ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను స్మితా సబర్వాల్ ఎందుకు రీ పోస్టుచేస్తున్నారు ?
సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ పోస్టులను ఎందుకు అదేపనిగా రీపోస్టు చేస్తున్నారు ?;
ఇపుడీ విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ పోస్టులను ఎందుకు అదేపనిగా రీపోస్టు చేస్తున్నారు ? ప్రభుత్వం మీద సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తిరుగుబాటు చేస్తున్నట్లు అనుకోవాలా ? లేకపోతే ప్రభుత్వంమీద తన అసంతృప్తిని ఈ రూపంలో వెళ్ళగక్కుతున్నారా ? అన్నదే అర్ధంకావటంలేదు. రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై అసంతృప్తి అయినా, ఆగ్రహం అయినా స్మితకు ఎందుకుంటుంది ? ఎందుకంటే బీఆర్ఎస్(BRS) హయాంలో స్మిత ఒక వెలుగువెలిగారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీ హోదాలో పనిచేసిన స్మిత అపరిమితమైన అధికారాలను అనుభవించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ హయంలో జరిగిన అవినీతి, అవకతవకల్లో స్మిత పాత్రపై రేవంత్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది.
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ళ అవినీతిపై విచారణ చేస్తున్న కమిషన్లు అనేకమందిని ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో స్మిత కూడా హాజరై తన వాదనలు వినిపించారు. అంతకన్నా ముందు రేవంత్ ముఖ్యమంత్రికాగానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్మితను పెద్దగా ప్రాముఖ్యతలేని యువజన సర్వీసులు, టూరిజం శాఖలకు ప్రిన్సిపుల్ సెక్రటరీగా నియమించారు. అప్పటినుండి స్మిత ట్విట్టర్లో చాలా యాక్టివ్ అయిపోయారు. ఇపుడు విషయం ఏమిటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU)లో వివాదాస్పద 400 ఎకరాల్లో చెట్లు తొలగించినపుడు జింకలు, నెమళ్ళున్న ఏఐ జనరేటెడ్ పోస్టులపై పెద్ద దుమారమే రేగుతోంది. ఎప్పుడైతే ప్రభుత్వ ఆదేశాలతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగి ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలను పోస్టుచేశారో వాళ్ళందరిపైనా కేసులు నమోదుచేస్తున్నారు.
ఇందులో భాగంగానే చాలామంది తమపోస్టులను డిలిట్ చేసేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ ఫొటో పోస్టును రీపోస్ట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు స్మితకు నోటీసులు జారీచేశారు. దానికి స్మిత ఏమి సమాధానం ఇచ్చారో లేకపోతే ఇస్తారో తెలీదుకాని సీనియర్ ఐఏఎస్ అధికారికి పోలీసులు నోటీసులు ఇవ్వటాన్ని తప్పుపట్టిన రెండు ట్వీట్లను స్మిత మళ్ళీ రీపోస్టుచేశారు. ఆ రెండు పోస్టుల్లో ‘తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా’ ? ఇది దేనికి సంకేతం ? అని ప్రశ్నించారు. అలాగే సుప్రింకోర్టు తెలంగాణ(Telangana) ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు లైవ్ లా. ఇన్ వెబ్ సైట్లో వచ్చింది. లైవ్ లా. ఇన్ లో వచ్చిన పోస్టును స్మిత తన ఖాతాలో రీపోస్టు చేయటం సంచలనంగా మారింది.
హెచ్సీయూ వివాదాన్ని ప్రభుత్వం, సుప్రింకోర్టు చూసుకుంటాయి. ఈవివాదంపై ప్రతిపక్షాలు, ప్రభుత్వంతో సంబంధంలేని ప్రజాసంఘాలు, సంస్ధలు, వ్యక్తులు అనేకరకాలుగా స్పందిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం ఇబ్బందిపడేట్లుగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు బాహాటంగా మాట్లాడేందుకు లేదు. ఎందుకంటే ప్రభుత్వసర్వీసులో ఉంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, లేదా నడుచుకోవటం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధం. ఈవిషయం కిందస్ధాయిలో పనిచేసే అటెండర్ నుండి చీఫ్ సెక్రటరీవరకు అందరికీ వర్తిస్తుందని స్మితకు తెలియనిదేమీకాదు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను రీపోస్టులు చేయకూడదని తెలిసి కూడా స్మిత ఎందుకు రీపోస్టులు చేస్తున్నారు ? గతంలో కూడా ఈసీనియర్ ఐఏఎస్ అధికారి అంగవికలాంగ కోటాలో ఐఏఎస్ కు ఎన్నికైన మహిళా అధికారి విషయంలో స్పిందించినపుడు పెద్ద దుమారమే రేగింది. కాకపోతే ఆవివాదంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదు కాబట్టి ప్రభుత్వపెద్దలు పట్టించుకోలేదు.
అయితే ఇపుడుమాత్రం స్మిత డైరెక్టుగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే పోస్టులను తన ట్విట్టర్ ఖాతాలో రీపోస్టులు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలో పెద్ద చర్చే నడుస్తోంది. తనను రేవంత్ ప్రభుత్వం కావాలనే అప్రాధాన్య పోస్టులో నియమించిందనే కోపం ఆమెలో బాగా ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకనే తనలోని ఆగ్రహాన్ని, అసంతృప్తిని స్మిత ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను రీపోస్టు చేయటం ద్వారా బయటపెడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి స్మిత వైఖరిపై రేవంత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.