అయితే, ప్రచార రంగంలోనే తొలి ప్రక్షాళనా?

మోదీ ప్రచార హోరు స్పీడు తగ్గనుందా

Update: 2025-10-31 13:01 GMT

దీపావళి తర్వాత అక్టోబర్ 25న తెల్లారితే ఆదివారం ‘ఆకాశవాణి’ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఛాట్ పూజ’ సందర్భంగా తన 127వ ‘మన్ కీ బాత్’ ప్రసంగం చేయాల్సిఉండగా, డిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్ లో జరిగిన కేంద్ర మంత్రిత్వ శాఖల సెక్రటరీల ఆంతరంగిక సమావేశం, ఇప్పుడిక అత్యంత కీలకమైనది కానుంది.

ఎందుకంటే, మన ప్రైవేట్-పబ్లిక్ ప్రసార సాధనాల్లో ఎక్కడా వార్తలుగా కనిపించని తలుపులు మూసి జరిపిన ఈ సమావేశానికి హాజరైన అధికారి ఒకరు దీని గురించి ఇది- “Crucial and unusually candid” అని వ్యాఖ్యానించినట్లుగా ఢిల్లీ నుంచి కీలక అంశాలు నివేదించే ఇక జాతీయ పత్రిక రాసింది.

కావొచ్చు, అయితే తెలుగువారికి ఇక్కడ ఎందుకు ఇది రాయాల్సిన విషయం అయిందో కూడా ముందుగా చెప్పాలి. ఈ సమావేశం ప్రధాని కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇద్దరు, సెంట్రల్ కేబినెట్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ సెక్రటరీ ఈ నలుగురి అధ్యక్షతన జరిగింది. రెండు ‘సెషన్స్’గా జరిగిన ఆ సమావేశానికి కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల అధిపతులు హాజరయ్యారు. ఆ రోజంతా ఇది జరిగిన తర్వాత, చివరిలో- “దీనిపై సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తగిన చర్యకు సిద్దం కావాలి,’’ అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారని ఈ వార్తా కధనంలో రాశారు. దాంతో, అది-‘మీడియా’ గురించిన విషయం కావడం, చాలా కాలంగా తెలుగునాట మీడియా మన ప్రభుత్వంలో ఒక భాగంగా మారడంతో; ఆ సమావేశ పర్యవసానాల తొలికెరటాలు మొదట తెలుగు రాష్ట్రాలను తాకడాన్ని రేపు మనం ఎటూ ఆపలేము.

అస్సలు ఆ సమావేశం ఎందుకు జరిగింది అనేది మనకు అర్ధమైతే, ఎందుకు అది అంత సున్నితమైనది అయిందో కూడా తెలిస్తే, మొదట మనం అప్రమత్తం అవుతాము. ఇండియాపై ‘సమాచార దాడి’కి సిద్దమవుతున్న విదేశీ శక్తుల్ని ఎదుర్కోవడం, అంటే ఇప్పుడు అదొక కొత్త యుద్ద భూమిలా మారిందని, అందుకు ఒక సమన్వయ వ్యూహం అవసరమైందని కేంద్రంలోని ప్రధమ స్థాయి ‘బ్యూరోక్రసీ’ గ్రహించడం మొదటి కారణం. ఇక కేంద్రంలో ‘పొలిటికల్ గవర్నెన్స్’ అంటే, నరేంద్ర మోదీ కనుక, ఆయన చెబుతున్న సూత్రమైన- ‘రిఫార్మ్’-‘పెర్ ఫార్మ్’- ‘ట్రాన్స్ ఫార్మ్’-‘ఇన్ ఫార్మ్’ అనేవి ‘వికసిత్ భారత్’ సాధన కోసం మనకు దారిచూపే మార్గదర్శకాలు అని ఆ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ అన్నారట.

ఈ ప్రాసలు నినాదాలు సరే గానీ, అస్సలు లోపలి కధ ఏమిటి అని ఆరా తీసినప్పుడు, అదీ కొంత ‘లేకపోలేదు’ అని కొందరు అన్నట్టుగా ఈ సింగ్ రాసిన ఈ వార్తా కధనంలో ఉంది. విదేశీ శక్తులు కొన్ని తప్పుడు సమాచారం (‘Misinformation’) వ్యాప్తిని ఒక పద్దతి ప్రకారం ఇక్కడ చేస్తున్నాయి, అనేది ఈ సమావేశానికి తక్షణ కారణం. అందుకు- ‘ఆపరేషన్ సింధూర్’ గురించిన కధనాలు ద్వారా మనపై జరుగుతున్న తప్పుడు సమాచార యుద్దమని, వారు అంటున్నారు. ప్రపంచ దేశాల్లో అది మన పరపతిని దెబ్బతీస్తున్నది అనేది ఫిర్యాదు.

