అటు హ్యాట్రిక్ .. ఇటు గెలుపు

ఆంధ్రలోని నెంబర్ వన్ నియోజవర్గం ఇచ్చాపురం. అక్కడ జెండా పాతాలన్న వైసీపీ ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయా..

Update: 2024-04-23 09:34 GMT

( శివరామ్)

ఇచ్చాపురం అనగానే గుర్తుకు వచ్చేది ఉత్తరాన ఆంధ్ర ప్రదేశ్‌కు సరిహద్దు అని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్దానాలలో ఒకటో నెంబరు కూడా ఇచ్ఛాపురానిదే. ఇక్కడ జెండా పాతడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు తెలుగుదేశం గట్టిగా అడ్డుతగులుతుంది. ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించి అక్కడ కోట్ల రూపాయల ఖర్చుతో భారీ వైలాన్ నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జనన్మోహన రెడ్డికి ఆ నియోజక వర్గం మాత్రం ఇప్పటికీ కొరుకుడు పడడం లేదు. గతంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడే పాదయాత్ర ముగించి ఆ నియోజక వర్గాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయగలిగారు. కానీ, తనయుడు జగన్ వల్ల కావడం లేదు.

అశోకుడే అందుకు కారణం

అందుకు కారణంగా అశోకుడు. రాజకీయ కుటుంబ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రజల నాడి తెలుసుకుంటూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ బెందాళం అశోక్. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ఆయన పక్కా లోకల్. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా డాక్టర్ బెందాళం అశోక్ మూడవసారి ఎన్నికల బరిలో దిగి తన అద్రుష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

అప్పుడు భర్తపై విజయం.... ఇప్పుడు భార్యపై పోటీ

2014లో మొదటిసారిగా పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి సర్తు రామారావు యాదవ్ పై 25,278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థి, మాజీ శానససభ్యుడు పిరియ సాయిరాజ్‌పై 7145 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అశోక్ కు 46 శాతం ఓట్లు రాగా, సాయిరాజ్‌కు 42 శాతం ఓట్లు ఆ ఎన్నికలలో పోలయ్యాయి. ఇప్పుడు సాయిరాజ్ భార్య, మొన్నటి వరకూ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేసిన విజయ ప్రత్యర్దిగా రంగంలోకి దిగారు. 2014 తో పోల్చుకొంటే 2019 ఎన్నికలలో మెజారిటీ బాగానే తగ్గినందున గట్టిగా పనిచేసి ఆ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని వైపీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

జనం మధ్య వుండడమే అశోక్ బలం

నిరంతరం పార్టీ కార్యక్రమాలతో పాటు శాసనసభ్యులుగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే అశోక్‌ను ఓడించేందుకు వైసీపీ పలు ప్రయోగాలు చేసినా ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. ఈ పది ఏళ్లలో కొంతకాలం అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా 2019లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలను కొనసాగించారు..

గ్రూపు రాజకీయాలే వైసీపీకి ఇబ్బంది

అయితే వైసీపీలోని గ్రూపు రాజకీయాలు అభ్యర్దికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. నర్తు రామారావు వర్గం, సాయిరాజ్ వర్గం ఎవరికి వారుగా పనిచేసుకుపోతున్నారు. ఉత్తరాంధ్ర డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస్ ( చిన్న శ్రీను) రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. పోలింగ్ కు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున అన్నీ సర్దుకుంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మూడవసారి పోటీలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అశోక్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, బలమైన మహిళా అభ్యర్థిని పోటీకి పెట్టి ఖాతా తెరవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

Tags:    

Similar News