కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్ ఇరుక్కుంటారా ?
బీఆర్ఎస్ హయంలో సుమారు రు. 90 వేల కోట్లతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇపుడు నీటినిల్వకు పనికిరాకుండా పోయింది;
తొందరలోనే మామా, అల్లుళ్ళు కేసీఆర్, హరీష్ రావు విచారణను ఎదుర్కోక తప్పేట్లులేదు. బీఆర్ఎస్ హయంలో సుమారు రు. 90 వేల కోట్లతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇపుడు నీటినిల్వకు పనికిరాకుండా పోయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపేరుతో కేసీఆర్ ఫ్యామిలీ వేల కోట్లరూపాయలు దోచేసుకున్నట్లు మొదటినుండి రేవంత్ రెడ్డి(Revanth), కాంగ్రెస్, బీజేపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) నీటి వినియోగానికి పనికిరాదని, అర్జంటుగా రిపేర్లు చేయాల్సిందే అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన రిపోర్టుపై ఇపుడు రాజకీయ రచ్చ పెరిగిపోతోంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇదేసమయంలో అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడులు చేస్తున్నారు.
ఎన్డీఎస్ఏ రిపోర్టును హరీష్(Harish) ఎన్డీయే రిపోర్టంటు ఎద్దేవాచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై ఎన్డీఎస్ఏతో తమకు కావాల్సినట్లుగా రిపోర్టు ఇప్పించుకున్నారంటు ఎదురు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని నమ్మబలుకుతున్నారు. ప్రాజెక్టు కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ, ఎన్డీఎస్ఏ రిపోర్టు, రేవంత్, ఉత్తమ్ ఆరోపణలను కాసేపు పక్కనపెట్టేద్దాం. ఎన్డీఎస్ఏతో కాంగ్రెస్, బీజేపీలు తమకు కావాల్సినట్లుగా రిపోర్టు ఇప్పించుకున్నాయనే అనుకుందాం. ప్రాజెక్టు నిర్మాణం నాసిరకంగా జరిగటం, అవినీతి జరిగటం అయితే వాస్తవమే కదా. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరుచూసినా ఆశ్చర్యపోతారు. భూమిలోకి కుంగిపోయిన ప్రాజెక్టు పిల్లర్లు, పిల్లర్లలో ఏర్పడిన పగుళ్ళు, పిల్లర్లలో పగుళ్ళ కారణంగా డ్యాం ప్లాట్ ఫారమ్ చీలికలన్నీ కళ్ళకు కనబడుతున్నాయి. చీలికలు, పగుళ్ళు, ప్లాట్ ఫారంలు కుంగిపోవటాలను నిర్ధారించేందుకు నిపుణులు కూడా అవసరంలేదు.
ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి ఎవరుచూసినా పిల్లర్ల పరిస్ధితి, డ్యాం ప్లాట్ ఫారమ్ పరిస్ధితి ఈజీగా తెలిసిపోతుంది. వేలకోట్లరూపాయల ఖర్చుతో కట్టిన ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవటం ఏమిటి ? కుంగుబాటువల్ల పిల్లర్లలో చీలికలు రావటం ఏమిటో ? పిల్లర్లు కుంగిపోవటంతో ప్లాట్ ఫారమ్ కదిలిపోయి చీలికలు రావటం ఏమిటో కేసీఆర్, హరీషే సమాధానంచెప్పాలి. ప్రాజెక్టును నిర్మించేటప్పుడే సాయిల్ టెస్టు చేసుకోవాలి కదా. సాయిల్ టెస్టు ఆధారంగానే కదా పిల్లర్లను భూమిలో ఎంతలోతుకు వేయాలి ? ఎంత వెడల్పుతో, ఎంత స్ట్రాంగ్ గా వేయాలనే విషయాలను నిర్మాణ కంపెనీ నిర్ధారించుకుంటుంది. అనుకున్నదానికన్నా ముందుజాగ్రత్తగా ఇంకొంచెం గట్టిగానే పిల్లర్లు వేయాలి. అప్పుడు డ్యాం పదికాలాలపాటు మనగలుగుతుంది. కాని ఇక్కడ జరిగింది ఏమిటి ? సాయిల్ టెస్టు సరిగా జరగలేదు. సాయిల్ టెస్ట్ ఒకచోట జరిపి పిల్లర్లు మరోచోట వేశారు. భూమిలోపల పరిస్ధితి, నీటి ప్రవాహ పరిస్ధితిని సరిగా అంచనావేసి లెక్కలు కట్టలేకపోయారు. దానివల్లే భూమిలోపల పిల్లర్లకిందున్న మట్టి నీటిప్రవాహానికి కొట్టుకుపోయింది. ఎప్పుడైతే కిందున్న మట్టి కొట్టుకుపోయిందో వెంటనే భూమికి పిల్లర్లకు మధ్య గ్యాప్ వచ్చేసింది.