సరే దీన్ని ఎదుర్కోవడం ఎలా అన్నప్పుడు, విషయాన్ని వక్రీకరించేట్టుగా ఒక ‘నేరేటివ్’ ఉందని అనిపించినప్పుడు, సంబంధిత మంత్రిత్వ శాఖ శరవేగంగా స్పందించాలి, అందుకు అన్ని శాఖల మధ్య పరస్పర సహకారం ఉండాలి, అనుకున్నారు. రెండవది- కొత్త ‘డిజిటల్ టూల్స్’ను ప్రతి శాఖ వాడుతూ, ఆయా శాఖల సమాచారాన్ని ప్రజలకు నేరుగా చేరేట్టుగా చూడాలి అన్నారు. ఇక్కడ అధికారులు అదనంగా అనుకొన్నది ఏమంటే, అ చెప్పే సమాచారం ఏదో అది- ‘సింప్లిసిటీ’ తోనూ ‘ఆథనిసిటీ’తోనూ ఉండాలి అని. అంటే, దీనర్ధం మన ప్రచారంలో అది లోపించింది అనేది కనిపిస్తూనే ఉంది. అంతే కాదు, ‘పాలసీలు’ చెప్పడానికి మనం ఉపయోగించే భాష సాధారణ పౌరులకు అర్ధమయ్యేట్టుగా ఉండాలి, అనుకున్నారు.

ఈ దశలో ఒకరు- “ఇకముందు ఇది ఏ మాత్రం దృశ్యమానంగా (విజిబిలిటీ’) ఉండకూడదు, అది నమ్మకం (‘ట్రస్ట్’) కలిగించేదిగా ఉంటే చాలు” అన్నారు. దీనర్ధం ఇప్పుడు మనకు ఏది ఎక్కువ అయిందో, ఏది లోపించిందో... ఈ పదేళ్ళలో వాళ్ళు ఒక స్పష్టతకు వచ్చేశారు అనుకోవలసి ఉంటుంది. చివరికి వాళ్ళు ప్రభుత్వ సమాచారం ‘చివరి మైలు’కు చేరడానికి మనం ఏమి చేయాలి అనే ప్రశ్నవద్ద ఆగారు. సభలో పాల్గొన్నవారు పలు తర్జనభర్జనలు తర్వాత అభిప్రాయపడింది ఏమంటే, ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రచారానికి ‘ప్రైవేట్’ ఏజెన్సీలను అనుమతించడం తక్షణమే ఆపాలి అని తేల్చారు. ఇది కీలకమైనది.

ఇందుకు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ (MIB) వెంటనే చొరవ తీసుకుని, అవసరమైన ‘శైలి-శిల్పం’ (‘క్రాఫ్టింగ్’) సిద్దం చేసి, దాన్ని అన్ని ‘ప్లాట్ ఫారమ్స్’ ద్వారా ప్రజలలోకి తీసుకుని వెళ్లాలి అని తేల్చారు. సమావేశంలో చర్చించిన అంశాలు మొత్తం కలిపి ఒక సీనియర్ అధికారి తన ముగింపు వాక్యాల్లో ‘రీ క్యాప్’ చేస్తూ- “ఇకముందు ‘వన్-వే’ ‘కమ్యూనికేషన్’ అంటే కుదరదు, ఆ రోజులు వెళ్లిపోయాయి” అన్నారు. ప్రజలకు ప్రభుత్వం చెప్పే సమాచారం అనేది ఇక ఎలా ఉండాలి అంటే అది- సాధికారికం (‘క్రెడిబుల్’) నిరంతరత (‘కన్సిస్టెంట్’) అనుసంధానం (‘కనకటేడ్’) గా ఉండాలి. మనం ఎదుర్కొంటున్న సమాచార యుద్దంలో మనం గెలవడానికి అదొక్కటే మార్గం అని ముగించారు.

శనివారం ఈ సమావేశం ముగిసిన తర్వాత, ‘ఛాట్ పూజ’ సందర్భంగా ఆదివారం ‘ఆకాశవాణి’ ప్రసారం చేసే- ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి మాట్లాడారు. అయితే, సుష్మా స్వరాజ్ భవన్ లో జరిగిన సమావేశానికి పది రోజులు ముందు జరిగింది ఏమిటో ఇక్కడ మనం చెప్పుకోవాలి. సుప్రసిద్ద ‘ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ‘ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్’ (AI) గురించిన అవగాహన ఉన్నవి అనుకున్న 25 దేశాల్లో సర్వే చేస్తే, వాటిలో భారత ప్రజల అవగాహన స్థాయి మిగతా అన్నిటికంటే ఆఖరున ఉన్నది. పైగా ఈ సర్వేలో పలు దేశాలు చెప్పింది ఏమంటే, “మా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, అది ‘ఏఐ’ని నియంత్రిస్తుంది” అన్నట్టుగా ఆ సర్వే నివేదిక వెల్లడించింది. ఇటువంటి కారణాలు ఇంకా ఏమున్నవో తెలియదు కానీ, తలుపులు మూసి మరీ రోజంతా జరిపిన ఈ సమావేశం గురించి మనం ఇప్పుడు కనుక మాట్లాడుకోకపోతే, మున్ముందు సమాచార ప్రసార రంగంలో జరిగేవి మనకు అర్ధం కాకపోవచ్చు.

