మోది ప్లాన్ 'సి' హీరో పవనేనా?

ప్లాన్ బి విఫలమైతే, అంటే చంద్రబాబునాయుడు భవిష్యత్తులో ఎప్పుడైనా మద్దతు ఉపసంహరించుకుంటే, మోది ప్రత్యామ్నాయంగా ప్లాన్ సీ ఏదైనా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.

By :  Admin
Update: 2024-06-25 12:15 GMT

సాధారణంగా ఒక ప్లాన్ విఫలయిన పక్షంలో, దానికి ప్రత్యామ్నాయంగా సిద్ధంగా పెట్టుకున్న ప్లాన్ బి అమలు చేయాలి అనేది వ్యూహకర్తలు అనుసరించే మార్గం.

ఎన్నికల్లో ఓటమి ఎరుగని సక్సెస్‌ఫుల్ నేతలు ఇలాగే మొదట అనుకున్న ప్లాన్‌ కాకుండా, దానికి ప్రత్యామ్నాయంగా ఒకటో, రెండో ప్లాన్‌లు సిద్ధంగా పెట్టుకుంటారు.

సీట్ల లక్ష్యాలు

ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 స్థానాలను, ఎన్‌డీఏ కూటమితో కలిసి 400 స్థానాలను సాధించాలని నరేంద్ర మోది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ ఈ లక్ష్యానికి ఏమైనా సీట్లు తక్కువైన పక్షంలో దక్షిణాది రాష్ట్రాలనుంచి దక్కించుకోవాలని ఆయన ఒక ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు. మోది ముందు చూపుతో సిద్ధం చేసుకుని పెట్టుకున్న ఈ ప్లాన్ బి ఆయనను ఆదుకుంది.

ప్లాన్ బి అనేది కూడా విఫలమైతే, దానికి ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసుకోవాలని వ్యూహకర్తలు చెబుతారు. దానినే ప్లాన్ సీ అంటారు.

అలాగే నరేంద్రమోది యొక్క ప్లాన్ బి విఫలమైతే, అంటే చంద్రబాబునాయుడు భవిష్యత్తులో ఎప్పుడైనా మద్దతు ఉపసంహరించుకుంటే, మోది దానికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ సీ ఏదైనా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.

మోది ప్లాన్ బి

మోది వేసిన ప్లాన్ బి ఇప్పటివరకు విజయవంతమయిందనే చెప్పాలి. ఎన్‌డీఏ కూటమి ద్వారా దక్షిణాది నుంచి అదనంగా 20 తెచ్చుకోగలిగారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిలో ఉన్న 130 సీట్లలో ఒక్క బీజేపీకే 29 సీట్లు వచ్చాయి. అప్పుడు ఎన్‌డీఏ దాదాపుగా లేదనే చెప్పాలి.

ఆ తర్వాత, దివంగత కన్నడ నటుడు అంబరీష్ భార్య సుమలత మాండ్యానుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచి, ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరటంతో బీజేపీకి ఒక సీటు అదనంగా కలిసింది.

2024 ఎన్నికల్లో, దక్షిణాదిలో బీజేపీకి అదే 29 సీట్లు వచ్చాయి, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు 47 సీట్లు వచ్చాయి.

ఈ విషయంలో విజయవంతమైనాకూడా, ఎన్‌డీఏ కూటమి చెదిరిపోకుండా ఉంచటానికి మోది ప్లాన్‌లు సిద్ధం చేసుకోవాలి.

నితీష్ వర్సెస్ నాయుడు

యూ టర్న్‌లు తీసుకోవటంలో పేరు మోసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌ను అందరూ పల్టీ రాయుడు అంటారుగానీ, ఆ విషయంలో నితీష్ కంటే రెండాకులు ఎక్కువ చదివిన నాయకుడు చంద్రబాబు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు యూత్ కాంగ్రెస్ నాయకుడుగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అయితే తదనంతర కాలంలో వారు ఇద్దరి మార్గాలూ విడిపోయి సమాంతరంగా సాగాయి.

ఆ రోజుల్లో 30 ఏళ్ళకే మంత్రి అయ్యి, దేశంలోనే అతి చిన్న వయసులో మంత్రి అయిన నాయకుడిగా రికార్డ్ సృష్టించిన నాయుడు, ఎన్టీఆర్ కుమార్తెను పెళ్ళాడినా, తన మామ తెలుగుదేశాన్ని పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అవసరమైతే తన మామపైనే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.

పార్టీ మార్పు

తెలుగుదేశం ఘనవిజయం సాధించటంతో, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని గమనించిన చంద్రబాబు తెలుగుదేశంలో చేరిపోయారు. మరోవైపు, వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగి, దేశంలోనే అతి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరు అయ్యారు.

దశాబ్దాల తర్వాత వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తదనంతరం, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య తీవ్రమైన రాజకీయ శత్రుత్వం ఏర్పడింది.

