చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ పైనేనా?

‘‘టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే’’ అని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి హామీని నెరవేరుస్తారా.

Update: 2024-06-10 07:33 GMT

‘‘టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే’’ అని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రజలకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ ఎన్నికల ముందు ఓ దగా ‘డీఎస్సీ’ని ప్రకటించి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసిందని, ఐదేళ్లలో నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం చేసినంత మోసీ మరే ఇతర ప్రభుత్వం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన కోరినట్లే ఆంధ్ర ప్రజలకు టీడీపీ కూటమికి పట్టం కట్టారు. సీఎం పీఠాన్ని చంద్రబాబు అందించారు. మరి చంద్రబాబు ఇప్పుడు తన తొలి సంతకం.. మెగా డీఎస్‌సీపైనే పెడతారా? ప్రస్తుతం రాష్ట్రమంతా దీని గురించే గుసగుసలాడుకుంటోంది. మరోవైపు చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడు పూర్తవుతుందా.. మెగా డీఎస్సీపై ఆయన ఎప్పుడు సంతకం పెడతారా అని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే సీఎం తన తొలి సంతకం పెడతారు. ఆ రోజే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు.. మెగా డీఎస్సీపై కూడా సంతకం పెడతారని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఇప్పటికే చంద్రబాబు కసరత్తులు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఆ దిశగా విద్యాశాఖకు కూడా మౌఖిక ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే రాష్ట్ర విద్యాశాఖ చర్యలు కూడా ప్రారంభించిందని, వాటిలో మొదటగా పాత ప్రభుత్వం ప్రకటించిన డీఎస్‌సీ నోటిఫికేషన్ రద్దు ప్రక్రియ ఉన్నట్లు తెలుస్తోంది.

కసరత్తుల్లో విద్యాశాఖ

చంద్రబాబు ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు విద్యాశాఖ తన కసరత్తులు ప్రారంభించింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఇలా అన్ని ఖాళీలకు సంబంధించి అన్ని వివరాలు విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. వాటి ప్రకారం కొత్త నోటిఫికేషన్ రూపొందించనున్నారని సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయానికి నోటిఫికేషన్‌ను సిద్ధం చేసే విధంగా యుద్ధప్రాతిపదికన విద్యాశాఖ పనిచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాత నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్‌లు

వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్ట్‌లతో మెగా డీఎస్‌సీని ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1,264, పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులు 215 ఉన్నాయి. వీటికి సుమారు 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు జరగలేదు. ఎన్నికల కోడ్ పూర్తి అయిన తరువాత పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనడంతో డీఎస్సీ పరీక్షలకు బ్రేక్ పడింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. ఈసారి మాత్రం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఏపీలో 39వేల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39.008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 2023 జూలైలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటికి సంబంధించిన ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి బదులిచ్చారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి టీచర్లకు సంబంధించి 39,008 ఉపాధ్యాయ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.

రెట్టింపు నెంబర్‌తో కొత్త నోటిఫికేషన్!

గత ప్రభుత్వం 6,100 పోస్ట్‌లతో నోటిఫికేషన్ విడుదల చేసి మెగా డీఎస్‌సీ అని పేర్కొంది. అయితే ఈ సారి టీడీపీ ప్రభుత్వం అంతకు మించిన సంఖ్యతో డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. దాదాపు 13 వేల నుంచి 15 వేల ఖాళీలతో ఈ నోటిఫికేషన్ ఉండనుందని, ఆ దిశగా విద్యాశాఖ కూడా కసరత్తులు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఖాళీలు ఉన్న పోస్ట్‌లకు సంబంధించిన అన్ని వివరాలను విద్యాశాఖ సేకరించి నోటిఫికేషన్‌ను దాదాపు సిద్ధం చేసేసిందని తెలుస్తోంది. మరి చంద్రబాబు తన తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తారా లేదా అనేది ఈ నెల 12వ తేదీని చూడాలి.

Tags:    

Similar News