రైళ్లలో లోకో పైల‌ట్ల‌కు టాయిలెట్లు అవ‌స‌రం లేదా?

మ‌రుగుదొడ్లు లేకుండానే గంట‌ల త‌ర‌బ‌డి విధులు. రైలింజ‌నులో వీటి ఏర్పాటుకు కుద‌ర‌ని వీలు. మ‌హిళా పైలెట్ల రాక‌తో కొత్త ఇంజ‌న్ల‌లో వెసులుబాటు.;

Update: 2025-02-24 14:07 GMT

రైల్వేలో ఎప్ప‌టిక‌ప్పుడు ఆధునికీక‌ర‌ణతో పాటు ఆధునిక సాంకేతిక ప‌రిజ్జానాన్ని అందిపుచ్చుకుంటోంది. రైల్వే వ్య‌వ‌స్థ‌లోనూ స‌మూల మార్పులు తీసుకొస్తోంది. స్టీమ్ ఇంజ‌న్ నుంచి అత్యాధునికి విద్యుత్ ఇంజ‌న్‌కు అప్‌గ్రేడ్ అయింది. ప్ర‌పంచ‌లోనే భార‌తీయ రైల్వేకు మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఇండియ‌న్ రైల్వే.. త‌మ లోకో పైలెట్ల క‌నీస అవ‌స‌రాల‌పై అల‌స‌త్వం చూపుతోంది. అదేంటో తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది..

రైలు బోగీల్లో ప్ర‌యాణికులు అసౌక‌ర్యానికి గురికాకుండా రైల్వే శాఖ ఎన్నో స‌దుపాయాలు క‌ల్పిస్తుంది. ప్ర‌యాణికుల బోగీకి ఆ చివ‌ర‌, ఈ చివ‌ర రెండేసి (మొత్తం నాలుగు) చొప్పున మరుగుదొడ్ల‌ను ఏర్పాటు చేస్తుంది. కానీ ఆ రైలు బండిని న‌డిపే ర‌థ సార‌థుల విష‌యంలో మాత్రం అల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. దీంతో రైళ్ల‌ లోకో పైల‌ట్లు (ట్రెయిన్ డ్రైవ‌ర్లు) చెప్ప‌న‌ల‌వి కాని అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇది ప‌దేళ్లో ఇర‌వై ఏళ్ల నుంచో కాదు.. రైల్వే వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి రైలు ఇంజ‌న్‌లో టాయిలెట్లు లేకుండానే లోకో పైలెట్‌లు *బండి* న‌డుపుతున్నారు.

 

దేశంలో 1853లో రైల్వే వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చింది. మొద‌ట్లో స్టీమ్ ఇంజ‌న్లుండేవి. అందువ‌ల్ల అప్ప‌ట్లో రైలింజ‌నులో మ‌రుగుదొడ్ల స‌దుపాయానికి ఏమాత్రం వీలుండేది కాదు. ఆ త‌ర్వాత డీజిల్ ఇంజ‌న్లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ వీటిలోనూ టాయిలెట్ల స‌దుపాయానికి నోచుకోలేదు. అనంత‌రం కొన్నేళ్ల‌కు ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌న్లు వ‌చ్చాయి. అప్పుడూ లోకో పైలెట్ల కోసం ఇంజన్లో టాయిలెట్ల‌ ఏర్పాటు జ‌ర‌గ‌లేదు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు రైల్వే వ్య‌వ‌స్థ‌లో ఆధునిక‌త సంత‌రించుకుంటున్నా రైలింజ‌న్ (లోకోమోటివ్‌)లో మాత్రం మ‌రుగుదొడ్ల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌కుండా పోయింది. అంటే భార‌తీయ రైల్వే ఏర్పాటై 170 ఏళ్లు దాటినా, ఎన్నో మార్పులు సంత‌రించుకుంటున్నా లోకో పైలెట్ల ప్ర‌ధాన అవ‌స‌ర‌మైన మ‌రుగుదొడ్ల స‌దుపాయం క‌ల్ప‌న‌పై ద్రుష్టి సారించ‌లేదు. రైలింజ‌నులో టాయిలెట్ ఏర్పాటు చేయాలంటే అద‌న‌పు జాగా అవ‌స‌ర‌మ‌వుతుంది. అంత చోటు రైలింజ‌న్‌లో లేనందున వీటిని ఏర్పాటు చేయ‌లేదంటూ రైల్వే శాఖ చెబుతున్న మాట‌! దీంతో లోకో పైలెట్ల *మ‌రుగు* స‌మ‌స్య మ‌రుగున ప‌డిపోతూనే ఉంది.