1984లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు జరిగిన వెన్నుపోటు కుట్ర సమయంలో నాయుడు సమర్థవంతంగా పని చేసి, తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. నాదెండ్ల భాస్కరరావు కుట్రను చంద్రబాబు విజయవంతంగా నిర్వీర్యం చేశారు.

1989లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు, చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో మంచి ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.

అంతఃపుర కుట్ర

1994 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంనుంచి గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ప్రధానమైన స్థానంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దినెలలకే జరిగిన తిరుగుబాటులో మామను దించి ముఖ్యమంత్రి పదవిని చేబట్టారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి వలన ఏర్పడిన సంక్షోభంనుంచి తెలుగుదేశాన్ని కాపాడినవాడిగా చంద్రబాబును టీడీపీవారు పరిగణిస్తారు.

1996లో చంద్రబాబు నాటకీయంగా జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అప్పటినుంచి రెండేళ్ళపాటు వామపక్షాలు, లౌకిక శక్తులతో కలిసి పయనించారు. 13 పార్టీల యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా ఉంటూ హెచ్ డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ వంటి ఇద్దరు ప్రధానమంత్రుల నియామకంలో కీలకపాత్ర పోషించారు.

మూడేళ్ళ తర్వాత 1999లో ఆయన హిందూత్వ శక్తులవైపు మళ్ళి, బీజేపీతో పొత్తు పెట్టుకుని 29 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నారు. తద్వారా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి అంశాలవారీ మద్దతు ఇస్తూ తమకు కావలసిన రాయితీలను పొందారు.

ఆ సమయంలోనే, గోధ్రా అల్లర్లను అణచటంలో విఫలమైనందుకుగానూ నరేంద్ర మోదిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుకు ఎదురుదెబ్బలు

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు మళ్ళీ ఓడిపోయాడు. తమ ఓటమికి ప్రజారాజ్యమే కారణమని, ప్రతిపక్ష ఓట్లను ఆ పార్టీ చీల్చిందని బాబు ఆరోపించారు.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు, చంద్రబాబు నిస్సంకోచంగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనతో చేతులు కలిపారు. అదే సమయంలో మోది నేతృత్వంలోని బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఈ యూ టర్న్ పుణ్యమా అని ఆ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చారు.

2018లో బీజేపీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం విఫలమయిందనే కారణంతో తెలుగుదేశం కేంద్రంలోని ఎన్‌డీఏ మంత్రివర్గంనుంచి తప్పుకుంది.

తిరిగి కాంగ్రెస్‌తో పొత్తు

2018లో దశాబ్దాలుగా శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకుని తెలంగాణలో పోటీ చేశారు, విఫలమయ్యారు. అప్పటినుంచి మళ్ళీ ఎన్‌డీఏలోకి రావటానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అవినీతి కేసులో జైలుకు పంపారు. దానికి ముందు అసెంబ్లీలో జరిగిన ఒక వాగ్వాదం సందర్భంగా, ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.

వినూత్న వైఖరి

2024లో చంద్రబాబు ప్రార్థనలు ఫలించాయి, బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. కూటమికి 21 సీట్లు వచ్చాయి. దీనిలో బీజేపీ ఒక్కటే మూడు సీట్లు గెలుచుకుంది, అసెంబ్లీలో నాలుగు మంత్రి పదవులు దక్కించుకుంది. మరోవైపు వైసీపీ ఎన్‌డీఏలో భాగస్వామి కాకపోయినా, పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇస్తోంది.

చంద్రబాబులాగానే పవన్ కళ్యాణ్ కూడా స్వప్రయోజనాలు, అవకాశవాదం ఆధారంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. అతను తన రాజకీయ జీవితాన్ని తన అన్న చిరంజీవితో కలిసి మొదలుపెట్టారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.

2014లో జనసేనను స్థాపించి బీజేపీ, టీడీపీల కూటమికి మద్దతు ఇచ్చారు. మరోవైపు 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో పోరాడారు. బీజేపీ దక్షిణాదివారి హక్కులను తొక్కేస్తోందని ఆరోపణలు చేశారు. కానీ, 2024లో అదే బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నారు.

వినూత్న వైఖరి

ఆంధ్రప్రదేశ్‌లోని కుయుక్తులతో కూడిన రాజకీయాలపట్ల అవగాహన ఉన్న బీజేపీ, ఈ పాటికి ప్లాన్ సి ని సిద్ధం చేసిఉండవచ్చు. చంద్రబాబుకు ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్‌ను తయారు చేయటం మోదికున్న ఆ ప్లాన్ 'సి' ఆలోచన అంటున్నారు.

సంప్రదాయాలకు విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫోటోలు పక్కపక్కనే పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వినూత్న వైఖరి చూస్తుంటే, చంద్రబాబు వ్యవహారశైలిపై అనుమానాలు తలెత్తుతున్నాయి - ముందు ముందు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవటంకోసం కూటమిని ఒక్కటిగా ఉంచటంకోసం, చెదిరిపోకుండా ఉంచటంకోసమే ఇలా చేస్తున్నారా అని.

Tags:    

Similar News