ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నారా ?

గెలుపోటములను పక్కనపెట్టేసి తాము కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో, గెలవాలనే పట్టుదలతో మహిళా అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Update: 2024-05-01 06:30 GMT

ఎన్నికల్లో గెలుపోటములు దైవాధీనాలని అందరికీ తెలిసిందే. రిజల్టు వచ్చేంతవరకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో ఎవరూ చెప్పలేరు. గెలుస్తారని అనుకున్న వాళ్ళు ఓడిపోయిన సందర్భాలున్నాయి. అలాగే ప్రచారంలో వెనకబడిపోయారనే ప్రచారంలో ఉన్న వాళ్ళు చివరకు గెలిచిన సందర్భాలూ ఉన్నాయి. అందుకనే పోటీలో ఉన్న అభ్యర్ధులు చేయాల్సింది ఏమిటంటే గెలుపుమీద నమ్మకముంచి పోరాడటమే. ఇపుడు ఇదంతా ఎందుకంటే పై సూత్రం ప్రకారం తెలంగాణా పార్లమెంటు ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్ధులు తమ ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నారు. గెలుపోటములను పక్కనపెట్టేసి తాము కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో, గెలవాలనే పట్టుదలతో మహిళా అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అల్లాడిస్తున్న అరుణ

మహబూబ్ నగర్లో బీజేపీ తరపున డీకే అరుణ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ తరపున చల్లా వంశీచంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే పోటీ ప్రధానంగా వంశీ-అరుణ మధ్యే అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి వంశీకి ఉన్న మద్దతుదుకారణంగా ప్రత్యర్ధులు భయపడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. సిక్స్ గ్యారెంటీస్ లో ప్రభుత్వం నాలుగింటిని అమల్లోకి తెచ్చింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఇన్ని ప్లస్ పాయింట్లున్న కారణంగా వంశీ గెలుపు గ్యారెంటీ అనేట్లుండాలి. అయితే అరుణ దెబ్బకు వంశీ చెమటలు కక్కుతున్నారు. ప్రచారంలోభాగంగా ప్రతీగ్రామం, ప్రతీఇల్లు తిరుగుతున్నారు. వంశీపైన కొంత వ్యతిరేకత ఉండటం అరుణకు కలిసొస్తోంది. ఆర్ధిక, అంగ బలాలకు తోడు అరుణకున్న రాజకీయ నేపధ్యం వల్ల బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదనే వాతావరణం కనిపిస్తోందని సమాచారం.

పుంజుకున్న సునీత

ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి పట్నం సునీతా మహేందర్ రెడ్డి దెబ్బకు బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కిందా మీదా అవుతున్నారు. మొదట్లో తన గెలుపు గ్యారెంటీ అన్న ధీమాతో ఉన్న ఈటలకు ఇపుడు చుక్కలు కనబడుతున్నాయి. నియోజకవర్గం పరిధిలోని తన సామాజికవర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకునే ఈటల గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే రోజులు గడిచేకొద్దీ సునీత బాగా పుంజుకుంటున్నారు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరి పోటీచేస్తున్న కారణంగా ఆమెకు కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఆ వ్యతిరేకతను సెట్ చేసుకుని అందరినీ కలుపుకుని వెళుతున్నారు. అధికారంలో ఉండటం, బలమైన రాజకీయ నేపధ్యం, ఆర్ధిక, అంగబలాలకు లోటు లేకపోవటంతో సునీత దెబ్బకు ఈటల అల్లాడిపోతున్నారు. బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.

దూసుకుపోతున్న మాధవి

హైదరాబాద్ లో బీజేపీ తరపున పోటీచేస్తున్న మాధవీలతను మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గంలో ఎంఐఎం అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఓడించటం అంటే మామూలు విషయంకాదు. అసద్ గెలుపుకు దశాబ్దాల రాజకీయ చరిత్రుంది కాబట్టి ఏపార్టీ తరపున ఎవరు పోటీచేసినా పోటీచేయాలి కాబట్టి చేస్తున్నారన్నట్లుగానే ఉంటుంది. గడచిన నాలుగు ఎన్నికల్లో ఇలాగే జరిగినా ఇపుడు పరిస్ధితి కాస్త భిన్నంగా ఉంది. మాధవిని అభ్యర్ధిగా ప్రకటించినపుడు బీజేపీలోనే పెద్దగా మద్దతు దొరకలేదు. అయితే రోజులు గడిచేకొద్దీ ఆమె ప్రచారతీరు, జనాల్లోకి చొచ్చుకుపోతున్న పద్దతి, అసదుద్దీన్ పై చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో బాగా పుంజుకుంటున్నారు. ఓల్డ్ సిటీలోని బస్తీల్లో తమ ఆసుపత్రి తరపున మెడికల్ క్యాంపులు నిర్వహించటం, నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలుండటం మాధవికి బాగా కలిసొస్తోంది. అందుకనే అసద్ కూడా గతంలో లాగ కాకుండా ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరుగుతు తనకు ఓట్లేయమని అడుగుతున్నారు. బీఆర్ఎస్ తరపున గడ్డం శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ తరపున మహమ్మద్ వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు.