అత్య‌వ‌స‌ర‌మైతే అగ‌చాట్లే..

రైలు ప్ర‌యాణికుల‌కు మ‌ల మూత్ర విస‌ర్జ‌న అవ‌స‌ర‌మైతే ఆ బోగీలో ఉన్న టాయిలెట్ల‌కు వెళ్తారు. అదే లోకో పైలెట్‌కు అవ‌స‌ర‌మైతే? రైలు త‌ర్వాత స్టేష‌న్‌లో ఆగే వ‌ర‌కు వేచి ఉండాలి. రైలు ఆగాక వెన‌క ఉండే బోగీల్లోని టాయిలెట్ల‌కు ఉరుకులు ప‌రుగుల‌తో వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో రైల్వే స్టేష‌న్ ప్లాట్‌ఫాంల‌పై ఉండే మ‌రుగుదొడ్ల‌ను వినియోగించుకుంటారు. అప్ప‌టి వ‌ర‌కు (కొన్ని నిమిషాల పాటు) నిలిపి వేస్తారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ విధుల‌కు వెళ్తారు. ఒక‌వేళ హాల్టు స‌మ‌యం మించిపోతే అందుకు కార‌ణాన్ని లిఖిత పూర్వకంగా రాయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లు అయితే రెండు మూడు గంట‌ల‌కు కూడా హాల్్ట స్టేష‌న్లు రావు. అలాంట‌ప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి మ‌ల‌మూత్రాల‌ను అతి క‌ష్ట‌మ్మీద ఆపుకోవ‌ల‌సిందే. ‘నేను ఇర‌వై ఏళ్ల నుంచి లోకో పైలెట్‌గా చేస్తున్నాను. డ్యూటీకి వెళ్ల‌డానికి ముందే మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న అవ‌స‌రాలు తీర్చుకుంటాం. మార్గ‌మ‌ధ్య‌లో వాటి కోసం ఇబ్బందులు ప‌డుతున్నాం. అత్య‌వ‌స‌ర‌మైతే ఆగిన స్టేష‌న్‌లో బోగీల్లోకి వెళ్తుంటాం. అప్ప‌టిదాకా నియంత్రించుకోవడం చెప్ప‌డానికి వీల్లేనంత క‌ష్టం. అయినా అలాగే విధులు నిర్వ‌హిస్తుంటాం. మా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియ‌దు’ అని సాహూ అనే లోకో పైలెట్ ‘ద ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌’ ప్ర‌తినిధికి చెప్పారు.

 

