ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర నిధులు ఎందుకు తగ్గాయి?

2024-25లో ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ తో ఈ సంవత్సరం పోలిస్తే 26 శాతం తగ్గాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఎందుకు తగ్గాయి?;

Update: 2025-05-15 04:30 GMT
ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,34,208 కోట్ల సొంత ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇది గత ఏడాది కంటే 29 శాతం అధికం. ఈ లక్ష్యం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు, అటవీ శాఖల నుంచి వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు వాణిజ్య పన్నులు, అటవీ ఆదాయంలో తగ్గుదల కనిపిస్తే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఊహించని విధంగా ఆదాయం పెరిగింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గత ఏడాది (2024-25) ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం తగ్గాయి. గత ఏడాది రూ. 17,170 కోట్లు రాగా, ఈ ఏడాది రూ. 12,717 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ తగ్గుదలకు కారణాలు ఏమిటి? కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై వివక్ష చూపుతోందా? ఈ అంశాలను విశ్లేషిద్దాం.

ఫ్రొఫెసర్ కేఎస్ చలం ఏమన్నారంటే...

రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు పెరగాలి. అంటే పరిశ్రమలు, వ్యవసాయ ఆదాయం, మ్యానిఫ్యక్చరింగ్ యూనిట్లు వంటివి పెరగాలి. దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. అప్పుడు జీఎస్టీ వస్తుంది. అదే రాష్ట్ర ఆదాయానికి మూలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు చాలా వరకు తగ్గాయి. అందుకు కారణం ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవడం, అందుకు కారణం ఆర్థిక పరిస్థితిని పెంచేవిధమైన ఆదాయ వనరులు పెరగక పోవడమేనని అన్నారు. పంట పొలాలు రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారుతున్నాయి. ఒక్క అమరావతికే లక్ష ఎకరాలు పోతోంది. అటువంటప్పుడు వ్యవసాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అన్ని విషయాలను చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. అందువల్ల ఆర్థిక వనరులు పెరిగితే తప్ప రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉండదని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వాలన్నా జీఎస్టీ ఆధారంగానే చూస్తుందని అన్నారు.

15వ ఆర్థిక సంఘం సిఫార్సులు

15వ ఆర్థిక సంఘం (2021-22 నుంచి 2025-26) సిఫార్సుల ప్రకారం, రాష్ట్రాలకు కేంద్ర పన్ను వాటా 41 శాతంగా నిర్ణయించింది. ఇది 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 42 శాతం కంటే 1శాతం తక్కువ. ఈ తగ్గుదల జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల కోసం జరిగిన సర్దుబాటు వల్ల వచ్చింది. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లలో గణనీయమైన భాగం (రూ. 2.95 లక్షల కోట్లలో 87 శాతం) 2021-22 నుంచి 2023-24 మధ్య కాలంలోనే రాష్ట్రాలకు విడుదల చేశారు. 2025-26లో ఈ గ్రాంట్లు తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర నిధులు తగ్గాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.


ఆర్థిక సంఘం గ్రాంట్ల తగ్గుదల

ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ డెఫిసిట్ (Revenue Deficit) (ప్రభుత్వం రోజువారీ అవసరాల కోసం ఉదా.. జీతాలు, సబ్సిడీలు, పరిపాలన ఖర్చులు వంటి వాటికోసం ఖర్చు చేసే మొత్తం. దాని ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే, ఆ తేడాను రెవెన్యూ డెఫిసిట్ అంటారు.) గ్రాంట్లు 2025-26లో తగ్గాయి. ఎందుకంటే ఈ గ్రాంట్లు ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలంలో మొదటి మూడేళ్లలోనే ఎక్కువగా విడుదలయ్యాయి. ఈ సంవత్సరం కేంద్రం నుంచి రావాల్సిన రూ. 17,170 కోట్లలో రూ.12,717 కోట్లు మాత్రమే రావడం ఈ విధానపరమైన తగ్గుదలను సూచిస్తుంది.

కేంద్ర ఆర్థిక లోటు లక్ష్యాలు

కేంద్ర ప్రభుత్వం 2025-26లో ఆర్థిక లోటును జీడీపీ (Gross Domestic Product)లో 4.4 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో ఆర్థిక లోటు జీడీపీలో 4.8 శాతంగా ఉంది. అంటే ప్రభుత్వ ఖర్చు ఆదాయం కంటే 4.8 శాతం ఎక్కువగా ఉంది. 2025-26లో దీనిని 4.4 శాతానికి తగ్గించడం ద్వారా, ప్రభుత్వం తన ఖర్చులను మరింత నియంత్రించి, ఆదాయాన్ని పెంచడానికి లేదా ఖర్చులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇది ఆర్థిక క్రమశిక్షణకు సంకేతం.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం ఖర్చులను కట్టడి చేస్తోంది. ఇందులో రాష్ట్రాలకు గ్రాంట్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు తగ్గడం ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా కూడా చూడవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (2014) హామీలు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందించాలని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ హామీలు పూర్తిగా అమలు కాలేదని రాష్ట్ర రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. 2025-26 బడ్జెట్‌లో రాష్ట్రాలకు రూ. 1.5 లక్షల కోట్ల ఇంటరెస్ట్-ఫ్రీ రుణాలు ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఈ నిధులలో ఎంత వాటా వస్తుందో స్పష్టత లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

రాజకీయ కోణం

కేంద్రంలో అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లోని NDA కూటమి (TDP, BJP, JSP) మధ్య సమన్వయం ఉన్నప్పటికీ, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కేంద్రం రాష్ట్రానికి తగిన నిధులను కేటాయించడంలో విఫలమైందని వాదిస్తున్నారు. గతంలో YSRCP ప్రభుత్వం కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గుదల విధానపరమైన కారణాల వల్ల ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.

వివక్షకు సంబంధించిన వాదనలు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్రం రాజధాని లేని, ఆర్థికంగా బలహీనమైన స్థితిలో ఉంది. ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ హామీలు పూర్తిగా నెరవేరలేదు. ఇది కేంద్రం రాష్ట్రంపై తగిన శ్రద్ధ చూపడం లేదనే భావనను ప్రజల్లో కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలతో (ఉదా., ఉత్తరప్రదేశ్, బిహార్) పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర నిధుల కేటాయింపు తక్కువగా ఉందని కొందరు వాదిస్తున్నారు.

రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యాలు

వాణిజ్య పన్నులలో GST 3శాతం తగ్గింది. తమిళనాడు 13 శాతం పెరిగింది. తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం పెరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు శక్తి తగ్గినట్లు సూచిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల స్తబ్దత లేదా పన్ను ఎగవేత వల్ల కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎర్రచందనం వంటి వనరుల విక్రయాల ఆటంకాల వల్ల అటవీ ఆదాయం తగ్గిందనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో పెరుగుదల

ఫిబ్రవరి 1, 2025 నుంచి సవరించిన భూమి రిజిస్ట్రేషన్ విలువలు అమలులోకి రావడంతో, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు 68,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో రూ. 475.44 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పెరుగుదల రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, సరళీకృత రిజిస్ట్రేషన్ ప్రక్రియల వల్ల సాధ్యమైందని ప్రభుత్వం చెబుతోంది.

వ్యూహాత్మక చర్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ వనరులను పెంచేందుకు 30 ఏళ్ల డేటా ఆధారంగా ప్రణాళికలు రూపొందించాలని, పన్ను ఎగవేతను అరికట్టడానికి కృత్రిమ మేధస్సు (AI) వినియోగించాలని ఆదేశించారు.

Tags:    

Similar News