Allu Arjun|అల్లు అర్జున్ ను టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది...

అల్లు అర్జున్ చేసింది తప్పు. చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిందే. అంటూ తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎందుకు ఇలా జరిగింది?;

Update: 2024-12-14 07:26 GMT

సినీ హీరో అల్లు అర్జున్ ను తెలుగుదేశం పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది అనేది ప్రస్తుతం చర్చగా మారింది. ఒకవైపు వైఎస్సార్సీపీ వారు సమర్థిస్తుంటే, టీడీపీ వారు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఎవరి సమర్థన ఎందుకు? తెలుగుదేశం, వైఎస్సార్ సీపీలు ఒకరు సమర్థిస్తే మరొకరు వ్యతిరేకించారు. భిన్నంగా స్వరాలు వినిపించడం దేశ వ్యప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకూ వ్యతిరేకత, సమర్థనలో ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం...

సినీ హీరో అల్లు అర్జున్ చాలా మంది హీరోలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. నటనలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇటీవల అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు కూడా ఇదే విధమైన సమాధానం చెప్పారు. నాకంటే గొప్పగా డ్యాన్ చేసే వారు ఉన్నారని నేనెందుకు చెప్పాలి. నాకు నేనే సాటి అంటూ పలువురిని నవ్వించారు. ఇది చాలా మందికి ఇబ్బందిగా మారింది. గతం నుంచి సినీ రంగంలో చిరంజీవి ఫ్యామిలీకి తిరుగులేదు. ఎందుకంటే వారి కుటుంబంలోని ముగ్గరు సోదరులు సినీ నటులు. వారి కుమారులు కూడా సినీ హీరోలయ్యారు. అటువంటి ఫ్యామిలీని అల్లు అర్జున్ గౌరవించడం లేదనే కోపం వారిలో ఉన్నదనే చర్చ జరుగుతోంది. చిరంజీవి భార్య తరపున వారంతా బంధువులు. అయినా అల్లు అర్జున్ తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ స్వశక్తితో సినీ రంగంలో ఎదుగుతున్నారు. ఇటీవల తాను తీసిన సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అవార్డులు రావడంతో చిరంజీవి ఫ్యామిలీ కాస్త అక్కసు పెంచుకున్నారనే చర్చ కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎర్రచందనం దొంగతనం చేసే క్యారెక్టర్ ను హీరోను చేయడం ఏమిటని వ్యాఖ్యానించారు. ప్రకృతి సంపదను కాపాడే విధంగా, సమాజాన్ని జాగృతం చేసే విధంగా సినిమాలు ఉండాలే కాని ఈ విధంగా ఉండటం ఏమిటని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉండటం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో పలు రకాల చర్చ జరిగింది. ఈ మాటలు కావాలనే పవన్ కల్యాణ్ అన్నారని, తమను కాదని జాతీయ అవార్డులు సాధించే సినిమాలు తీయడం, పాన్ ఇండియాగా మారటం చిరంజీవి ఫ్యామిలీకి ఇష్టం లేదనే, పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున కూటమిలోని తెలుగుదేశం పార్టీ కూడా అల్లు అర్జున్ ను వ్యతిరేకించిందనే చర్చ కూడా ఉంది. అల్లు అర్జున్ పై కేసు నమోదై పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నారనగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లు అర్జున్ చేసింది తప్పేనన్నారు. ప్రీమియర్ షోకు రావడం వల్లనే జనంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడానికి కారణం అయ్యాడని అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.

ఇక అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, టీడీపీ సోషల్ మీడియా వరు పోస్టులు పెట్టారు. బెయిల్ ఇవ్వడాన్ని కూడా వారు తప్పుపట్టారు. ఇంత జరురుగుతున్నా పవన్ కల్యాన్ మాట్లాడలేదు. సినీ హీరోగా కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో కానీ మంచీ చెడుల గురించి వ్యాఖ్యానించకపోవడం చర్చ నియాంశంగా మారింది. తన ముందే తనను కాదని ఎదుగుతున్నాడనే అక్కసుతోనే ఈ విధంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఎన్డీఏ కూటమి నుంచి ఏపీలో వ్యతిరేకంగా మాట్టాడటానికి కూడా ఇవే కారణాలని, అల్లు అర్జున్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే ఒంటెత్తు పోకడలు పోతున్నారని, అందుకే ఇరువురిపై తెలుగుదేశం పార్టీ అక్కసు పెంచుకుందనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గోదావరి పుష్కరాల సందర్భంగా పలువురి చావుకు కారణం అయ్యారని, ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కొందరు మురుగు కాలువలో పడి చనిపోయారని, అర్జున్ చేసింది తప్పయితే నాడు చంద్రబాబు చేసింది కూడా తప్పే కదా అంటూ అల్లు అర్జున్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి అల్లు అర్జున్ ను సమర్థించారు. ఆయన శుక్రవారం ఆయన ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. ‘హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

జగన్ అల్లు అర్జున్ ను సమర్థించారు. ప్రత్యేకంగా ట్వీట్ ఎందుకు చేశారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ కోసం వాదించిన లాయర్ వైఎస్ జగన్ కేసుల్లో వాదిస్తున్న లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి. అల్లు అర్జున్ స్నేహితుల కోర్కె మేరకు లాయర్ ను కోర్టులో బెయిల్ కోసం వాదించాల్సిందిగా వైఎస్ జగన్ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. శత్రువు, శత్రువు మిత్రుడు అన్నట్లు తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ ల మధ్య ఉన్న శత్రుత్వం అల్లు అర్జున్ కు అనుకూలంగా మారింది. ఎలాగైతేనేం కోర్టులో నరేందర్ రెడ్డి వాదించి బెయిల్ ఇప్పించగలిగారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్లు ప్రచారం కూడా సాగుతోంది. శుక్రవారం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పై జాతీయ మీడివారు అడిగినప్పుడు సమాధానం చెబుతూ చట్టానికి ఎవరైనా ఒకటే తప్పు చేసినట్లు పోలీసులు భావించారు. విచారించిన తరువాతనే అరెస్ట్ చేశారు. ఇందులో తప్పేముందన్నారు. పైగా ప్రీమియర్ షోకు వెళ్లిన అల్లు అర్జున్ సినిమా హాలులో నుంచి బయటకు వచ్చి చేతులు ఊపడం వల్లనే అభిమానుల్లో తొక్కిసలాట జరిగిందని, అందువల్ల ఆయన అక్కడ మహిళ చావుకు కారకుడన్నారు. అల్లు అర్జున్ నాకు బాగా తెలుసు, ఆయన తండ్రి కూడా బాగా తెలుసు, అర్జున్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మాకు బంధువు కూడా అవుతుంది. అయినా చట్టం తన పని తాను చేసిందన్నారు. అయితే మరో విషయం కూడా ప్రజల్లో చర్చకు వచ్చింది. పుష్ప విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్ లో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పేందుకు నీళ్లు నమిలారు. సమయానికి పేరు గుర్తుకు రాలేదు. దీంతో అభిమానులు ఓ.. అంటూ ఈలలు, కేకలు వేశారు. దీనిని సీఎం అవమానంగా భావించారని, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఏమైనా జరగాల్సింది జరిగి పోయింది. మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె కొడుకు కూడా చావు బతుకుల్లో ఉండటం గమనార్హం.

Tags:    

Similar News