గూడ్స్ రైళ్ల పైలెట్ల‌ది మ‌రో విచిత్ర‌మైన స‌మ‌స్య‌. పాసింజ‌ర్‌/ఎ క్స్‌ప్రెస్‌ రైళ్ల‌కు హాల్ట్ స్టేష‌న్‌లో ఆగే వీలుంటుంది. గూడ్స్ రైళ్ల‌కు అలా కుద‌ర‌దు. అందువ‌ల్ల గూడ్స్ రైళ్ల లోకో పైలెట్లు మార్గ‌మ‌ధ్య‌లో కొద్ది నిమిషాల పాటు ఆపుతారు. ఆ విష‌యాన్ని గూడ్స్ రైలు గార్డుకి, స‌మీప స్టేష‌న్ అధికారుల‌కు తెలియ‌జేస్తారు. అలా ఆపినందుకు కూడా వారు త‌మ మ‌రుగుదొడ్డి అవ‌స‌రాన్ని వివ‌రించాలి. ఇక కొన్నేళ్ల నుంచి లోకో పైలెట్లుగా మ‌హిళ‌లు కూడా చేరుతున్నారు. వీరు ప్ర‌యాణికుల రైళ్ల‌తో పాటు గూడ్స్ రైళ్ల‌ను న‌డుపుతున్నారు. ప‌గ‌టి పూటకంటే రాత్రి వేళ విధుల్లో ఉండ‌గా వీరికి మ‌రుగుదొడ్ల అవ‌స‌రం ఏర్ప‌డితే చీక‌ట్లో రైలును అప‌డ‌మంటే అసాధ్య‌మైన ప‌ని. ఎప్పుడైనా త‌ప్ప‌నిస‌రైతే ఆక‌తాయిలు, అసాంఘిక శ‌క్తుల నుంచి దాడుల‌ను ఎదుర్కొంటున్నారు. ఇలా వీరికి మ‌రుగుదొడ్ల స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటోంది. వీరిలో కొంత‌మంది మ‌రుగుదొడ్ల స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి డైప‌ర్ల‌ను వాడుతున్నారు.

అదుపు చేసుకోవ‌డంతో అనారోగ్య స‌మ‌స్య‌లు..

ఇన్ని అవ‌స్థ‌లు, అగ‌చాట్లు, నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం క‌ష్ట‌త‌రం కావ‌డంతో చాలామంది లోకో పైలెట్లు విధుల్లో మ‌ల, మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్ల‌కుండా అతి క‌ష్ట‌మ్మీద నియంత్రించుకుంటున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా మూత్ర విస‌ర్జ‌న‌ను అదుపు చేసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డ‌డంతో పాటు ఇత‌ర కిడ్నీ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. కొంద‌రిలో క్రానిక్ యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్‌ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌హిళా లోకో పైలెట్లు డైప‌ర్ల‌ను వాడ‌డం వ‌ల్ల ఆ ప్ర‌దేశంలో ఎర్ర‌ని చార‌లు (రాషెస్‌) ఏర్ప‌డుతున్నాయి. మ‌రికొంద‌రిలో పెల్విక్ ఇన్ఫెక్ష‌న్ ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ అమాన‌వీయ‌ ప‌రిణామాల నేప‌థ్యంలో లోకో పైలెట్ ఉద్యోగానికి మ‌హిళ‌లు అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని అంటున్నారు.

 

ఇప్పుడిప్పుడే మ‌రుగు వైపు అడుగులు..

లోకో మోటివ్స్ (రైలింజ‌న్ల‌) లో మ‌రుగు దొడ్ల వ‌స‌తి లేకుండా లోకో పైలెట్లు విదులు నిర్వ‌హించాల్సి రావ‌డంపై 2016లో జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (హెచ్ ఆర్ సీ) స్పందించింది. రైలింజ‌న్ల‌లోనూ లోకో పైలెట్ల కోసం టాయిలెట్ల‌ను స‌మ‌కూర్చాల‌ని రైల్వే మంత్రిత్వ‌శాఖ‌ను ఆదేశించింది. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త‌గా త‌యారు చేసే రైలింజ‌న్ల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా టాయిలెట్ల‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. భార‌తీయ రైల్వేలో సుమారు 10 వేల లోకో మోటివ్స్ ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 200 వ‌ర‌కు కొత్త రైలింజ‌న్ల‌కు (వందే భార‌త్ రైళ్ల స‌హా) వీటిని స‌మ‌కూర్చారు. అయితే వీటి డిజైన్ల‌లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో రైల్వేస్ రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండ‌ర్డ్స ఆర్గ‌నేజేష‌న్ మ‌ళ్లీ అధ్య‌య‌నం చేస్తోంది. స‌రికొత్త డిజైన్ ఖ‌రారైతే రైలింజ‌న్ల‌లో లోకో పైలెట్ల‌కు టాయిలెట్‌లు ఏర్పాట‌వుతాయి. అదే జ‌రిగితే లోకో పైలెట్ల చిర‌కాల స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించిన‌ట్ట‌వుతుంద‌న్న మాట‌!

Tags:    

Similar News