సాక్షి ధనుంజయ్ రెడ్డి ఇంట్లో పోలీసు సోదాలు ఎందుకు జరిగాయి?

సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ్ రెడ్డి ఇంట్లో పది మంది పోలీసులు ఎందుకు తనిఖీలు చేశారు. మద్యం కుంభకోణం నిందితులకు ఆయనకు ఏమిటి సంబంధం.;

Update: 2025-05-08 11:05 GMT
సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటి కారిడార్ లో పోలీసులు

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ సలహాదారు, 'సాక్షి' దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనుంజయ్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు కలకలం రేపాయి. ఏ కేసుకు సంబంధించి పోలీసులు సోదాలు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అసలింతకీ ఎవరీ ధనుంజయ్ రెడ్డి.. 

కడప జిల్లాకు చెందిన ఆర్. ధనుంజయ్ రెడ్డి గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సలహాదారుగా పనిచేశారు. అంతకు ముందు సాక్షి దినపత్రిక కు ఏపీ రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే పత్రిక నుంచి తప్పుకుని ప్రభుత్వంలో సలహాదారుగా చేరారు. సలహాదారు పదవి స్వీకరించగానే కొందరు కలెక్టర్ లకు నేరుగా ఫోన్లు చేసి తాను విజిట్స్ కు వస్తున్నానని ఫోన్ లు చేశారు. దీంతో కలెక్టర్ లు సీఎంవోను సంప్రదించారు. సీఎంవో నుంచి ఆర్ ధనుంజయ్ రెడ్డిని మందలిస్తూ సీఎంవోకు తెలియకుండా కలెక్టర్ లకు ఫోన్ లు చేయవద్దని, విజిట్స్ కు ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎంవో అధికారులు చెప్పటంతో కాస్త వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఎక్కవ సమయం సీఎంవో లోనే గడుపుతూ అధికారుల వద్ద సమాచారం తీసుకుని తకు కావాల్సిన విధంగా వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

లిక్కర్ స్కాం నిందితులతో ధనుంజయ్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా?

గత ప్రభుత్వం అధికారం కోల్పోగానే తిరిగి సాక్షి దినపత్రికకు ఏకంగా ఎడిటర్ గా వచ్చారు. గత సంవత్సరం డిసెంబరులో ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే గత ప్రభుత్వంలో సలహా దారుగా కొనసాగిన కాలంలో సీఎంవో లోని నాటి ముఖ్యమంత్రి జగన్ కార్యదర్శి కె ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం క్యాంపు కార్యాలయ పిఏ కె నాగేశ్వరెడ్డిలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తతం కె ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు మద్యం కుంభకోణంలో ఉన్నారు. వీరు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కోర్టు బెయిల్ నిరాకరించింది.

లిక్కర్ కేసు నిందితుల వేటలో భాగమేనా?

నిందితులు ఎక్కడున్నారు? వారికి బినామీలు ఎవరు? అనే అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నాటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కె ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలు విజయవాడలో ఉన్న సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ్ రెడ్డి ఇంటికి వచ్చిఉంటారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. పైగా వారికి సంబంధించినవి ఏవైనా ఆర్ ధనుంజయ్ రెడ్డి, సీఎం పీఏ కేఎన్ఆర్ ల ఇండ్లలో ఉన్నాయేమోననే విషయంలో తనిఖీలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ తనిఖీలు జరిగాయి. వారంట్ లేకుండా తనిఖీలు ఎలా చేస్తారని సాక్షి విలేకరులు ప్రశ్నించడంతో కొందరు పోలీసులు వెనుదిరిగారు. నలుగురు పోలీసులు ఇంటివద్దే ఉన్నారు. వారంట్ తీసుకుని తనిఖీలు తిరిగి కొనసాగించే అవకాశం ఉంది.


