పనిచేయని జగన్ 'సోషల్ ఇంజినీరింగ్' !

సీనియర్ జర్నలిస్టు ఎవివి ప్రసాద్ విశ్లేషణ. వందలాది లారీల్లో వచ్చిన ఆ జనం పోలింగ్ బూత్ లకు ఎందుకు చేరలేదు? వాళ్ల ఓట్లు ఎటుపోయాయి?

Update: 2024-06-05 07:52 GMT

విశాఖపట్నం దగ్గిర పాత గాజువాక సెంటర్లో జగన్ రోడ్‌షో కి వచ్చిన జనం... వీళ్ల ఓట్లు ఏమయ్యాయి?


ఆంధ్ర అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో లభించిన ఫలితాలు నిజంగానే ఒక కొత్త చరిత్రను సృష్టించాయని చెప్పవచ్చు. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఎటువంటి సంచలన ఫలితాలు లభించాయో, తాజాగా అంతకు మించిన సంచలనం కలిగించాయి. జత కట్టిన తెలుగుదేశం, జనసేన, బిజెపిలు ఒకవైపు, జగన్ నాయకత్వంలోని అధికార వైఎస్సార్సీ మరోవైపు హోరాహోరీ తలపడ్డాయి.


ఈ పోరులో ఎవరో ఒకరికి గెలుపు, ఓటమి సహజమే అయినా, అన్ని స్థానాలు అంటే 175 చోట్ల పోటీ చేసిన అధికార పార్టీకి ఓ డజను సీట్లు కూడా లభించక పోవడం ఒక చారిత్రక విశేషమే. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సాధారణమే అని సరిపెట్టుకొనేంత చిన్న విషయం కాదిది. అలాగే కూటమి లోని తెలుగు దేశం, జనసేనలు సాధించిన విజయం కూడా సాధారణమైనది కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే తాము ఈ కూటమి ఏర్పాటు చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా అన్న మాటలు పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత ఉన్నదో, అది సాలిడ్ గా కూటమికే ఎలా పడిందో అర్థమవుతుంది.


ఫలితాలు దాదాపుగా వెల్లడవుతున్న సమయంలో మంగళవారం సాయంత్రం జగన్ మీడియా తో మాట్లాడుతూ " నా అక్క చెల్లెమ్మలకు, అవ్వా తాత లకు ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించాను, లెక్క లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాను అంటూ ఆ లెక్కలన్నీ ఏకరువు పెట్టి ఎంతో ఆవేదన వ్యక్తంచేశారు. ఆ లక్షల కోట్లన్నీ ఏమయ్యాయి? అవన్నీ ఓట్లుగా ఎందుకు మారలేదంటూ బాధ పడ్డారు.  ఆయన వైపు నుంచి చూస్తే ఆ బాధ కూడా సహజమే అనిపిస్తుంది.


చంద్రబాబు ని, పవన్ కళ్యాణ్ ను అవకాశం వచ్చినపుడల్లా జగన్ మంత్రులు, ఆయన అనుచరులు తిట్టిన తిట్టు తిట్టకుండా వేదికలపై, ప్రజల మధ్య ఎన్నో అవమానాలకు గురి చేశారు. కారణాలు ఏమైనా, చంద్రబాబును 50 రోజులు పైగా జైలులో నిర్బంధించారు. దానికి ఎవరు బాధ్యులనేది అలా ఉంచుదాం. ప్రభుత్వమే కారణమని సాధారణ ప్రజలు అనుకుంటారు కదా! ఆ కేసులలోని వాస్తవాలను, విచారణలను కూడా అలా ఉంచుదాం. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎందుకలా వేధిస్తున్నారని ప్రజలు అనుకున్నారు కదా!


పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం మీద వైఎస్సార్సీ నేతలు వెగటు పుట్టించే కామెంట్లు చేసేవారు. అతడీని కూడా వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో విమర్శించేవారు. వాటన్నిటి ప్రభావం ప్రజలపై ఉంటుంది కదా!. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఎంతో అభిమాన గణం ఉన్న నేతలే.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా పెద్దదే అని తేలింది కానీ. ఆ మొత్తాన్ని చాలా తేలికగా కూటమి తన బుట్టలో వేసుకొనడానికి పకడ్బందీ వ్యూహాన్నే అనుసరించింది. నిజానికి బిజెపితో కాని, ప్రధాని మోడీతో కాని తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకి అంతగా సయోధ్య లేని సమయంలో మధ్యవర్తిత్వం నెరపి ప్రతిపక్ష ఓటు చీలకుండా చేయడంలో పవన్ నిర్ణయాత్మక పాత్ర పోషించారనే చెప్పాలి.


