ఈ ఐఏఎస్‌పై ఎందుకు మరకలు

ఉన్నత విద్యను అభ్యశించి రాజకీయ ఉచ్చులో ఇరుకున్నారు శ్రీలక్ష్మి. ఎంతో మందికి సేవలందించాల్సిన అధికారి పాలకులకు సేవలందించే వారుగా మారారు. ఎందుకు?

Update: 2024-06-25 04:17 GMT

రాత్రినక, పగలనక కష్టపడి చదివి ఐఏఎస్‌ సాధించి మెరిట్‌లో ఏపీ కేడర్‌కు సెలెక్ట్‌ అయిన వ్యక్తుల్లో వై శ్రీలక్ష్మి ఒకరు. 22 ఏళ్లకే ఐఏఎస్‌ అధికారి అయ్యారు. రాష్ట్రంలోని సొంత జిల్లాలో పోస్టింగ్‌ ఇప్పించుకున్న తెలివైన, చురుకైన అధికారిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు శ్రీలక్ష్మి. నిజానికి ఆమె తలరాత బాగుంటే నేడు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్‌ సెక్రెటరీ హోదాలో ఉండేవారు. ఐఏఎస్‌లకు అంత కంటే అత్యున్నత స్థానం మరొకటి ఉండదు. కానీ శ్రీలక్ష్మి విషయంలో అలా జరగ లేదు. పాలకులు ఆమెను తప్పు దోవ పట్టించారా? లేక ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకుందా? ఎందుకు ఆమె జైలు పాలు కావలసి వచ్చింది? వాస్తవాలను ఆమె పరిగణలోకి తీసుకోలేదు? ఒక సాధారణ కుటుంబం నుంచి సివిల్స్‌ ఎంపికై దేశంలోనే గొప్ప ర్యాంకర్‌ పేరు సంపాదించుకున్న శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు ఎందుకు బలైంది? ఐఏఎస్‌ అంటే చాలా మందిలో ఒక నానుడి ఉంది. ఐఏఎస్‌ అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో అయ్యా ఎస్‌ అని మాత్రమే అని, ఐఏఎస్‌ పదానికి అర్థం చెబుతున్నారు. ఏదేమైనా శ్రీలక్ష్మి తన మేధస్సును రాష్ట్ర రాజకీయ నాయకులకు తాకట్టు పెట్టారా? లేక కుటుంబ వ్యవహారాలు ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చాయా? అనే అంశాలపై ఒక సారి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది.

