విజయసాయిరెడ్డి కోటరీకి వైసీపీ కౌంటర్
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విజయసాయిరెడ్డికి చురకలు అంటించారు.;
By : Admin
Update: 2025-03-13 07:01 GMT
మాజీ రాజ్య సభ సభ్యులు, మాజీ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి బుధవారం చేసిన కోటరీ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. దీంతో విజయసాయిరెడ్డి కోటరీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. అందులో భాగంగా బుధవారమే మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ చేత మాట్లాడించారు. విజయసారెడ్డి చేసిన విమర్శల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, కావాలనే విజయసాయిరెడ్డి చేత అలా మాట్లాడిస్తున్నారని, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ ప్రకారమే విజయసాయిరెడ్డి మాట్లాడారని కౌంటర్ అటాక్ ఇచ్చారు.
తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద గురువారం మాట్లాడారు. విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్ మట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైసీపీకి దూరమయ్యాయనని విజసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో మాట్లాడిన మాటలకు, విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కోటరీ అంటే అది ప్రజలే అని వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పాలని, సీఎం చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? అని ప్రశ్నించారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుందని ప్రశ్నించారు. జగన్ మీద ప్రేమ గురించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కూడా అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఒకరి మీద ప్రేమ పడితే మరొకరి మీద ప్రేమ విరిగి పోతుందని, మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు వర్గాలు ఉన్నాయని, ఒకటి కూటమి వర్గమని, రెండో వైసీపీ వర్గమని, మూడోది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గమన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించారు. ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే వైసీపీ నుంచి వెళ్లి పోయేవారా? ఇదే విధంగా వైసీపీ మీద విమర్శలు చేసే వారా? అంటూ విజయసాయిరెడ్డికి చురకలు అంటించారు. విజయసాయిరెడ్డి చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి కోటరీ అంటూ మాట్లాడుతున్నారు, విజయసాయిరెడ్డి మాటలు చూస్తోంటే తేడాగానే ఉంటున్నాయని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి తాజా మాటలు చూస్తోంటే.. మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు.