జీవో 22ని తులసిరెడ్డి భోగి మంటల్లో దహనం చేశారెందుకు?
కాంగ్రెస్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి వినూత్న నిరసన తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22ను భోగి మంటల్లో దహనం చేశారు.;
By : Admin
Update: 2025-01-14 12:23 GMT
సంక్రాంతి సందర్భంగా కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి వినూత్న నిరసన తెలిపారు. 2020లో ఆనాటి వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22ను భోగి మంటల్లో దహనం చేశారు. ఎప్పుడో నాలుగేళ్ల నాడు జారీ చేసిన జీవోను ఆయన ఈ భోగినాడు వేంపల్లిలో వేసిన భోగి మంటల్లో దహనం చేశారు.
ఇంతకీ ఆ జీవో కథాకమామిషు ఏమిటీ?
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1న ఓ ఉత్తర్వు ఇచ్చింది. ఆ జీవో నెంబరు 22. ఇప్పుడు దాన్ని తులసిరెడ్డి దహనం చేశారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి రైతుల పండుగ అని, అందువల్లనే రైతు వ్యతిరేక జీవో 22 ప్రతిని భోగి మంటల్లో వేసి కాల్చివేశామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
" గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా వ్యవసాయ రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ సరఫరా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, సున్నా వడ్డీ ,పావలా వడ్డీ రుణాలు ,జల యజ్ఞం ఇలా అనేక రైతు అనుకూల విధానాలు అమలు చేశాయి. దురదృష్ట వశాత్తూ ఆ తర్వాత వచ్చిన వైసీపీ, టిడిపి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేసింది. దీనివల్ల రైతుల జీవితాలలో సంతోషం కలిగింది. దురదృష్ట వశాత్తూ జగన్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే దురుద్దేశంతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని 2020 సెప్టెంబర్1 న జీవో 22 జారీ చేసింది."
"కాంగ్రెస్ పార్టీ, వామ పక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగా మీటర్లు కొన్నప్పటికీ బిగించలేదు కాని ఆ జీవో అలాగే ఉంది. అధికారం లోకి వస్తే జీవో 22ను రద్దు చేస్తామని టిడిపి, జనసేన పార్టీలు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా జీవో 22 ను రద్దు చేయలేదు. అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రతి రైతుకు ఏటా రూ 20,000 ఆర్థిక సాయం చేస్తామని టిడిపి కూటమి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఖరీఫ్ సీజన్ అయిపోయింది. రబీ సీజన్ పూర్తికావొచ్చింది. అయినా ఇప్పటి వరకు 20 రూపాయల ఆర్థిక సాయం కూడా రైతుకు చేయలేదు. అందువల్ల రైతుల ముఖాలలో సంక్రాంతి సంతోషం కనిపించడం లేదు" అన్నారు తులసిరెడ్డి.
మకర సంక్రాంతి సందర్భంగా నైనా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలలో రు 20,000 లు వేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 22 ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
జీవో నెంబర్ 22ను దహనం చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రామ కృష్ణ, అమర్ నాథ్ రెడ్డి, ఉత్తన్న, నాగ రాజు, వినయ్, బద్రి వెంకటేష్, మహబూబ్ బాషా, సుబ్బ రాయుడు, వేమా రాజా, వేమయ్య, మాధురీ రెడ్డి కూడా ఈ జీవోను రద్దు చేయాలన్నారు.
రైతే రాజు అని మెచ్చుకుంటే సరిపోదని, రైతుకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అన్నారు.