కేటీఆర్ డిమాండుతో రేవంత్ రాజీనామా చేస్తాడా ?
సుప్రింకోర్టు తీర్పునేపధ్యంలో రేవంత్ కు ఆత్మాభిమానం ఉంటే వెంటనే సీఎంగా రాజీనామచేయాలని డిమాండ్ చేశారు;
నేతిబీరకాయలో నెయ్యి ఎంతనిజమో రాజకీయనేతల్లో ఆత్మాభిమానం అంతే నిజం. ప్రస్తుతం చాలామంది రాజకీయనేతల్లో ఆత్మాభిమానం అన్నది ప్రకటనలు, చాలెంజులకు మాత్రమే పరిమితమైపోతోంది. ఎంతమంది నేతలు ఆత్మాభిమానంతో రాజకీయం చేస్తున్నారో తెలుసుకోవాంటే టార్చిలైట్ వేసి వెతకాల్సిందే. ప్రస్తుత రాజకీయాలు అలాగ తయారయ్యాయి. ఇంతకీ కేటీఆర్ కు సడెన్ గా ఆత్మాభిమానం ఎందుకు గుర్తుకొచ్చిందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU) 400 ఎకరాల భూముల వివాదంపై సుప్రింకోర్టు తీర్పును కేటీఆర్(KTR) ఉదహరిస్తున్నారు. నిజానికి హెచ్సీయూ భూముల వివాదంపై సుప్రింకోర్టు ఇంకా తీర్పివ్వలేదు. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు మాత్రమేచేసింది. ఈవ్యాఖ్యలనే కేటీఆర్ ప్రస్తావిస్తు సుప్రింకోర్టు తీర్పునేపధ్యంలో రేవంత్ కు ఆత్మాభిమానం ఉంటే వెంటనే సీఎంగా రాజీనామచేయాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామాచేయాలని డిమాండ్ చేస్తునే మరోవైపు రేవంత్(Revanth) కు ఆత్మాభిమానం లేదని ఆయనే తేల్చేశారు. అధికారం తలకెక్కి, అధికారమదంతో విర్రవీగి చక్రవర్తులం అని భావిస్తే న్యాయవ్యవస్ధ ముందు అహంకారం తగ్గక తప్పదని సూచించారు. సుప్రింకోర్టు వ్యాఖ్యల నేపధ్యానికి విద్యార్ధులు, అధ్యాపకులు, పర్యావరణాన్ని సపోర్టుచేసిన వారందరి విజయంగా అభివర్ణించారు. ఇదేసమయంలో నరేంద్రమోదీ(Narendra Modi) గురించి మాట్లాడుతు ఆర్ఆర్ ట్యాక్స్, హెచ్సీయూలో ఏదో జరిగిపోతోందని మాట్లాడటం కాదన్నారు. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణచేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ ఆరాటపడుతోందన్నారు.
హెచ్సీయూ భూముల్లో గుంటనక్కలున్నాయని చెప్పిన రేవంత్ కు సుప్రింకోర్టు వ్యాఖ్యలు వాతలుపెట్టినట్లయ్యిందన్నారు. హెచ్సీయూ భూముల్లో జంతువులు, పక్షులున్నట్లు సుప్రింకోర్టు నిర్ధారించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. హెచ్సీయూ వివాదంపై ఆందోళనలు చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నట్లు మండిపడ్డారు. తప్పుడుకేసులు పెడుతున్న అధికారులు ఎవరైనా సరే భవిష్యత్తులో ఊచలు లెక్కపెట్టక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తన సొంత ఆలోచనలతో రేవంత్ అధికారులను బలిపశువులను చేస్తున్నట్లు చెప్పారు. మంచి జరిగితే క్రెడిత్ తన ఖాతాలో వేసుకుంటున్న రేవంత్ తప్పుజరిగితే మాత్రం దాన్ని అధికారులమీదకు నెట్టేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మలేదు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ తమ పార్టీకి పట్టలేదని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం మీద జనాల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్న విషయంలో అనుమానం లేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఆలోచన తమకు లేదన్నారు. ఎందుకంటే, రేవంత్ ప్రభుత్వం పూర్తి ఐదేళ్ళు అధికారంలో ఉంటేనే తమకు చాలామంచి జరుగుతుందని ఎద్దేవాచేశారు.