Revanth Red Carpets KCR|నిజంగానే కేసీఆర్ వస్తే రేవంత్ ఏమిచేస్తాడో ?

ఈరోజు కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ మాట్లడిన మాటలు, చేసిన కామెంట్లు, విజ్ఞప్తులు, పంపిన ఆహ్వానాలతో అందరికీ షాక్ కొట్టినట్లయ్యింది.

Update: 2024-12-05 09:29 GMT

ఇపుడీ విషయంపైనే తెలంగాణా రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే గురువారం ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల కోసం తయారైన యాప్ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్(Revanth) మాట్లాడిన మాటలే. నిజానికి రేవంత్-కేసీఆర్(KCR) మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పు అన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ‘ఓటుకునోటు’(Vote for Note) ఘటనలో ఏసీబీ రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసి జైలులో పెట్టింది. అప్పుడు మొదలైన విభేదాలు తర్వాత అనేక పరిణామాల కారణంగా బాగా పెరిగిపోయింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోయి కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రయ్యారు. ఇక్కడ మూడు విషయాలున్నాయి. మొదటిది బీఆర్ఎస్ ఓటమిని ఆ పార్టీ కీలకనేతలు జీర్ణించుకోలేకపోయారు. రెండోది కాంగ్రెస్ అధికారంలోకి రావటం. మూడోది, అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే రేవంత్ ముఖ్యమంత్రి అవటం.

తమ పార్టీ ఓడిపోయింది అనేకన్నా రేవంత్ ముఖ్యమంత్రి అవటాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ సీఎం అయిన దగ్గర నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టైంటేబుల్ పెట్టుకున్నట్లుగా ప్రతిరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్(Harish) పదేపదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. యాక్షన్ను బట్టే రియాక్షన్ ఉంటుందన్నట్లుగా కేటీఆర్, హరీష్ వ్యవహారానికి తగ్గట్లుగానే రేవంత్ కూడా రెచ్చిపోతున్నారు. అంతకుముందు తన విషయంలో కేసీఆర్ ఏ విధంగా అయితే వ్యవహరించారో ఇపుడు రేవంత్ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ విషయంలో దెబ్బకు దెబ్బ అన్నట్లుగా అదే పద్దతిలో రెచ్చిపోతున్నారు.

ఈ నేపధ్యంలోనే కేసీఆర్ గురించి ఈరోజు రేవంత్ మాట్లాడిన మాటలు విన్నవాళ్ళకి ఆశ్చర్యంవేసింది. ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే ‘119 మంది ఎంఎల్ఏలు కలిస్తేనే ప్రభుత్వమ’న్నారు. పాలక, ప్రతిపక్షాలు స్పీకర్ కు రెండుకళ్ళని చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేతగా అసలు సభకే రాకపోతే ఎలాగ’ని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ అసెంబ్లీలో ఖాళీగా ఉండటం తెలంగాణాకు మంచిది కాద’న్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టమని రేవంత్ ఆహ్వానించారు. ‘అనుభవాన్ని తెలంగాణా అభివృద్ధి కోసం ఉపయోగించాల’ని సూచించారు. తెలంగాణా అభివృద్ధికి సూచనలు, సలహాలు కావాలని కోరారు. ‘9వ తేదీన సచివాలయంలో ఆవిష్కరించబోతున్న తెలంగాణా తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల’ని కేసీఆర్ ను రేవంత్ కోరారు. జిల్లా మంత్రిగా, ప్రోటోకాల్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ వచ్చి ఆహ్వానిస్తాడని రేవంత్ చెప్పారు.

తెలంగాణా తల్లి(Telangana Talli Statue) విగ్రహ ఆవిష్కరణ అన్నది తెలంగాణా పండుగని చెప్పారు. పండుగ రోజు అందరం కలిసుందాము రండని ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఉందామని ప్రతిపాదించారు. ఈ విషయంలో తమిళనాడు(Tamil Nadu)ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ‘అధికారం పోయిందన్న బాధతతో కేటీఆర్, హరీష్ తమపైన ప్రతిరోజు ఆరోపణలు చేయటం మానాల’ని చెప్పారు. ‘పిల్లలు తప్పులు చేస్తుంటే బీఆర్ఎస్ కుటుంబ పెద్దగా కేటీఆర్, హరీష్ ను దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత లేదా’ అని కేసీఆర్ ను నిలదీశారు. ‘తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేటీఆర్, హరీష్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల’ని కేసీఆర్ కు విజ్ఞప్తిచేశారు. ‘మమ్మల్ని అధికారంలో చూడటం ఇష్టంలేకపోతే కొన్ని రోజులు సైలెంటుగా ఉండాల’ని హితవుచెప్పారు. ‘పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తు మీ అప్పులను మోస్తున్నామని గుర్తుంచుకోవాల’ని చెప్పారు. ‘నిజాం ప్రభువే ప్రజా ఉద్యమానికి తలవంచిన తర్వాత మనమంతా ఎంత’ అని కేసీఆర్ కు రేవంత్ ఉద్భోద చేశారు.

మొత్తానికి ఈరోజు కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ మాట్లడిన మాటలు, చేసిన కామెంట్లు, విజ్ఞప్తులు, పంపిన ఆహ్వానాలతో అందరికీ షాక్ కొట్టినట్లయ్యింది. రేవంతేనా కేసీఆర్ గురించి ఇలాగ మాట్లాడుతున్నదని ఒకటికి రెండుసార్లు తమ చేతులను తామే గిల్లి చూసుకునుంటారు. తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణతో పాటు అదే రోజు మొదలవబోతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కూడా హాజరవ్వాలని చేసిన విజ్ఞప్తి, ఆహ్వానం చూస్తే కేసీఆర్ కు రేవంత్ రెడ్ కార్పెట్(Red Carpet) పరుస్తున్నట్లే ఉంది. మరి ఆహ్వానాన్ని మన్నించి విగ్రహావిష్కరణ, అసెంబ్లీకి కేసీఆర్ వస్తే రేవంత్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News