చంద్రబాబు ఢిల్లీ యాత్రల వెనుక అసలు కథ ఏమిటీ?
రాష్ట్ర ప్రయోజనాలా లేక లోకేశ్ ను సీఎం చేసే తాపత్రయమా – చంద్రబాబు యాత్రల విశ్లేషణ;
By : Amaraiah Akula
Update: 2025-05-24 08:33 GMT
2014కి ముందు చంద్రబాబు..
"కాంగ్రెస్ ముఖ్యమంత్రులు స్వయంగా పాలించలేక, ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తారు."
"ప్రజలకేమో కష్టాలు, ఢిల్లీలో అధిష్టానానికి కాసులు"
"ఒక ముఖ్యమంత్రి ఫైలుతో ఢిల్లీ వెళ్తూ approvals తీసుకోవడమంటే అది రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టడమే."
ఇవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాలలో అన్న మాటలు. కాంగ్రెస్ పార్టీ సీఎంలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు.
2024 తర్వాత చంద్రబాబు..
అటువంటి చంద్రబాబు ఇప్పుడు తన శైలికి భిన్నంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎందుకు? ఏ ప్రయోజనాలను ఆశించి ఆ పని చేస్తున్నారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం.
వచ్చే జూన్ 12 నాటికి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి సరిగ్గా ఏడాది. ఈ 12 నెలల కాలంలో ఆయన డజను సార్లు ఢిల్లీకి వెళ్లి రావడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది.
రాజకీయంగా స్వతంత్ర నేత చంద్రబాబు. ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర ప్రయోజనాల కోసం తలొంచే వ్యూహం అని టీడీపీ వర్గాలు చెబుతున్నా, అసలు ఫలితాలు ఏమిటన్నది ప్రశ్నార్హమే. ఢిల్లీ యాత్రలు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించినపుడు వాటికి అర్థం ఉంటుందే తప్ప లేకుంటే న్యూస్ హెడ్లైన్లకో, టీవీ ప్రసారాలకో పనికి వస్తాయి. చరిత్రకు నిలబడవు.
రాజకీయ వ్యూహమా? అవసరాల పోకడా?
2024 జూన్‌లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి డజను సార్లు ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం.
ఢిల్లీ పర్యటనల వివరాలు..
జూలై 4, 2024 – ప్రధాని మోదీతో తొలి భేటీ: పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు నిధుల కోసం చర్చ
జూలై 16, 2024 – హోం, ఆర్థిక మంత్రులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై దృష్టి
అక్టోబర్ 7, 2024 – అమరావతికి కేంద్ర మద్దతు కోరుతూ ప్రధాని మోదీతో సమావేశం.
జనవరి 19, 2025- దావోస్ పర్యటనకు ముందు ఢిల్లీ పర్యటన, ప్రముఖులతో భేటీ
జనవరి 24, 2025- దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులతో భేటీ
జనవరి 31, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం
ఫిబ్రవరి 19, దేశ రాజధాని ఢిల్లీలో కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు సభకి
మార్చి 19, 2025 చంద్రబాబు బిల్ గేట్స్ తో సమావేశం
ఏప్రిల్ 25, 2025 – అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని ఆహ్వానం
మే 22 , 2025- కేంద్ర మంత్రులతో భేటీ
(నెల గ్యాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు రెండుసార్లు వెళ్లడం ఆసక్తికరం)
తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబుకు ఢిల్లీ అధిష్టానం లేదు. ఆయన పార్టీకి ఆయనే బాస్. ఎవరి మార్గదర్శకత్వం అక్కర్లేదు. అలాంటప్పుడు ఆయన తరచూ కేంద్ర నాయకత్వాన్ని కలవడంలో ఉన్న పరమార్థం ఏమిటీ? ఇది ఆయన వ్యక్తిగత ధోరణికి విరుద్ధమైనది కాదా?
చంద్రబాబు 2024 జూన్ లో ఏ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారో ఏడాది తర్వాత కూడా అదే జాబితాతో కేంద్ర మంత్రుల్ని, ప్రధానిని కలుస్తున్నారు.
వాటిలోప్రధానమైనవి అమరావతి రాజధాని నిర్మాణం, నిధులు, నీళ్లు, నియామకాలు. ఆశించిన పెట్టుబడులు రాలేదు. పెన్షన్లు తప్ప మిగతా సంక్షేమాలు ప్రారంభం కాలేదు. రైతులకు కనిష్ఠ ధర హామీ లభించలేదు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం కునారిల్లుతోంది. ఇప్పుడా గడువు 2027కి చేరింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు తగ్గట్టుగా నిధుల సమీకరణ జరగలేదు. ఈ నేపథ్యంలో తరచూ ఢిల్లీ వెళ్లడం వ్యూహాత్మకమా లేక పరాధీనతా? అనే చర్చసాగుతోంది.
వ్యూహాత్మకమైన అడుగా?
దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, పెట్టుబడులు అందించాలంటే, కేంద్ర ప్రభుత్వంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్న మాట నిజమే అయినా పదేపదే వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నది మింగుడు పడడం లేదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. "ఆయన ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయన మద్దతుపైన్నే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది. అలాంటపుడు తరచూ ఢిల్లీకి వెళ్లడం ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు" అన్నారు వైఎస్ షర్మిల.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు యాత్రలను ఎద్దేవా చేశారు. "చంద్రబాబు రాష్ట్ర ప్రతిష్టను కించపరిచేలా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికి 12 సార్లు వెళ్లారు. ఏమి సాధించారో చెప్పమనండి? చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అవేమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు" అన్నారు.