ఎర్రా శ్రీలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నివాసి. తండ్రి రైల్వే ఉద్యోగి. ఆమెది మధ్యతరగతి కుటుంబం. శ్రీలక్ష్మికి ఒక సోదరి ఉంది. తండ్రిది రైల్వే ఉద్యోగం కావడంతో వారి కుటుంబం దేశమంతా బదిలీల వల్ల తిరగాల్సి వచ్చేది. అక్క, చెల్లెలు బాగోగులను ఆమె తల్లి బాధ్యతగా చూసేది.
ఏలూరులోని కేపీడీటీ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్న శ్రీలక్ష్మి, చిన్న నాటి నుంచి మితంగా మాట్లాడటం, గంటల తరబడి లైబ్రరిరీలో పుస్తకాలు చదువుకోవడం, పోటీ పరీక్షలను నేరుగా ఎదుర్కొవడం చూస్తే.. శ్రీలక్ష్మి ఎంత పర్‌ఫెక్టుగా విద్యాభ్యాసం చేశారో అర్థమవుతుంది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ తర్వాత సివిల్స్‌ పరీక్షలు రాసేందుకు శ్రీలక్ష్మి పడని కష్టం అంటూ లేదు. 1988లో శ్రీలక్ష్మి సివిల్స్‌ సర్వీసుకు సెలెక్ట్‌ అయ్యారు. 22 ఏళ్ల వయసులోనే శ్రీలక్ష్మి సివిల్స్‌ టాపర్‌గా నిలచి ఐఏఎస్‌ సాధించడం, సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడం గర్వకారణంగా ఏపీ ప్రజలు చెప్పుకుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శ్రీలక్ష్మి కలెక్టర్‌గా పని చేశారు. చురుకైన అధికారిగా, పేదల పక్షపాతం వహించే అధికారిగా పేరు సంపాదించుకున్నారు. ఆమె ఎన్నో కష్టాలు పడి సివిల్స్‌ ర్యాంకు సాధించడంతో భవిష్యత్‌లో ఇలాంటి కష్టాలు పేద వర్గాలకు చదువులోను, కుటుంబ వ్యవహారాల్లోను, ఉండకూడదని భావించే వారు. అందుకు ఎంతో నిబద్దతగా అడుగులు వేసే వారు. అదే సమయంలో ఐపీఎస్‌ అధికారి గోపీకృష్ణను కులాంతర వివాహం చేసుకున్నారు. కులం, మతం కేవలం మన మస్థిష్కానికి మాత్రమేనని, వాటిని వదిలినప్పుడు దేశంలో స్వేచ్చాగా బతకొచ్చని ఆమె భావించారు. గోపీకృష్ణతో వివాహం శ్రీలక్ష్మిలో చాలా మార్పులు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. జీవితమంటే ఆర్థిక సంబంధాలతో ఎక్కువుగా ముడిపడి ఉందని, ప్రేమ, సమానత్వం, అభిమానం, ఆప్యాయత, అనే అంశాలను కొద్దిగా దూరం పెడితే మన జీవితం ఎక్కడికో వెళ్తుందనే అభిప్రాయాన్ని భర్త వ్యక్తం చేశారు. భర్త మాటలను ఆమె కాదనలేక పోయారు. ఈ పరిస్థితుల్లో భర్త చెప్పిన మాటలు విని రూటు మార్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మనసుల్లో ఆమె భర్త మాటలు బాగా పని చేశాయి. అక్రమంగా వసూళ్లకు తెర లేపారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. మంత్రులు, ముఖ్యమంత్రికి ఆమె అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆమెకు లాభం చేకూర్చే సంతకాలు పాలకులు చెప్పిన మేరకు అక్కడ పెడుతున్నారని అధికార వర్గాలు చెప్పుకునే వారు.
వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన శ్రీలక్ష్మి వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత జగన్‌ క్విడ్‌ ప్రోకో కేసుల్లో ఆమె బాద్యురాలయ్యారు. ఐఏఎస్‌ శ్రీలక్ష్మి జైలు పాలయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆమె ఇండస్ట్రీస్, కామర్స్‌ కార్యదర్శిగా పని చేసే వారు. ఆ సమయంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ బోర్డర్‌లోని గాలి జనార్థనరెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్‌ వ్యవహారంలో తవ్వకాలకు అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసులో ఆమెను నెలల తరబడి హైదరాబాద్‌లోని జైల్లో ఉంచాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడిలతోనే ఆమె ఓబులాపురం మైనింగ్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారని, అందుకు అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వచ్చిందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సెంట్రల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆమెను జైలుకు పంపించి ఆమె ఆరోగ్య స్థితిగతులను కూడా పట్టించుకోలేదు. జైల్లో ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వెన్నుపూసకు సంబంధించిన సమస్యలో ఆమె నిలబడి మాట్లాడలేని పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో తిరిగి శక్తిని తెచ్చుకోవాలంటే వైద్య సౌకర్యాలే ప్రధానమైన అంశం. కానీ సీబీఐ ఆ అంశానికి కూడా పెద్దగా సుముఖత చూపలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో చనిపోవడం, తర్వాత వైఎస్‌ జగన్‌ కొత్త పార్టీ పెట్టడం, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో పావులు కదపడం శ్రీలక్ష్మికి గొడ్డలిపెట్టుగా మారాయి.
మొత్తమ్మీద తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని ఓఎంసి కేసు నుంచి బయట పడేసింది. ఆమెకు ఓబులాపురం కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ తీర్పునిచ్చింది. కానీ మొత్తమ్మీద శ్రీలక్ష్మి ఓఎంసి కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు వల్ల ఆమె జీవితం పూర్తి నాశనమైందని చెప్పొచ్చు. అప్పటికే జైల్లో ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. అయితే తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మి ఓఎంసి కేసులో ఎలాంటి తప్పు చేయలేదని ప్రభుత్వం చేసినట్లే ఆమె నడుచుకుందని, తీర్పునిస్తూ ఆమెను కేసు నుంచి బయటపడేసింది. కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చినా.. ఆమె పడిన అవినీతి ముద్ర చెరిగి పోలేదు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తిరిగి పోస్టింగ్‌ ఇచ్చినా.. లూప్‌లైన్లోనే పెట్టింది. తర్వాత నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండోసారి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను సాదరంగా ఏపీకి ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లోను ఏపీకి వచ్చి ఇక్కడ పని చేయాలని ఆమెను కోరారు. ఆమేరకు ఆమె కేంద్రానికి ఒక లేఖ రాసింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కోరింది. వెంటనే కేంద్రప్రభుత్వం ఆమె లేఖను ఆమోదించి ఆమెను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ అనుమతులిచ్చింది. నిజానికి ఒక ఐఏఎస్‌ అధికారిని పట్టుబట్టి తెలంగాణ నుంచి ఏపీకి రప్పించడానికి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రయత్నాలు ఎవరు తప్పు పట్టడానికి వీల్లేందు. ఎందుకంటే ఆమె వైఎస్‌ఆర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ప్రేమతో జగన్‌ కూడా ప్రధానిని ఓప్పించి ఆమెను ఏపికి తీసుకోని రాగలిగారు.
ఐదేళ్ల కాలం జగన్‌ సర్కార్‌లో మునిసిపల్‌ శాఖతో పాటు కొన్ని ముఖ్య శాఖల్లో ఆమె ముఖ్య కార్యదర్శిగా పని చేసింది. ఇక ఆరోపణలంటారా షరా మామూలే. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోయి ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. చివరకు ప్రతిపక్ష హోదాను కూడా వారు కోల్పోయారు. జగన్‌ కోటరీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ముద్ర వేసుకున్నారని భావించినా చంద్రబాబు ప్రభుత్వం వారిపై విద్వేషపూరితమైన అక్కసును వెళ్లగక్కింది. కనీసం వారు ఇచ్చే బొకేలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రి వర్గంలోని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వీకరించ లేదంటే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో శ్రీలక్ష్మి గ్రాఫ్‌ ఏ స్థాయికి పడిపోయేలా చేశారో అర్థం చేసుకోవచ్చు . రిటైర్మెంట్‌ జీవితంలో కూడా ఆమెకు ఇబ్బందులు తప్పేలా లేవు. కారణాలు ఏమైనా కారకులు ఎవరైనా కావచ్చు. పాలకులపై అమితమైన భక్తి పనికిరాదని, ఎంత వరకు నిబంధనలు ఉన్నాయో అంత వరకు మాత్రమే పని చేయాలని శ్రీలక్ష్మి జీవితం వేరొకరికి గుర్తు చేస్తోంది. రాజకీయ వ్యవహారాల్లో అతిగా పులుముకుంటే ఎవరి జీవితాలు ఎలా ఆగమవుతాయో, శ్రీలక్ష్మి జీవితమే ఒక ఉదాహరణ.
Tags:    

Similar News