అన్నంలో పురుగులు..ఎలా తినాలి
ఈ సారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.;
By : The Federal
Update: 2025-07-23 06:53 GMT
మా మెస్‌ల్లో పురుగుల అన్నం పెడుతున్నారు. తినలేక పోతున్నాం. దీని మీద అనేక సార్లు యూనివర్శిటీ అధికారులకు చెప్పాం. అయినా పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టించుకోవడం లేదు. మళ్లీ మళ్లీ అదే పురుగుల అన్నాన్నే పెడుతున్నారు. పురుగులు ఉన్న అన్నాన్ని ఎలా తినాలి. ఈ సారి మాత్రం ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వదిలేది లేదు. అంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. భారీగా ఆందోళనలు చేపట్టి నిరసనలకు దిగారు. దీనికి ఏయూ మెన్ హాస్టల్స్‌లోని విద్యార్థులతో పాటు లేడీస్ వసతి గృహాల్లోని విద్యార్థినులు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలికారు.
ఈ ఘటన ఆంధ్ర యూనివర్శిటీలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం యూనివర్శిటీ విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. మంగళవారం రాత్రి నుంచి పురుగుల అన్నం మీద విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. మంగళవారం రాత్రి యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనలు బుధవారం ఉదయం రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. పురుగుల అన్నం మాకొద్దు.. నాణ్యమైన అన్నం అందించాలని నినదించారు.
అయితే మంగళవారం రాత్రి రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థుల ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేశారు. మరో వైపు విద్యార్థులు ఏమాత్రం తగ్గలేదు. పోలీసుల బెదిరింపులకు భయపడకుండా మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలను ఉధృతం చేశారు. పురుగల అన్నం విషయాన్ని పలు మార్లు యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి మాత్రం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని యూనివర్శిటీ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.