పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా-సందర్శనకు కేంద్ర పార్లమెంటరీ కమిటీ
సందర్శన, సమావేశాల అనంతరం రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.;
ఆంధ్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంశం మరో సారి తెరపైకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రెండు, మూడేళ్లల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నా..ఎప్పటికి పూర్తి అవుతుందో అనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఇలాంటి వాగ్ధానాలు గతంలో ఎన్నో చేశారు. కానీ అవన్నీ నీటి మూటలుగానే మిగిలి పోయాయి. నేపథ్యంలో కేంద్ర జలవనరుల పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టును శనివారం సందర్శనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వీరికి స్వాగతం పలికారు. బేజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడీ ఆధ్వర్యంలో కొంత మంది ఎంపీలు, మరి కొంత మంది కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, సీడబ్ల్యూసీ అధికారులతో కూడిన బృందం పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, స్పిల్ వే, చానల్స్‌ను ఈ బృందం పరిశీలన చేస్తోంది. ఈ బృందానికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు పనుల పురోగతి వివరాలను వివరించారు. ప్రాజెక్టు సందర్శనం పూర్తి అయిన తర్వాత అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో ఈ బృందం భేటీ కానుంది. నిర్మాణ పనుల తీరుతో పాటు ఇది వరకు 2020 ఆగస్టులో వచ్చిన వరదల కారణంగా నిర్మాణాలు ఎక్కడ ఎక్కడ దెబ్బతిన్నాయి. ఎంత మేరకు డ్యామేజ్ అయ్యాయి వంటి పలు అంశాలపైన కూడా చర్చించనున్నారు. అనంతరం ఒక సమగ్రమైన నివేదికను ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.