వేటు వేస్తారా? లేటు చేస్తారా?

పార్టీ ఫిరాయించిన జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లకు విశాఖ జిల్లా కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలని,పేర్కొన్నారు.;

Update: 2025-07-17 13:06 GMT
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తిన సభ్యులు

మహా విశాఖపట్నం నగరపాలకసంస్థ (జీవీఎంసీ)లో పార్టీ ఫిరాయించిన వైసీపీ కార్పొరేటర్లు పదవీ గండంలో పడ్డారు. జీవీఎంసీ మేయర్‌ను అవిశ్వాసం ద్వారా పదవీచ్యుతురాలిని చేయడం కోసం 27 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ నుంచి జంప్‌ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అవిశ్వాస తీర్మాన సమయంలో వీరు పార్టీ ఫిరాయించి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. దీంతో ఒక్క ఓటు తేడాతో మేయర్‌ పీఠం వైసీపీ చేజారి టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. కొత్త మేయర్‌గా టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావును ఎన్నుకున్నారు.


జీవీఎంసీ కార్యాలయ భవనం 

నాలుగున్నరేళ్ల క్రితం వైసీపీదే..
నాలుగున్నరేళ్ల క్రితం 2021 మార్చి 10న జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 వార్డు స్థానాలకు అప్పట్లో వైసీపీ 59 స్థానాల్లో గెలుపొంది మేయర్‌ పదవిని దక్కించుకుంది. టీడీపీ 29, జనసేన 3, బీజేపీ 1, సీపీఐ 1, సీపీఐ(ఎం) 1, స్వతంత్రులు నలుగురు ఎన్నికయ్యారు. జీవీఎంసీ చరిత్రలో తొలిసారిగా అప్పట్లో బీసీ మహిళకు మేయర్‌ పదవిని కట్టబెట్టారు. నాలుగేళ్లపాటు నల్లేరు మీద నడకలా సాగిన మేయర్‌ పాలనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్‌ పీఠాన్ని ఎలాగైనా కైవశం చేసుకోవాలని టీడీపీ వ్యూహాలు రచించింది. కేవలం 29 మంది కార్పొరేటర్లతో పాటు మిత్రపక్షాలు జనసేన 4, బీజేపీ ఒక స్థానాన్ని కలుపుకున్నా ప్రయోజనం ఉండదని భావించింది. వైసీపీ కార్పొరేటర్లకు ఎరవేసి తమ వైపు లాక్కొంటేనే మేయర్‌ను గద్దె దించవచ్చన్న నిర్ణయానికొచ్చింది. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. టీడీపీ నేతలు వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేశారు. వీరి గాలానికి 27 మంది వైసీపీ కార్పొరేటర్లు చిక్కారు. కొందరు టీడీపీ, మరికొందరు జనసేన, బీజేపీల్లో చేరారు. వీరందరితోను క్యాంపు రాజకీయాలు చేసి విదేశీ యాత్రలకు తీసుకెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో వైసీపీ తమ పార్టీ కార్పొరేటర్లకు విప్‌ జారీ చేసింది. అయినా విప్‌ను ధిక్కరించి కూటమికి అనుకూలంగా వీరంతా ఓట్లేశారు. దీంతో∙అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడాతో కూటమి నెగ్గింది. వైసీపీ మేయర్‌ స్థానంలో టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావును అందలమెక్కించారు.

అవిశ్వాస తీర్మానం నెగ్గాక ఆనందంలో టీడీపీ సభ్యులు 

ఇప్పుడేం జరిగింది?
వైసీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించడమే కాకుండా విప్‌ను ధిక్కరించి కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్‌కుమార్‌ కొన్నాళ్ల క్రితం జిల్లా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తాత్సారం జరుగుతుండడంతో ఈనెల 9న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇది బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. కార్పొరేటర్లకు నోటీసులు జారీ చేశారా? అని హైకోర్టు ప్రశ్నించడంతో రెండ్రోజుల క్రితమే షోకాజ్‌ నోటీసులిచ్చామని ఎన్నికల అధికారి సమాధానం ఇచ్చారు. అదే సమయంలో బుధవారం ఫిరాయింపు కార్పొరేటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ, వారం రోజుల్లోగా ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలన్న విషయం వెలుగులోకి వచ్చింది.
కలెక్టర్‌ చర్యలపై సర్వత్రా ఆసక్తి..
ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరితే అనర్హతకు గురవుతారు. ఇప్పుడు అదే నిబంధనతో వైసీపీ నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించిన జీవీఎంసీ కార్పొరేటర్లు అనర్హతకు అర్హులవుతారు. వీరిపై అనర్హత వేటు వేసే అధికారం జిల్లా కలెక్టర్‌/ఎన్నికల అధికారికి ఉంటుంది. నిబంధనల ప్రకారం వీరికి తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరాల్సి ఉంది. అందులోభాగంగానే కలెక్టర్‌ ఈ కార్పొరేటర్లకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు వైసీపీ తరఫున హైకోర్టులోనూ రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఫిరాయింపు కార్పొరేటర్లపై అనర్హత వేటు వేస్తారా? లేక ఏవో సాంకేతిక కారణాలు చూపి కొంతకాలం లేటు చేస్తారా? అన్న దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కలెక్టర్‌ వీరిపై వెనువెంటనే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈలోగా హైకోర్టు అనర్హత వేటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే కలెక్టర్‌కు ఇరకాటం తప్పుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ పాలకవర్గానికి మరో ఎనిమిది నెలలు మాత్రమే గడువున్న తరుణంలో జంప్‌ జిలానీ కార్పొరేటర్ల పరిస్థితి ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఫిరాయింపు కార్పొరేటర్లు వీరే..
కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన వారిలో వైసీపీకి చెందిన ముత్తంశెట్టి ప్రియాంక (6వ వార్డు), లొడగల అప్పారావు (8), కెల్ల సునీత (13), గేదెల లావణ్య (17), గుడ్ల విజయసాయి (23), సారిపల్లి గోవింద రాజుల వెంకట అప్పారావు (25), ఉరుకూటి నారాయణరావు (29), కోడూరు అప్పలరత్నం (30), మాసిపోగు మేరీ జోన్స్‌ (36), ఆళ్ల లీలావతి (42), పెద్దిరెడ్డి ఉషశ్రీ (43), కంపా హనోక్‌ (45), కంటిపాము కామేశ్వరి (47), చల్లా రజనని (54), ముర్రు వాణి (57), పుర్రె పూర్ణశ్రీ (59), కొణతాల సుధ (61), బొడ్డు నరసింహపాత్రుడు (65), రాజాన రామారావు (71), తిప్పల వంశీరెడ్డి (74), బట్టు సూర్యకుమారి (77), కొణతాల నీలిమ (80), పీలా లక్ష్మీ సౌజన్య (81), ఇల్లపు వరలక్ష్మి (85), కుంచె జ్యోత్స ్న (91), బెహరా వెంకట స్వర్ణలత శ్రీదేవి (92), ముమ్మన దేముడు (95వ వార్డు)లు ఉన్నారు.
Tags:    

Similar News