పలకల కింద పడి నలిగిపోయి మరణించిన కూలీలు

క్రేన్‌ల సహాయంతో పలకలను తొలగించి మరణించిన వారిని పక్కకు తీశారు.;

Update: 2025-05-10 05:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి ముగ్గురు కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పలకల కింద పడి నలిగిపోయి మృత్యువాద పడ్డారు. అత్యంత దారుణమైన ఈ దుర్ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.

గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న లారీ బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద బోల్తాపడింది. మార్టూరు నుంచి చిలకలూరిపేట, పర్చూరు మీదుగా గుంటూరుకు వెళ్తున్న పలకల లోడ్‌ లారీ తిమ్మరాజుపాలెం వద్ద బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లారీలోని పలకలు కిందపడి పోయాయి. ఒక్క సారిగా పలకలన్నీ కింద పడిపోవడంతో వాటి కింద ముగ్గురు కూలీలు పడి నలిగిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 25 ఏళ్ల పాలపర్తి శ్రీను, 37 ఏళ్ల తాళ్లూరి ప్రభుదాస్, 26 సంవత్సరాల తమ్ములూరి సురేంద్రలు మృత్యువాత పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు క్రేన్‌ సహాయంతో కిందపడిపోయిన పలకలను తొలగించి, మరణించిన కూలీలను పక్కకు తీశారు. పాలపర్తి శ్రీనుతో పాటు తాళ్లూరి ప్రభుదాస్‌ మార్టూరుకు చెందిన వారు కాగా తమ్ములూరి సురేంద్ర నూతలపాడుకు చెందిన వ్యక్తి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags:    

Similar News