నీళ్లున్నా రాయలసీమకు రావెందుకు: బొజ్జాదశరథ రామిరెడ్డి

ఏపీని వరదలు ముంచెత్తినప్పటికీ రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీరు అందకపోవడంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By :  Admin
Update: 2024-09-12 12:23 GMT

రాయలసీమ అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, పౌర సమాజం అవగాహన, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్, 2 గురువారం నంద్యాల లో నిర్వహించడం జరిగింది. లాయర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల నుండి ప్రజా సంఘాల నాయకులు, రైతు ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథ రామిరెడ్డి రాయలసీమ అభివృద్ధి, పాలకుల బాధ్యత, పౌర సమాజం అవగాహన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాసంఘాల ప్రతినిధులకు, నంద్యాల పుర ప్రముఖులకు, రైతులకు అవగాహన కలుగజేశారు. ఇందులో ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్ లో వరద మొదలై 60 రోజులు అయినప్పటికీ శ్రీశైలం నిండుకుండ లాగా 50 రోజుల నుండి ఉన్నప్పటికీ రాయలసీమలో రిజర్వాయర్ లన్నీ వెలవెలబోతున్నాయి.

శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు నుండి రోజూ నాలుగు టి ఎం సీ లు పొందే అవకాశం ఉంది.‌ దీని ద్వారా ఈ 50 రోజుల కాలంలో 200 టి ఎం సీ ల నీటిని పొంది ఉండాలి. అదేవిధంగా మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా నాలుగు రోజులకు ఒక టీఎంసీ లాగా ఈ 50 రోజుల్లో సుమారు 12 టీఎంసీలు నీటిని పొంది ఉండాలి. మొత్తంగా ఈ రెండు మార్గాల ద్వారా సుమారు 210 tmc ల నీటిని పొంది ఉండాలి. కానీ రాయలసీమ రిజర్వాయర్ల నిర్వహణ లోపంతో, ప్రధాన కాలువల లోపంతో కేవలం 80 tmc లు మాత్రమే నిలువ చేసుకోగలిగింది. సుదీర్ఘకాలం వరద ఉన్నప్పుడు కూడా, నీటిని తీసుకునే మార్గాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల రాయలసీమ సాగునీటి రంగం అనుభవిస్తున్న దుస్థితిని దశరథరామిరెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 42 శాతం భూభాగం ఉన్నా గత పది సంవత్సరాలుగా రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమకు కేవలం 15 శాతం నిధులు కేటాయించడం వల్లనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరాయి అన్న విషయాన్ని బొజ్జా వివరించారు.

కృష్ణా డెల్టాకు కేటాయించిన 101tmc ల నీటిని నాగార్జునసాగర్ - ప్రకాశం బ్యారేజీ మధ్య తెలంగాణ నుండి ప్రవహించే మూసి, పాలేరు, మున్నేరు మొదలైన నదులు నుండి పొందే హక్కును బచావత్ కలగజేసిందని వివరించారు. కానీ ఈ హక్కును నీటిలో కేవలం 20 టి.యం.సి ల నీటిని పొందే అవకాశం ఉందనీ, మిగిలిన నీటిని నాగార్జునసాగర్ ద్వారా శ్రీశైలం నుండి పొందే లాగా జూన్ 18, 19, 2015లో జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయం జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించింది. ఇంకొక మాటలో చెప్పాలంటే కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిని సముద్రంలోకి పారబోస్తూ ఇటు రాయలసీమ అటు నాగార్జునసాగర్ వాడుకోవాల్సిన నీటిని పొందేలాగా పై సమావేశంలో తీర్మానాలు చేశారు. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ దిగువన లభించే కృష్ణా జలాలను వినియోగించుకోకపోతే పోలవరం నిర్మాణం జరిగినా ఇటు రాయలసీమ నీటి హక్కులకు, నాగార్జునసాగర్ నీటి హక్కులకు లేదా అటు పోలవరం ఎడమ కాలవ ద్వారా గోదావరి ఉత్తరాంధ్ర హక్కులకు భంగం కలిగే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ విషయాలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని బొజ్జ దశరథరామిరెడ్డి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటి అవసరాలకు శ్రీశైలం రిజర్వాయర్ అత్యంత కీలకమని ఆ రిజర్వాయర్ జీవితకాలం పెంచుకోవడం ఈ ప్రాజెక్టు మీద రెండు రాష్ట్రాల్లో ఆధారపడిన 50 లక్షల ఎకరాల సాగునీటికి అత్యవసరమని వివరించారు. ప్రాజెక్టు జీవిత కాలాన్ని పెంచడానికి ఉన్న ఏకైక మార్గం సిద్దేశ్వరం అలుగు నిర్మాణం అని వివరించారు. అదే విధంగా కృష్ణా నదిలో వరదలు రాకుండా రాయలసీమలో కరువు రాకుండా నివారించడానికి కృష్ణా నది ఎగువన గుండ్రేవుల రిజర్వాయర్, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి ఎత్తుపోతల పథకం, మాలిగ్నూర్ నుండి తుంగభద్ర వరద కాలువ చేపట్టాలని బొజ్జా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చడానికి రాయలసీమ భూభాగానికి సమానంగా రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో 42 శాతం నిధులు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు.‌

వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానాభివృద్ధి చెందడానికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన నిధులు, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ప్రత్యేక నిధులు, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను సాధించాలని కోరారు. రాయలసీమలో నెలకొల్పిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయము, మానవ హక్కుల కార్యాలయము, లోకాయుక్త కార్యాలయము , ఉర్దూ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్టుగా హైకోర్టు, సీడ్ హబ్, హార్టికల్చర్ కేంద్రాన్ని రాయలసీమ ఏర్పాటు చేయాలని కోరారు. సిడ్ హబ్, హార్టికల్చర్ కేంద్రాల లక్ష్యం నెరవేరాలంటే ఏపీ విత్తానాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ కేంద్రము, హార్టికల్చర్ కమిషనరేట్, మార్కెటింగ్, వివిధ మౌలిక వసతులను రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు.‌

రాయలసీమ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలలో రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సమావేశంలో వక్తలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్దిలో అత్యంత కీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకై కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులొ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News