ఖమ్మం వార్ సీన్ : బీఆర్ఎస్ బలాఢ్యుడిపై ముగ్గురు మంత్రుల ముప్పేట దాడి

కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం ఖిల్లాలో పాగాకు ముగ్గురు మంత్రులు వ్యూహాలు రూపొందిస్తున్నారు.బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీపై ముగ్గురు మంత్రుల వ్యూహాలు ఫలిస్తాయా?

By :  Admin
Update: 2024-04-02 05:28 GMT

ఖమ్మం ఖిల్లాలో పాగాకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి కూడా బరిలో దిగుతున్నా, ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్యనే ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.కమ్యూనిస్టుల పురిటిగడ్డ అయిన ఖమ్మం ఖిల్లా నేడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. కాని బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామను రంగంలోకి దించడంతో ఆయన ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు కీలక మంత్రులున్న ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపై అందరి దృష్టి పడటంతో ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ పోరు ఆసక్తికరంగా మారింది. పార్టీటికెట్ల దశలో ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యుల కోసం పోటీ పడినా చివరకు వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారని సమాచారం.


ఖమ్మం పార్లమెంట్ నియోజుకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడంతోపాటు కొత్తగూడెంలో తన మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఈ ఖమ్మం ఖిల్లా నుంచే ముగ్గురు కీలక శాఖల మంత్రులున్నారు. ముగ్గురు మంత్రులు, ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్యకర్తల బలం, బలగం ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉంది. ఖమ్మం పార్లమెంటు పరిధికి చెందిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఖమ్మం జిల్లాకు అన్నీ తామై ముగ్గురూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు మంత్రులు ఏమేర ప్రభావం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఎండిన పొలాల పర్యటనతో నామ ప్రచారానికి శ్రీకారం
ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఎండిన పొలాలను పరిశీలించి, రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకొని పార్లమెంట్ ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు వచ్చిన నామ జలకళ కోల్పోయిన పాలేరు జలాశయాన్ని చూశారు. అనంతరం నేలకొండపల్లి మండలంలో సాగునీరు అందక ఎండిపోతున్న పొలాలను చూసి, రైతన్నలతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతుబిడ్డగా తనకు వారి కష్టసుఖాలు తెలుసని, అందుకే వారికి సాయం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని బీఆర్ఎస్ అభ్యర్థి నామ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరావు వెంట పొలాల సందర్శన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ శాసనసభ్యులు,జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ప్రకటించక పోవడంతో ఆ పార్టీ కంటే ముందుగానే బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘‘కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేం అనుభవిస్తున్నామని, నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డామని నాకు రైతులు చెప్పారు’’అని నామ తెలిపారు. రెండో రోజు కొణిజర్ల మండలంలో అనారోగ్యం బారిన పడిన నాయకుడిని పరామర్శించిన నామ అనంతరం అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతులకు తానున్నానంటూ ధైర్యం చెప్పారు.

ప్రచారానికి నామ టీం ఏర్పాటు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అభ్యర్థి నామ తన పేరిట ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నామ ములకలపల్లి పర్యటనకు వెళ్లారు. మంగళవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, రచయితలతో కలిసి ఎన్నికల ప్రచారం కోసం నామ టీంను ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని మధుకాన్ కార్యాలయం ఒక ఫ్లోరులో ఏర్పాటు చేసిన ఈ టీం నామ ప్రచార బాధ్యతలను చేపట్టింది. మరో వైపు మండలానికి 10 మంది కార్యకర్తలతో సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసి, వారిని నామ టీంకు అనుసంధానించారు.

ఖమ్మం పార్లమెంట్ ఇన్ చార్జిగా మంత్రి పొంగులేటి
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జీగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. గతంలో ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన శ్రీనివాసరెడ్డి ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక శాఖ మంత్రిగా ఎదిగారు. ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న భట్టి నందిని, తుమ్మల యుగంధర్ తప్పుకోవడంతో పొంగులేటి ప్రసాదరెడ్డికి లైల్ క్లియర్ అయిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన తమ్ముడు పొంగులేటి ప్రసాదరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకొని, ఆయన విజయం కోసం సోదరుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాలు రూపొందించారని సమాచారం.

ఎస్సీ, ఎస్టీ ఓటర్లే కీలకం
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లే కీలకంగా మారారు. ఈ నియోజకవర్గంలో 18.3 శాతం మంది ఎస్సీ ఓటర్లు, 18.3 శాతం మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఏ పార్టీకి మద్ధతు ఇస్తే ఆ పార్టీనే విజయం సాధించనుంది. దీంతో కీలకమైన ఎస్సీ, ఎస్టీ ఓటర్ల కోసం ప్రధాన పార్టీల నేతలు గిరిజనతండాలు, ఎస్సీ కాలనీలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. దీంతోపాటు నియోజకవర్గంలో ఖమ్మం అసెంబ్లీ కేంద్రంగా ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7.7 శాతం ఉన్న ముస్లిం ఓటర్ల మద్ధతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతున్నాయి.

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని వినూత్న వ్యూహాలు పన్నుతున్నారు. రెండు సార్లు సిట్టింగ్ ఎంపీ అయిన నామను ఈ సారి ఓడించేందుకు అధికార కాంగ్రెస్ నేతలు తమదైన ప్రచార వ్యూహాలతో ఓటర్ల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ జరగనుండగా, వారిలో ఎవరు విజయం సాధిస్తారనేది జూన్ 4 ఎన్నికల ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News