ఎక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చామో తెలియకపోతే కూడా తర్వాత మన గమనం ఎటు అనేది అర్ధం కాక, మన పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. ఇక్కడే ఇప్పుడు నడుస్తున్నది కూడా చెబితే, అప్పుడు అంతా స్పష్టం అవుతుంది. ఏపీ విషయంలో వైసీపీ అధినేత చేసింది చెప్పుకోలేదు అంటారు. అదే టిడిపి అధినేతను ఆయన ‘పబ్లిసిటీ’ గురు అంటారు. ఇక్కణ్ణించి వెనక్కి వెళితే, 1991 నాటికి దేశంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాక, ‘ప్రయివేటీకరణ’ మన పాలనలో భాగం అయింది. నిజానికి అప్పట్లోనే, భవిష్యత్తు అవసరాలు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆకాశవాణి, దూరదర్శన్ లను- ‘ప్రసార భారతి’ స్వయం ప్రతిపత్తి ఉన్న‘పబ్లిక్ బ్రాడ్ కాస్టర్’గా తీసుకురావాలి అనుకుంది. కానీ జాప్యంతో 1997 చివరికి కానీ అది చట్టం కాలేదు.

అయితే, ఈ రంగంలో కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు వేటితోనూ పని లేకుండా, దీనికి పదేళ్ళ ముందే 1983 నాటికి ప్రముఖ సినీనటుడు ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడంతో; ప్రభుత్వ పధకాల సమాచారం ‘పబ్లిసిటీ’ ఇచ్చే సమాచార పౌరసంబంధాల శాఖ, ముఖ్యమంత్రి ‘ఎన్టీఆర్’కు మునుపటికి భిన్నంగా కొత్తగా ‘ప్రాపగాండా’ చేయాల్సి వచ్చింది. పసుపు పచ్చని బ్యానర్ క్లాత్ పై ఎర్రని రంగుతో- ‘రెండు రూపాయలకు కిలో బియ్యం- అన్న వరం’ అనే ప్రాపగాండా మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం చేయడం మొదలయింది.

దాన్ని అనుసరిస్తూ 1994 అసెంబ్లీ ఎన్నికలు నాటికి హైదరాబాద్ అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ముందు సిఎం విజయభాస్కర రెడ్డి సారా సీసాను కాలితో భూమిలోకి తొక్కుతున్న భారీ కటౌట్ సారా నిషేధం ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదేళ్లకు జరిగింది ఏమిటి, చంద్రబాబు సిఎం అయ్యాక ఈ రంగంలో మారిని పరిస్థితులను 2004 నాటికి డా. వైఎస్. రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో- “అధ్యక్షా ఆ రెండు పేపర్లు..” అంటూ బహిరంగంగా కొన్ని పత్రికా యాజమాన్యాలను సిఎం తప్పు పట్టే దశకు చేరింది.

మన దేశంలో 1947 లో కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మొదలయితే, 1951-56 మధ్య మొదటి పంచవర్ష ప్రణాళికలు మొదలయినప్పుడు, ఆ సమాచారం మన గ్రామాల్లోని నిరక్షరాశ్యలయిన ప్రజలకు చేరడం కోసం, రాష్ట్ర స్థాయిలో పంచాయతీ సమితి ఆఫీసుల్లో ‘సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్’ పోస్టులు వచ్చాయి. ఆ తర్వాత అవే ఇప్పటి- ‘పీఆర్వో’ పోస్టులు అయ్యాయి. అక్కణ్ణించి ఇప్పుడు ఎక్కడికి చేరామో చూస్తున్నదే.

అలా మొదలై 75 ఏళ్ళకు మన దేశం చేరాక- “ఇకముందు ప్రచారం అంటే, అది ఏ మాత్రం దృశ్యమానంగా (విజిబిలిటీ’) ఉండకూడదు, అది నమ్మకం (‘ట్రస్ట్’) కలిగించేదిగా ఉంటే చాలు” అంటున్నాము అంటే, ఎక్కడ నుంచి ఎక్కడికి చేరామో మనం ఒకసారి సింహవలోకనం చేసుకోవలసి ఉంది. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ (MIB) వెంటనే చొరవ తీసుకుని, ఇందుకు అవసరమైన ‘శైలి-శిల్పం’ (‘క్రాఫ్టింగ్’) సిద్దం చేయాలి అని 2025 చివరినాటికి ‘డిల్లీ’ ఒక ముగింపు వచ్చింది అంటే, జరిగింది ఏమిటో చూస్తే, భూమిని చుట్టి వద్దామని బయలుదేరి వెళితే... చివరికి బయలుదేరిన చోటికి వచ్చి ఆగిన చందంగా లేదూ!

Tags:    

Similar News