మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నేటికీ కొలిక్కి రాలేదు. వివేకానందరెడ్డి హత్యకు గురై ఆరేళ్లే అవుతున్నా ఇంత వరకు కేసులో పురోగతి లేదు. విచారణ జరగడం లేదని, ట్రైల్స్ జరగడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి ఆరవ వర్థంతి సందర్భంగా పులివెందుల సమాధుల తోటలో తన తండ్రి సమాధికి నివాళులు అర్పించిన సందర్భంగా ఇటీవల ఆమె స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం ఆరేళ్లుగా తాను పోరాడుతూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులలో ఒకరు తప్ప తక్కిన వారు యధేచ్ఛగా బయట తిరుగుతున్నారని, ఇలాంటి సమయంలో తనకు న్యాయం ఎలా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు వైఎస్సార్‌సీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షులుగా ఉన్న వారు ఒక్కొక్కరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసులో ప్రధాన సాక్షి, వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.
రంగన్న మృతికి సంబంధించి మార్చి 7న నిర్వహించిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. అప్పటికప్పుడు డీజీపీని సీఎం చంద్రబాబు పిలిపించి రంగన్న మృతిపై కేబినెట్‌లో చర్చించినప్పుడు, వాచ్‌మెన్ రంగన్నది అనుమానాస్పద మృతేనని తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు, అనుమానితులుగా ఉన్న డ్రైవర్ నారాయణ యాదవ్, కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కల్లూరి గంగాధర్‌రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డిల మరణాలన్నింటిపైనా అనుమానాలు వున్నాయని, వాటిపై లోతైన విచారణ చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో డీజీపీ చెప్పినట్లు తెలిసింది. ఇందులో వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల ప్రమేయం ఉండవచ్చని డీజీపీ అనుమానం వ్యక్తం చేస్తూ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని చెప్పి ఇప్పటికి పది రోజులు గడిచినా అతీగతీలేదు. ఇంత హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివేకానందరెడ్డి హత్యకు గురై ఆరేళ్లు గడిచినా నిందితులెవ్వరన్నది ఖచ్చింతంగా తేల్చలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య మీద 2024 ఎన్నికల సమయంలో కూటమి వర్గాలు అనేక ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు తన సొంత చిన్నాన్ననే చంపించాడని చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కల్యాణ్, ఇతర నాయకులు జగన్ మీద ఆరోపణలు గుప్పించారు. నేడు అదే కూటమి నేడు అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 9 నెలలు అవుతోంది. ఎన్నికల ముందు అన్ని ఆరోపణలు గుప్పించిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఎందుకు వేగవంతం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇది వరకే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పెద్దలను కలిసి విచారణ వేగవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్‌ను కూడా సునీత కలిశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వివేకా హత్య కేసును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
అందులో భాగంగా వేగవంతంగా కేసు విచారణ జరిగే విధంగా చూడాలని కోరారు. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కేసులో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. గుండె పోటుతో రక్తపు వాంతులు చేసుకొని చనిపోయారని తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత హత్యకు గురైనట్లు నిర్థారించారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపైన సిట్ ఏర్పాటు చేశారు. తర్వాత సీబీఐకి అప్పగించాలని సునీత కోరారు. అమేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అనుమతులు పొందారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం అవుతుందా? ఆ మేరకు గవర్నర్ ఏ మైనా చర్యలు తీసుకుంటారా? నిందితులకు శిక్షలు పడుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.