ఇక మీడియా పరంగా, టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు పర్యటనలను సమర్థిస్తుండగా ప్రతికూల మీడియా విమర్శిస్తోంది. జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దాలంటే ఢిల్లీ నుంచి నిధులు కావాలని, అందుకే పదేపదే వెళ్లాల్సివస్తోందని వ్యాఖ్యానిస్తోంది.
అధికార పార్టీ స్పందన
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలుగా పేర్కొంటున్నాయి. "కేంద్ర మంత్రులతో సమావేశాలు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల నిధుల కోసం ఈ పర్యటనలు జరుగుతున్నాయి తప్ప జగన్ మాదిరి స్వప్రయోజనాల కోసం కాదు" అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు.
గ్రాంట్స్ కోసం తంటాలు..
అయితే రాజకీయ విశ్లేషకుల మాట వేరుగా ఉంది. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే లక్షల కోట్ల నిధులు కావాలి. అవి వచ్చే మార్గం లేదు. కేంద్రం కనికరిస్తే మార్గం లేదు. అందుకే బహుశా ఈ యాత్రలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
"చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని జార విడిచారు. 2024 జూన్ కి ఇప్పటికి కేంద్రంలో పరిస్థితి మారింది. ఆయన సీఎం అయిన కొత్తలో మోదీ చంద్రబాబుపై ఆధారపడి ఉన్నారు. ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పరిస్థితి తారుమారైంది. దానికి నిదర్శనమే రాజధాని పనులు పునఃప్రారంభించడానికి వచ్చిన మోదీ నయాపైసా ప్రకటించకుండా వెళ్లడం. ఆ పరిస్థితి అర్థమయ్యే చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు" అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ప్రజలకు అభివృద్ధి చూపించాలంటే నిధులు కావాలి. అందుకే ఈ తాపత్రయం అన్నారు ఆయన.
దాదాపు ఇదే అభిప్రాయాన్ని సామాజిక విశ్లేషకుడు డి.నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు ఎస్.కే.డానీ వ్యక్తం చేశారు. "నిధులు లేవు కనుక అదొక వేట. తన వంతు ప్రయత్నం చేశానని ప్రజలకు కనపడడం, నిధులు రాకుంటే (రావు అని తెలుసు కనుక) అపవాదు ఆ పార్టీ (బీజేపీ) మీద, కేంద్రం మీద ఉంటుంది" అన్నారు డి.నరసింహారెడ్డి.
"గ్రాంట్ తెచ్చుకోవడం కోసమే ఈ తంటాలు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు ప్రజలకు ఇంకా అందలేదు. రియల్ ఎస్టేట్ పెరగలేదు. పెట్టుబడులు పెట్టాలా లేదా అని వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. కొత్తగా భూమి సమీకరణ బెడిసి కొట్టింది. జనం ఆశించింది ఇంకా రాలేదు. అందువల్ల ప్రజల నుంచి పెరిగే వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రయత్నం కావొచ్చు " అన్నారు డానీ.
లోకేశ్ ను సీఎం చేయడానికేనా?
చంద్రబాబంటే గిట్టని వాళ్లు- తన కుమారుడు లోకేశ్ ను త్వరలో ముఖ్యమంత్రిని చేయడానికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడనే వాదనను తెర మీదికి తీసుకువస్తున్నారు. టీడీపీకి శాసనసభలో మెజారిటీ ఉంది గనుక ఆయనకు అది పెద్ద కష్టం కాదని, అయితే చంద్రబాబు ఇప్పుడిప్పుడే ఆ పని చేయకపోవచ్చునని కొట్టిపారవేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. కానీ సీనియర్ జర్నలిస్టు డానీ అభిప్రాయం వేరుగా ఉంది. 'రాష్ట్రాభివృద్ధి కళ్లకు కనిపించనపుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అప్పుడు జగన్ మళ్లీ వస్తాడేమో అని భయం చంద్రబాబుకు ఉండడం సహజమే. ఇప్పుడే లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేయాలంటే పవన్ కల్యాణ్ అంగీకారం అవసరం. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ ను సైలెంట్ చేసేందుకు మోదీ ద్వారా ఏమైనా ప్రయత్నం జరుగుతుండవచ్చు' అన్నారు డానీ. లోకేశ్ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీ, జనసేన అంగీకారం కూడా ఉండాలన్నదే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ' బీజేపీ తలచుకుంటే ప్రాంతీయ పార్టీలను చీల్చడం చాలా సులువని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి. బీజేపీ బలం తెలియడం వల్లే చంద్రబాబు పదేపదే ఆ పార్టీ పెద్దల్ని కలుస్తుండవచ్చు. బహుశా కొడుకుని సిఎం చేయడానికి కూడా పడుతున్న తంటాలు కావచ్చు' అన్నారు డాక్టర్ నరసింహారెడ్డి.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా ఇంతవరకు రాజధాని లేదు. పారిశ్రామికాభివృద్ధి లేదు. సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వ తీరుపై ఆరోపణలు, పునర్నిర్మాణ యత్నాలతో ప్రజలు సమాధాన పడే పరిస్థితి లేదు.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏదైనా చేసి చూపించాలి. అది అందరికీ కనిపించేది అయి ఉండాలి. ఆ దిశగా అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పినా బీజేపీతో సఖ్యత వల్లే తనకు గానీ తన కుటుంబానికి గానీ రాష్ట్రానికి గాని ప్రయోజనం ఎక్కువని భావిస్తున్నారని మరో సామాజిక విశ్లేషకుడు ఎం.శేషగిరి అన్నారు.