ఎప్పుడైతే పిల్లర్లకు కింద గ్యాప్ వచ్చిందో వెంటనే పైనున్న భారాన్ని మోయలేక పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. దాంతో కొన్ని పిల్లర్లకు క్రాక్స్ వచ్చేశాయి. దీని ఫలితంగా డ్యా ప్లాట్ ఫారమ్ కు కూడా కొన్నిచోట్ల పగుళ్ళు వచ్చేశాయి. ఈపరిస్ధితిల్లో ప్రాజెక్టులో నీటిని నిల్వచేస్తే డ్యామేజి మరింత పెరగటమే కాకుండా ఏకంగా ప్రాజెక్టే కుప్పకూలిపోతుందని ఎన్డీఎస్ఏ నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. అందుకనే ప్రాజెక్టులో నీటిని నిల్వచేయవద్దని సూచించింది. నీటి నిల్వకు ప్రాజెక్టు పనికిరానపుడు దీనిమీద చేసిన సుమారు రు. 90 వేల కోట్ల ప్రజాధనం బూడిదలోపోసిన పన్నీరేకదా. ప్రాజెక్టు పరిస్ధితి కళ్ళకు స్పష్టంగా కనబడుతుంటే హరీష్ మాత్రం తమ తప్పిదాలను సమర్ధించుకుంటు ఎన్డీఎస్ఏ రిపోర్టు కదా ఎన్డీయే రిపోర్టని, పోలవరంలో అవినీతి జరగలేదా ? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలిపోలేదా ? వాటన్నింటినీ ఎన్డీఎస్ఏ చూడదా ? రిపోర్టివ్వదా ? అంటు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనుబంధంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల నిర్మాణం కూడా నాసిరకమే అని ఉత్తమ్ పదేపదే ఆరోపిస్తున్నారు. అన్నంటిపైనా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న విచారణ పూర్తయి రిపోర్టు రాగానే బాధ్యులను గుర్తించి అందరిపైనా చర్చలు తీసుకుంటామని పదేపదే చెబుతున్నారు. బుర్రకు తోచినట్లుగా ప్రాజెక్టు డిజైన్లు ఖరారుచేసి, ప్రాజెక్టు సైట్ మార్చేసింది కేసీఆరే(KCR) అని రిటైర్డ్ ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ముందు వాగ్మూలమిచ్చారు. ప్రాజెక్టులో లోపాలకు, అవకతవకలకు కేసీఆర్, హరీషే బాధ్యులని ఆర్ధిక, ఇరిగేషన్ శాఖల్లో రిటైర్ అయిన చాలామంది ఉన్నతాధికారులు సాక్ష్యాలు సమర్పించినట్లు తెలుస్తోంది. కమిషన్ నోటీసులిచ్చి తమను ఎక్కడ విచారణకు పిలుస్తుందో ? తమను ఎక్కడ తప్పుపట్టి రిపోర్టు రాస్తుందో అన్న భయం హరీష్ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. తమలోని భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే హరీష్ ప్రభుత్వంపై ఎదారుదాడిచేస్తున్నట్లు అర్ధమైపోతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ ను మంత్రి ఉత్తమ్ తప్పుపట్టిన అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
1. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన తుమ్మడిహెట్టి ప్రాజెక్టును కేసీఆర్ తనిష్టారాజ్యంగా ప్రాజెక్టు స్ధలాన్ని కమీషన్ల కోసమే మేడిగడ్డకు మార్చారు.
2. ఐదుగురు విశ్రాంత ఇంజనీర్ల బృందం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు వద్దని, తుమ్మడిహెట్టే మేలని రిపోర్టిచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు.
3. నిపుణుల సలహాను కాదని ఏకపక్షంగా ప్రాజెక్టు నిర్మాణ స్ధలాన్ని మార్చటం ద్వారా కేసీఆర్ దేశచరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరవిపత్తుకు కారణమయ్యారు.
4. మేడిగడ్డ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో నిర్మాణమై వారి హయాంలోనే కూలిపోయింది కాబట్టి కేసీఆరే, హరీషే బాధ్యత వహించాలి.
5. ప్రాజెక్టు పనికిరాకుండా పోవటానికి ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణలోపాలే కారణమని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నపుడే ఎన్డీఎస్ఏ ప్రాధమిక రిపోర్టిచ్చింది.
6. తుది రిపోర్టులో కూడా ఎన్డీఎస్ఏ అదే రిపోర్టు ఇచ్చింది కాబట్టి కేసీఆర్ దోపిడి సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైనట్లే.
7. బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్లు, లోపాలు, కుంగిపోవటం అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది కాబట్టి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదు.
8. 2023, అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ ఏడో బ్లాకులో పిల్లర్లు కుంగిపోతే ఎన్డీఎస్ఏ, ఈఎన్సీ(ఓఅండ్ఎం) పియర్స్ ను సందర్శించి నాసిరకం నిర్మాణాల వల్లే పిల్లర్లు కుంగిపోయినట్లు రిపోర్టు ఇచ్చింది.
9. కమీషన్లకు కక్కుర్తిపడి ఎక్కువ వడ్డీలు ఎక్కడ దొరికితే అక్కడల్లా అప్పుచేసి ఆదరాబాదరాగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు.
