ నిశ్చయించింది. ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయం బాధితులకు అందడం లేదు. ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం అత్యంత అలసత్వం, నిర్లక్ష్యం కనబరుస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకుని వరద బాధితులకు అండగా నిలవాలి’’ అని సూచించారు.

వైసీపీ చర్యలు కంటితుడు చర్యలేనా..

అయితే వరదల వచ్చి దాదాపు అంతా తగ్గిపోయిన క్రమంలో వరద బాధితులకు నిత్యావసరాలు అందించనున్నామంటూ వైసీపీ ముందుకు రావడం అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. కేవలం కంటితుడు చర్యగానే వైసీపీ ఈ పనులు చేపడుతోందని పలువరు వ్యాఖ్యానిస్తున్నారు. సెప్టెంబర్ నెల ప్రారంభంలో వరదలు వచ్చాయి. అంతా తగ్గిపోయిన సమయంలో దాదాపు 17వ రోజున ప్రజలకు సహాయం అందించనున్నామంటూ వైసీపీ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని టీడీపీ వర్గాలు, పలువురు విమర్శకులు కూడా అంటున్నారు. కాగా ప్రజల దృష్టిని ఆకర్సించడానికి, తామూ వరద బాధితులకు సహాయం చేశామని చెప్పుకోవడానికే వైసీపీ ఈ నిత్యావసరసరుకు నాటకం మొదలు పెట్టిందంటూ పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ప్రకటించిన కోటి విరాళంను ఈ సహాయక చర్యలు, పాలు, తాగు నీరుకే ఖర్చు చేశారా? చేసుంటే ఇన్నాళ్లూ ఎక్కడా వైసీపీ నాయకులు ఎందుకు కనిపించలేదు? నిజంగా వైసీపీ ఇంత సహాయం అందిస్తుంటే బొత్స సత్యనారాయణ పర్యటనకు వస్తే ఆయన ప్రజల నిరసన సెగ ఎందుకు తగిలింది? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి వీటిపై వైసీపీ ఏమని బదులిస్తుందో చూడాలి.

Tags:    

Similar News