ఏడు తీర్మానాలతో... సేద్యపు నీటికోసం మరో ఉద్యమం

కరువు ప్రాంత రైతుల కోసం పోరాటానికి సన్నద్ధం అవుతున్నాయి. అనంతపురంలో జరిగిన సదస్సులో రైతు సంఘం ఏడు తీర్మానాలు ఆమోదించింది.

Update: 2024-11-13 13:16 GMT

రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ బడ్జెట్ లో అధికంగా నిధులు కేటాయించాలని ఏపీ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతులను చైతన్యం చేయడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకుని రావడానికి మళ్లీ రాయలసీమ ప్రాజెక్టుల మహాసభ జనవరి నెలలో కడపలో నిర్వహించాలని సంఘం తీర్మానించింది.

రాయలసీమ ప్రాజెక్టుల కోసం సీమ ప్రాంత సీపీఐ నేతలు కడపలోనే 2017లో "రాయలసీమ ప్రాజెక్టుల మహాసభల" పేరిట పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఈ నాటి పార్టీ నేతలు జే. వెంకట్రామిరెడ్డి, ఎన్. శివరామిరెడ్డి, వీకే. ఆదినారాయణరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి (అనంతపురం), డాక్టర్ కే. నారాయణ, వెంకటరత్నం (చిత్తూరు), కర్నూలు నేతలు మమేకం అయ్యారు. ఈ సభలకు అన్నిపార్టీల నేతలను కూడా వేదికపైకి తీసుకుని వచ్చారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం ఈ సభలు నిర్వహించి, రాయలసీమలో రైతులను చైతన్యం చేసి, సమీకరించారు. వారి వారసత్వ వామపక్ష ఉద్యమాలను అర్థం చేసుకుని..
2014లో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా పనిచేసిన గుజ్జుల ఈశ్వరయ్య సేద్యపు నీటి ప్రాజెక్టుల కోసం మహాసభలు నిర్వహించారు. ఆ తరువాత కూడా రైతు సంఘాలను ఏకం చేయడంలోనే కాకుండా, వ్యవసాయ రంగ సమస్యలపై నిత్యం పోరాటాలు సాగిస్తున్నారు. ఆ కోవలో..
అనంతలో సన్నాహక సమావేశం..

ఏపీ రైతు సంఘం రాయలసీమ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం అనంతపురంలో జరిగింది. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల ఈశ్వరయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి. రామచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి. ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏ. కాటమయ్య, పీ.జములయ్య, రాష్ట్ర రైతు సంఘం ఆఫీస్ బేరర్స్ జగన్నాథం, గాలి చంద్ర పాల్గొన్నారు.
తీర్మానాలు
1. రాయలసీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు పూర్తి చేయడానికి నిధులు పెంచాలి. ఈ బడ్డెట్ లో కేటాయించాలి.
2. పంట కాలువలు ఆధునీకరించాలి. దీనికోసం అధికంగా నిధులు ఇవ్వాలి.
3. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వృధాగా సముద్రంలో కలవకుండా, చెరువుల అనుసంధానం ప్రక్రియ చేపట్టాలి.
4. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. కరువు సహాయక చర్యలు చేపట్టాలి.
5. రాయలసీమలో 3.50 లక్షల ఎకరాలకు నీరందించడానికి హెచ్ఎల్సీ కెనాల్ వెడల్పు చేయడానికి నిధులు కేటాయించాలి.
6. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు కేటాయించాలి.
7. రాయలసీమ జిల్లాలను ఆర్టికల్చర్ హబ్ గా మార్చాలి. తద్వారా ఉద్యానవన రైతులు ఆదుకోవాతి. పల్ఫ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
కడపలో రైతు సభ

ప్రాజెక్టులు, కాలువల ఆదునీకరణ కోసం నిధులు పెంచాలనే డిమాండ్ తో కడపలో మహాసభ నిర్వహించాలని అనంతపురంలో జరిగిన సన్నాహక సమావేశంలో నిర్ణయించినట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు 50 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించినా, ఒరిగిందేమీ లేదన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు ఈ జిల్లాల సమగ్రాభివృద్ధికి లక్ష కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాలపైనే "కడపలో నిర్వహించే మహాసభలో కార్యాచరణ సిద్ధం చేస్తాం" అని ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ రెండు నెలల పాటు విస్తృతంగా రైతు చైతన్య కార్యక్రమాలు సాగిస్తామన్నారు.
అనంతపురం సదస్సులో ఏపీ రైతు సంఘం రాష్టప్రధానకార్యదర్శి కెవివి. ప్రసాద్ మాట్లాడుతూ, ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల కాలువలు ఆధునీకరణ చేయని స్థితిలో తుంగభద్ర, పెన్నా, కృష్ణా నదుల నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంపాలయిందన్నారు. "ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాలవలు వెడల్పు చేస్తామంటారు" మినహా తరువాత పట్టించుకోవడం లేదన్నారు.
"రాయలసీమలోని అన్ని మండలాలు కూడా కరువు మండలాలు ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలి" అని డిమాండ్ చేశారు. హెచ్ఎల్సీ కెనాల్ వెడల్పుకు 14 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. హంద్రీ నీవా ప్రాజెక్టు కింద 3.50 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వాలు రైతాంగాన్ని మోసం చేస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కో రైతుకు రూ. 20 వేలు ఇవ్వాలి. సరైన పత్రాలు లేవని 14 వేల మంది రైతులకు రూ. 22 కోట్లు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని విరమించుకోవాలన్నారు. సమావేశంలో రాయలసీమ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్నప్ప యాదవ్, బెల్లంమహాదేవ, భాస్కర్ రెడ్డి, కమతం కాటమయ్య, సుబ్బారెడ్డి,రాష్ట్ర సమితి సభ్యులు వెంకట రాముడు యాదవ్ ,నరసింహులు, లలితమ్మ ,వెంకటరాముడు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిమ్మయ్య, రామకృష్ణ, విటీ రామాంజనేయులు, జి. సోమన్న రైతు సంఘం నాయకులు రామాంజినేయిలు, యాదవ్ , ఓబిరెడ్డి నాగేషు చలపతి బ్యాలంజి శ్రీరాములు ఆదినారాయణ రామాంజి,రఫీ,గోపాల్ హాజరయ్యారు.
Tags:    

Similar News