2014లో టిడిపి ప్రభుత్వం ఏర్పడే సమయానికి బిజెపి, తెలుగు దేశం చెట్టపట్టాలు వేసుకునే తిరిగాయి. తర్వాత రకరకాల కారణాల వల్ల రెండు పార్టీల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. ఇక ఆ రెండు పార్టీలు జతకట్టే అవకాశమే లేదని కూడా అనిపించింది. అటువంటి పరిస్థితిలో బిజెపి, తెలుగు దేశం పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో పవన్ కీలకంగా వ్యవహరించి "ప్రతిపక్ష ఓటు " చీలకుండా ఓ దారికి తెచ్చారనిపిస్తుంది.


ఈ మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు దాదాపు 56 శాతం వరకు ఉన్నాయి. వైఎస్సార్సీకి వచ్చిన ఓట్లు 40 శాతం దాకా ఉన్నాయి. అంటే దాదాపు 16 శాతం ఈ కూటమి ద్వారా ఆ పార్టీలు అదనంగా సాధించగలిగాయన్నమాట. బిజెపికి విడిగా 2.7 శాతం, జనసేనకు దాదాపు 9 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి ఏర్పడక పోయి ఉంటే ఈ ఓట్లలో చాలా మార్పు కనిపిస్తుంది. తెలుగు దేశం పార్టీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. జతకట్టడం వల్ల ఆ పార్టీలు పోటీ చేయని స్థానాల్లో ఒకరి ఓట్లు మరొకరికి భారీగా పడ్డాయి గనుకనే అధికార పార్టీకి డజను సీట్లయినా రాని పరిస్థితి ఏర్పడింది.


అక్కచెల్లెమ్మలకు, అవ్వ తాతలకు ఇచ్చిన లక్షల కోట్ల ఆర్థిక సాయం ఫలించకపోవడమే గాక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లపై జగన్ పెట్టుకున్న ఆశలు కూడా వమ్మయ్యాయనే అనిపిస్తుంది. " వై నాట్ 175 " నినాదాన్ని తరచుగా వినిపించిన జగన్ కేవలం డజను లోపు సీట్లు మాత్రమే సాధించ గలిగారంటే ఆయనలోని అతి విశ్వాసమే కొంతమేర దెబ్బతీసిందని కూడా అనిపిస్తుంది. గత ఎన్నికల్లో టిడిపికి ప్రతిపక్ష హోదా అయినా దక్కింది. ఈసారి వైఎస్సార్సీకి అధికారం పోవడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది.


లక్షల కోట్లు సంక్షేమం పై ఖర్చు చేసి, అభివృద్ధి ప్రక్రియను పట్టించుకొనకపోతే ఏం జరుగుతుందనే సందేహానికి ఈ ఎన్నికలు సమాధానం చెప్పాయని కూడా చెప్పవచ్చు. తన ప్రభుత్వానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని జగన్ అనేవారు. వందలాది లారీల్లో వచ్చిన ఆ జనం ఓట్లు మరి పోలింగ్ బూత్ లకు ఎందుకు చేరలేదని ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఇంకా అనేక అంశాలు జగన్ ప్రభుత్వ పతనానికి కారణమైనట్లు కనిపిస్తుంది.


జగన్ చెప్పిన " సోషల్ ఇంజినీరింగ్" కూడా ఎన్నికల్లో విఫలమైనట్లే కనిపిస్తుంది. " సామాజిక వర్గాల" ను అంచనా వేయడం లోను, వారి ఓట్లను తమ ఖాతాల్లోకి రప్పించుకోవడంలోను జగన్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనే అనిపిస్తుంది.  వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల ప్రయోగం కూడా ఆయన మరోసారి అధికారంలోకి రావడానికి తోడ్పడలేక పోయాయంటే అవి లోపభూయిష్టమనే అనుకోవాలి. ఒకసారి ఒకరు, మరోసారి ఇంకొకరు అధికారం లోకి రావచ్చు, పోవచ్చు. కానీ రాష్ట్ర పురోగతిపై వారి అధికార కాలం ఎంత ప్రభావం చూపుతుందన్నదే చివరికి మిగులుతుంది. అదే ఓట్లను తెచ్చినా, నిలువునా ముంచినా చేయగలుగుతుంది.


Tags:    

Similar News