చెమటలు పట్టిస్తున్న కవిత

ఇక మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న మాలోతు కవిత సిట్టింగ్ ఎంపీ. కాంగ్రెస్ తరపున పోరిక బలరామ్ నాయక్, బీజేపీ అభ్యర్ధిగా అజ్మీరా సీతారామ్ నాయక్ పోటీచేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండటం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని మెజారిటి అసెంబ్లీ సీట్లలో గెలుపుతో ఎంపీగా తాను ఈజీగా గెలిచిపోతానని బలరామ్ ధీమాగా ఉండేవారు. అయితే రోజులు గడిచేకొద్దీ కవిత బాగా పుంజుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కవితపైన మొదట్లో నెగిటివ్ ప్రచారం చూపించింది. అయినా సరే దాన్నిపట్టించుకోకుండా నియోజకవర్గమంతా గట్టిగా తిరుగుతున్నారు. దాంతో ముందున్న ధీమాను వదిలిపెట్టి బలరామ్ కూడా నియోజకవర్గమంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

పుంజుకున్న కావ్య

వరంగల్ ఎస్సీ నియోజకవర్గంలో కడియం కావ్య పేరును కాంగ్రెస్ చాలా ఆలస్యంగా ప్రకటించింది. బీఆర్ఎస్ తరపున జిల్లా పరిషత్ ఛైర్మన్ మారపల్లి సుదీర్ కుమార్, బీజేపీ తరపున ఆరూరి రమేష్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి మారి టికెట్ తెచ్చుకున్న కావ్యకు పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. పార్టీలోనే ఆమెకు సహకారం తక్కువకాబట్టి తమ గెలుపు ఖాయమని మిగిలిన ఇద్దరు అనుకున్నారు. అయితే రోజులు గడిచేకొద్దీ తండ్రి కడియం శ్రీహరి చాకచక్యంగా తమ వ్యతిరేకులతో మాట్లాడి పరిస్ధితిని అనుకూలంగా మార్చుకుంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన కావ్య నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండటం, తండ్రికి ఉన్న పరిచయాలు, అనుభవాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కావ్య ఇపుడు ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు.

మెరుగైన సుగుణ

ఫైనల్ గా ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్రం సుగుణ ప్రత్యర్ధులకు ధీటైన సవాలు విసురుతున్నారు. బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ ఆత్రం సక్కు, బీజేపీ అభ్యర్ధిగా గోడం నగేష్ ప్రచారంలో దూసుకుపోయారు. వీళ్ళిద్దరికి ఉన్న రాజకీయ నేపధ్యం కారణంగా మొదట్లో బాగా ప్రచారం చేసుకున్నారు. సుగుణ గెలవదని కాంగ్రెస్ నేతల్లోనే చర్చలు జరిగాయి. అయితే రోజులు గడిచేకొద్దీ సుగుణ ప్రచారంలో పుంజుకున్నారు. వృత్తిరీత్యా టీచర్ అయిన సుగుణకు నియోజకవర్గం పరిధిలోని ఇతర టీచర్లు, పిల్లల తల్లి,దండ్రులు మద్దతుగా నిలిచారు. అలాగే ప్రభుత్వం అమలుచేస్తున్న హామీలు తదితరాల కారణంగా సుగుణ ఇపుడు బాగా పుంజుకున్నారు. పార్టీ నేతలు కూడా అందరు మద్దతుగా నిలవటంతో ప్రత్యర్ధులకు ఇపుడు చెమటలు పడుతున్నాయి. మొత్తంమీద తమను చిన్నచూపు చూసిన ప్రత్యర్ధులకు ఆరుగురు మహిళా అభ్యర్ధులు ఇపుడు ప్రచారంలో చెమటలు పట్టిస్తున్నది వాస్తవం. చివరచు రిజల్టు ఎలాగుంటుందో చూడాలి.

Tags:    

Similar News