మద్యం కుంభకోణంలో ఇప్పటికే కెసిరెడ్డి మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కెసిరెడ్డితో ఆర్ ధనుంజయ్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని, మద్యం కుంభకోణం విషయంలో పలు దఫాలుగా చర్చలు జరిగాయని, ఆ చర్చల్లో ఎంపీ మిధున్ రెడ్డి, నాటి వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి తో పాటు ధనుంజయ్ రెడ్డి కూడా పాల్గొని ఉంటాడనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం కుంభకోణానికి, ధనుంజయ్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటనేది కెసిరెడ్డి ద్వారా రాబట్టినట్లు సిట్ పోలీసులు చెబుతున్నారు. ఒక పత్రిక ఎడిటర్ గా కాకుండా ఆర్ ధనుంజయ్ రెడ్డిని పార్టీ నాయకుడిగానే చూస్తున్నామని, అందులో భాగంగానే ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కె రాజశేఖర్ రెడ్డి (రాజ్ కెసిరెడ్డి) ప్రధాన నిందితుడు. సిట్ రిమాండ్ నోట్ ప్రకారం, రాజ్ కెసిరెడ్డి రూ. 3,200 కోట్ల మేర అక్రమ సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు రాజ్ కెసిరెడ్డి (ఎ1) ని ఏప్రిల్ 21, 2025న సిట్ ద్వారా హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. పి దిలీప్ (ఎ30) ను మే 2, 2025న చెన్నైలో అరెస్ట్ చేశారు. అంతకు ముందు బూనేటి చాణక్య (ఎ8) ను అరెస్ట్ చేశారు. ఈయన కెసిరెడ్డి తోడల్లుడుగా చెబుతున్నారు. ఎస్పీవై ఆగ్రోస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉండటంతో అరెస్ట్ అయ్యారు. ఏపీబీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వీరిని కలిపి ఒక సారి, విడివిడిగా విచారించాలని సిట్ నిర్ణయించింది. కొందరిని ఇప్పటికే విచారించింది.

తనిఖీలకు సాక్షికి సంబంధం లేదంటున్న పోలీసులు

సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన కె ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కోర్టు బెయిల్ నికారరించడంతో ఆర్ ధనుంజయ్ రెడ్డికి వీరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే వారు ధనుంజయ్ రెడ్డి వద్ద ఉండే అవకాశం ఉందని తనిఖీ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో నిందితుల్లో ప్రధాన నిందితుడు కెసిరెడ్డితో ఆర్ ధనుంజయ్ రెడ్డికి ప్రభుత్వ పరంగా గతంలో సంబంధాలు ఉన్నాయని, వారి చర్చల్లో ధనుంజయ్ రెడ్డి పాల్గొన్నారనే సమచారం కూడా సిట్ పోలీసుల వద్ద ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో మద్యం వ్యవహారంపై మూడు సార్లు జరిగిన సమావేశాల గురించి విజయసాయిరెడ్డిని సిట్ పోలీసులు విచారించారని చెప్పారు. విజయసాయిరెడ్డితో కూడా ఆర్ ధనుంజయ్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అరబిందో వారి ద్వారా మద్యం వ్యాపారులకు అప్పుగా విజయసాయిరెడ్డి డబ్బులు ఇప్పంచినట్లు చెప్పినందున ఆ కోణంలోనూ ఆయనపై ఇప్పటికే విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయసాయి, ఆర్ ధనుంజయ్ రెడ్డిల స్నేహంపై పోలీసులు కన్ను వేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ధనుంజయ్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలకు, పత్రిక కు ఎటువంటి సంబంధం లేదని, గత ప్రభుత్వంలో నిర్వహించిన బాధ్యతలు, మద్యం నిందితులతో ధనుంజయ్ రెడ్డికి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేశామని పోలీసులు చెబుతున్నారు. సాక్షి స్టేట్ బ్యూరో ప్రతినిధులు పోలీసులతో ధనుంజయ్ రెడ్డి ఇంటి వద్ద వాదించినప్పుడు కూడా ఇదే విషయం పోలీసులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికలో రాసిన రాతలకు సంబంధించిన వ్యవహారం కాదనే విషయం గుర్తించాలని వారు చెప్పటం విశేషం.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చిన జర్నలిస్ట్ లు

సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ కు జర్నలిస్ట్ లు మెమొరాండం సమర్పించారు. సాయంత్రం మూడున్నర గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిలబడి నిరసన తెలిపి ఆ తరువాత కలెక్టర్ ను కలిసి అర్జీ ఇచ్చారు. అకారణంగా ఇండ్లలోకి చొరబడి పోలీసులు తనిఖీలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ లు కలెక్టర్ ను కోరారు. నిరసనలో సాక్షి ప్రతినిధులు, కంట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News