10. బ్యారేజీల్లో 2 లేదా 3 టీఎంసీలకు మించి నీటిని నిల్వచేయకూడదని తెలిసీ కాళేశ్వరంలో 10 టీఎంసీల నీటిని నిల్వచేశారు.
11. సామర్ధ్యానికి మించి నీటిని నిల్వచేయటం వల్లే ప్రాజెక్టు పునాదులకు డ్యామేజి జరిగి బ్యారేజితో పాటు పిల్లర్లు కుంగిపోయింది.
12. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించలేదు.
13. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన 2019లోనే సీపేజీ వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మరమ్మత్తును పట్టించుకోలేదు.
14. ప్రాజెక్టుకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రెడీ కాకుండానే కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టేశారు.
15. డీపీఆర్లో పేర్కొన్న ఒరిజినల్ వర్క్ స్కోప్ ఒకటైతే క్షేత్రస్ధాయిలో జరిగిన పనులు వేరు.
16. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల నిర్మాణాల స్ధలాన్ని కూడా నిపుణులతో చర్చించకుండానే ఏకపక్షంగా కేసీఆర్ మార్చేసి నిర్మించేశారు.
కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల నిర్మాణాలను కేసీఆర్ అచ్చంగా కమీషన్ల కక్కుర్తితోనే చెప్పట్టినట్లు అర్ధమవుతోందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, దోపిడీని తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసేలా చేస్తామని ఉత్తమ్ గట్టిగా చెప్పారు.
హరీష్ వాదన ఏమిటి ?
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో ఎలాంటి అవినీతి జరగలేదు, అవకతవకలు జరగలేదు. ప్రాజెక్టుల నిర్మాణం వల్లే తెలంగాణలో అదనంగా వరిపండించే భూముల ఆయకట్టపెరిగింది. ఈ ప్రాజెక్టుల వల్లే కోటి టన్నుల వరి ఉత్పత్తి సాధ్యమైంది. ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ అభినవ భగీరథుడు. తమపైన కాంగ్రెస్, బీజేపీలు కుట్రపన్ని ఎన్డీఎస్ఏతో తప్పుడు రిపోర్టు ఇఫ్పించుకున్నాయి. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలు తమ మీద బురదచల్లుతున్నాయి. సీబీఐ, ఈడీని కేంద్రప్రభుత్వం సొంత లాభానికి ఎలాగ వాడుకుంటున్నదో ఎన్డీఎస్ఏని కూడా అలాగే వాడుకుంటోంది. పోలవరం(Polavaram Project) ప్రాజెక్టు డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కుప్పకూలినా ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పరిశీలించి రిపోర్టు ఇవ్వలేదు ? ఎస్ఎల్బీసీ(SLBC) కన్నా పెద్ద డిజాస్టర్ ఏముంటుంది ? అలాంటి డిజాస్టర్ విషయంలో ఎన్డీఎస్ఏ ఎందుకు స్పందించలేదు ? ఎందుకు రిపోర్టివ్వలేదు ?
ఎన్డీఎస్ఏ అంటే ఏమిటి ?
దేశంలోని ప్రాజెక్టుల ప్రతిపాదిత స్ధలాన్ని పరిశీలించటం, రిపోర్టు ఇవ్వటం, డ్యాంల నిర్మాణాల నాణ్యత, నిర్వహణ తదితరాలను ఎన్డీఎస్ఏ పరిశీలిస్తుంటుంది. నేషనల్ డ్యాం సేఫ్టి యాక్ట్ 2021, సెక్షన్ 8 ద్వారా చట్టబద్దంగా ఏర్పాటైన సంస్ధ ఎన్డీఎస్ఏ. జలవనరుల, ఇరిగేషన్ రంగాల్లో నిపుణులు ఛైర్మన్ గాను మరో ఐదుగురు సభ్యులుగాను ఉంటారు. ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్రాష్ట్ర వివాదాలను కూడా ఎన్డీఎస్ఏ పరిశీలిస్తుంది. 2021, డిసెంబర్ 8న పార్లమెంటులో చట్టం ద్వారా ఎన్డీఎస్ఏ ఏర్పాటైన చట్టబద్ధం సంస్ధ.
రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనపెట్టేస్తే బీఆర్ఎస్ హయాంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్, హరీష్ తగులుకునేట్లే ఉన్నారు. ప్రాజెక్టు నాణ్యతా లోపాలు, నిర్వహణ లోపాల కారణంగానే నాసిరకంగా నిర్మితమైందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి రిపోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఆయుధంగా మారబోతోందనే అనుమానం పెరిగిపోతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై నియమించిన జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేకమందిని విచారించింది. మొదటివారంలో కేసీఆర్, హరీష్ రావును కూడా విచారించబోతోందని సమాచారం. గతంలో విద్యుత్ రంగంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణకు రావాలని అప్పటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ కోర్టులో కేసు వేశారు. ఇపుడు పీసీ ఘోష్ కమిషన్ విచారణకు రమ్మని నోటీసిస్తే కేసీఆర్ ఏమిచేస్తారో చూడాలి.