ఈ గిరిజన ఎమ్మెల్యేలు పార్టీ మారతారా?

వైఎస్సార్సీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏజెన్సీ ఏరియా నుంచి రెండు సీట్లలో మాత్రమే గెలువ గలిగింది. వీరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

Update: 2024-11-16 06:10 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ఏరియాలో వైఎస్సార్సీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరకు వ్యాలీ నుంచి గెలుపొందిన రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి గెలుపొందిన మత్స్యరాస విశ్వేశ్వరరాజులు ఉన్నారు. కూటమి పార్టీల గాలి వీరిని తాకలేకపోయింది. మొదటి నుంచీ కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్సార్సీపీలతో కలిసి ప్రయాణం చేసిన గిరిజనులు 2024 ఎన్నికల్లో కూటమికి మొగ్గు చూపారు. కూటమి ప్రభుత్వం కూడా గిరిజన మహిళకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది. ఎవరు పార్టీ మారాలన్నా పదవులకు రాజీనామా చేసి రావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షరతులు విధించారు. ఇటీవల ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కొద్ది రోజుల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఇటీవల జనసేన పార్టీలో వైఎస్సార్సీపీ నుంచి చేరుతున్నారు. మాజీ నాయకులు, గతంలో సీట్లు రాని వారు వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరుతున్నారు. విజయవాడ నగరంలో నలుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో ఇటీవల చేరారు.

ఇద్దరూ కొత్తగా ఎన్నికైన వారు..

ఎమ్మెల్యేలుగా అరకు, పాడేరు నుంచి ఇద్దరూ మొదటిసారి గెలిచారు. అసెంబ్లీకి వెళ్లాలనే ఆతృత వారిలో ఉంటుంది. దానిని వైఎస్సార్సీపీ తన రాజకీయాల కోసం నీరు కార్చింది. దీంతో బంధువులు, స్థానిక నాయకుల నుంచి పార్టీ మారాలనే వత్తిడి వచ్చినట్లు సమాచారం. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యేలుగా మీ నుంచి మాకు ఉపయోగం ఏముంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. మంచి విద్యావంతులైనా ప్రజలకు ఉపయోగ పడే పరిస్థితుల్లో లేరు. పదవులు ఉన్నాయి. విద్య ఉంది. సమాజం గురించి బాగా అవగాహన ఉంది. అయినా ప్రతిపక్షంలో ఉండటం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామనే వేదన వారిలో ఉంది. గతంలో అయితే ప్రతిపక్షంలో ఉన్నా ముఖ్యమంత్రిని కలిసి తమకు కావాల్సిన పనులు అడిగే వారు. ఇప్పుడు అడిగేందుకు పార్టీ చీఫ్ అంగీకరించరు. ఒక వేళ అంగీకరించినా ముఖ్యమంత్రి వారికి సాయం చేసేందుకు సుముఖత చూపరు. ఇవన్నీ ఉన్నందున పదవులు వదులుకొని పార్టీ మారతారా? అనేది ఆలోచించాల్సిందే.

ఇద్దరూ ఉన్నత విద్యావంతులే..

పాడేరు నుంచి గెలిచిన విశ్వేశ్వరరాజు న్యాయవాదిగా ఉన్నారు. న్యాయ శాస్త్రాన్ని అభ్యశించిన ఈయన గిరిజనుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారు. పాడేరును ప్రత్యేక జిల్లాగా గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. కేవలం ఏజెన్సీ ఏరియానే జిల్లాలో ఉంటుంది. గిరిజన నివాసాలు మాత్రమే జిల్లాలో కనిపిస్తాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు నూరు శాతం ఇక్కడ ఖర్చుపెడితే గిరిజనులకు మంచి జరుగుతుందనే ఆలోచనలో నేతలు ఉన్నారు. ఇక అరకు వ్యాలీ నుంచి గెలుపొందిన రేగం మత్స్యలింగం కూడా మంచి విద్యావంతుడు. హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న రేగం మత్స్యలింగం జగన్ పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వాలంటరీ రిటైర్డ్ మెంట్ తీసుకున్నారు. రిటైర్డ్ మెంట్ కు సమీపంలో ఉన్నందున రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే వారు. అరకు వ్యాలీలో మంచి పేరు సంపాదించుకున్నారు.

రాజకీయంగా ఎదగలేక పోతున్నారు...

గిరిజనుల్లో చాలా మంది రాజకీయంగా ఎదగలేక పోతున్నారనే ఆవేదన వారిలో ఉంది. ఎంతో మంది నాయకులు అవుతున్నారు. వారిలో ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన వారు ఆ దఫా ఎన్నికల్లో పోటీ చేసి తరువాత సీటు రాక ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. కొత్తపల్లి గీత అనే యువతి వైఎస్సార్సీపీ నుంచి అరకు వ్యాలీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆమె బిజెపిలో చేరారు. తరువాత సొంత పార్టీ పెట్టారు. ఆ పార్టీని బిజెపిలో విలీనం చేసి ప్రస్తుతం రాజకీయ నాయకురాలు అనిపించుకునే పరిస్థితిలో కూడా లేకుండా పోయారు. ఈమె గ్రూప్ వన్ అధికారి. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత కనుమరుగయ్యారు. ఆ బాధ మాత్రం చాలా మంది గిరిజనులను వెంటాడుతూనే ఉంది. అందుకే అవకాశం వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచినా అసెంబ్లీకి వెళ్లలేక పోయారు.

Tags:    

Similar News