గరివిడి వెటర్నరీ కాలేజీని ఎందుకు ఇలా చేశారు?

విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ కాలేజీలో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన వెటర్నరీ కౌన్సిల్ వాళ్లను మభ్య పెట్టి అనుమతి సంపాదించారు.;

Update: 2025-01-20 10:04 GMT

వెటర్నరీ విద్య సాఫీగా ముందుకు సాగటం లేదు. పశు సంపద బాగా పెరగాలని చెబుతున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా వైద్యులను తయారు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ పశు వైద్య కళాశాలలు ఉంటే వాటిని నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అర్థమవుతోంది. కాలేజీలో సిబ్బంది, అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 70 మంది వెటర్నరీ విద్యార్థులు ఉన్నారు. వీరు కాకుండా ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకునే వారు ఉన్నారు. కాలేజీ నిర్మాణం గత ఏడాదితో పూర్తయింది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సౌకర్యాల కల్పన విషయంలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. గత రెండు సంవత్సరాల్లో అనుమతి తీసుకోలేక పోయారు. దీంతో ప్రస్తుతం ఉన్న 70 మంది విద్యార్థులే ఫైనల్ ఇయర్ కు వచ్చారు.

వచ్చే ఏడాది కాలేజీకి వీసీఐ అనుమతి వచ్చింది..

ఈ సంవత్సరం జనవరి నెల 12,13,14 తేదీల్లో వీసీఐ కాలేజీలో పర్యటించింది. అన్ని వసతులు పరిశీలించి ఓకే చెప్పింది. దీంతో ఈ ఏడాదికి వీసీఐ కౌన్సిల్ ఆమోదం లభించినట్లైంది. ఈ సంవత్సరం మార్చికి ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యాభ్యాసం పూర్తవుతుంది. వీరికి ఐదేళ్లుగా సరిగ్గా క్లాసులు జరగలేదు. కాలం గడిపారు. పాస్ విషయంలో భయపడుతున్నారు. మంచి మార్కులు రాకపోయినా పరవాలేదు. పాస్ అయి బయటకు వెళితే సరిపోతుందనే ఆలోచనలో విద్యార్థులు ఉన్నారు.

వీసీఐ వచ్చినప్పుడు మభ్యపెట్టిన అధికారులు

వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కాలేజీకి 2025-26 కు అనుమతులు ఇచ్చేందుకు పరిశీలనకు వచ్చారు. వారు వచ్చిన సమయంలో తిరుపతి లోని వెటర్నరీ యూనివర్శిటీ వీసీ, అక్కడి అధికారులు మాట్లాడుకుని తిరుపతి, గన్నవరం కాలేజీల నుంచి 2024 నవంబరు 11న 40 మంది ఫ్రొఫెసర్స్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్స్ ను బదిలీపై పంపించింది. ఒక్కసారిగా అన్ని విభాగాల్లోనూ ప్రొఫెసర్స్ కనిపించడంతో అప్పటికే అక్కడ ఉన్న సుమారు 20 మంది అధ్యాపకులు కలిసి కౌన్సిల్ ముందు హాజరయ్యారు. వారు వెళ్లిపోయిన తరువాత ఈనెల 15న 18 మంది ఫ్రొఫెసర్స్ ను కాలేజీ నుంచి డిప్యుటేషన్ పై గన్నవరం, తిరుపతి పంపిస్తూ ఆర్డర్స్ వీసీ ఇచ్చారు. దీంతో వారంతా వెళ్లిపోయారు. ఈ డిప్యుటేషన్ లు రాజకీయంగా జరిగినవేననే అనుమానం చాలా మందికి వస్తోంది.

కొత్త వారు కాలేజీలో చేరేందుకు భయపడుతున్నారు..

కొత్తగా వచ్చే విద్యా సంవత్సరానికి కాలేజీలో చేరేందుకు విద్యార్థులు భయపడుతున్నారని ప్రస్తుత విద్యార్థులు తెలిపారు. ఫ్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అవసరమైనంత మంది లేని మాట వాస్తవమని, వాస్తవాలు చెప్పేందుకు ముందుకు రాకుండా అధికారులు మా నోరు నొక్కారని తెలిపారు. కౌన్సిల్ వారు వెళ్లిన వారం రోజులకే వారిని డిప్యుటేషన్ పై పంపిస్తున్నారంటే కాలేజీని ఏమి చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదని విద్యార్థులు తెలిపారు. వెనుకబడిన జిల్లాలో మంచి అవకాశం వచ్చిందనుకుంటే ఇలా ఎందుకు తయారైందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొత్త బ్యాచ్ చేరితో అధ్యాపకులు లేకుండా ఏమీ నేర్చుకోలేమనే భయంతో ఉన్నారు. అదే జరిగితే కాలేజీలో విద్యార్థులు చేరని కారణంగా కాలేజీని ఎత్తేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వీసీకి అర్జీలు

తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ వీసీకి ఏఐఎస్ఎఫ్ వాళ్లు ఇప్పటికే పలు సార్లు అర్జీలు ఇచ్చారు. వెంటనే పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను నియమించాలని కోరారు. అయినా యూనివర్సిటీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీని వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కనీసం అధ్యాపకుల నైనా నియమించాలని వారు కోరారు.

కాలేజీకి 86 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవసరం

గరివిడి వెటర్నరీ కాలేజీకి 86 మంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారని, కౌన్సిల్ సభ్యులు వచ్చినప్పుడు 50 మంది ఉన్నట్లు చూపించి మభ్య పెట్టారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ తెలిపారు. మంచి పశువైద్యులను తయారు చేస్తేనే రైతులు పశు సంపద పెంపకంపై దృష్టి పెడతారన్నారు. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండేళ్లు అనుమతి లేకపోవడంతో అడ్మిషన్లు కూడా జరగలేదని అన్నారు. తిరుపతి వెంటర్నరీ యూనివర్సిటీ ఇన్ చార్జ్ వీసీ జీవి రమణకు పరిస్థితిని వివరించి వెంటనే బోధనా సిబ్బందిని నియమించాలని కోరినట్లు తెలిపారు. సిబ్బంది నియామకంలో నిర్లక్ష్యం వహిస్తే వెంటనే ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News